breaking news
Gas Fields
-
సఖాలిన్–1 క్షేత్రాల్లో ఓవీఎల్‌కు 20 శాతం వాటాలు
న్యూఢిల్లీ: రష్యాలోని సఖాలిన్–1 చమురు, గ్యాస్ క్షేత్రాల్లో తిరిగి 20 శాతం వాటాలను తీసుకున్నట్లు ప్రభుత్వ రంగ దిగ్గజం ఓఎన్జీసీ విదేశ్ వెల్లడించింది. ఈ ప్రాజెక్టు ఆపరేటర్ అయిన అమెరికన్ సంస్థ ఎక్సాన్‌మొబిల్ అనుబంధ కంపెనీ ఎక్సాన్ నెఫ్ట్‌గాజ్‌ను పక్కకు తప్పించి, దానికి సంబంధించిన అసెట్స్ అన్నింటిని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ గతేడాది కొత్త ఆపరేటర్‌కు బదలాయించారు. గతంలో తమకున్న వాటాలను తిరిగి తీసుకునేందుకు దరఖాస్తు చేసుకోవాలంటూ అప్పట్లో షేర్‌హోల్డర్లయిన జపాన్ సంస్థ సోడెకో కన్సార్షియం, ఓవీఎల్‌కు రష్యా ప్రభుత్వం సూచించింది. దానికి అనుగుణంగానే ఓవీఎల్ దరఖాస్తు చేసుకోగా, తదనుగుణంగా గతంలో దానికి ఉన్నంత వాటాలను కేటాయించింది. సోడెకో కూడా తన వాటాను అట్టే పెట్టుకుంది. అయితే, ఎక్సాన్‌మొబిల్ విషయంలో స్పష్టత రాలేదు. గతంలో సఖాలిన్1లో ఎక్సాన్ నెఫ్ట్గ్యాస్, సోడెకో సంస్థలకు చెరి 30 శాతం, రాస్‌నెఫ్ట్‌కు 20 శాతం వాటాలు ఉండేవి. 2001లో ఓవీఎల్ ఇందులో 20 శాతం వాటాలు తీసుకుంది. గతేడాది అక్టోబర్‌లో ఈ ప్రాజెక్టును సఖాలిన్–1 లిమిటెడ్ లయబిలిటీ కంపెనీకి రష్యా బదలాయించింది. ఈ కొత్త కంపెనీలో ఓవీఎల్, రాస్‌నెఫ్ట్‌కు చెరి 20 శాతం, సోడెకోకు 30 శాతం వాటాలు ఉండగా.. ఎక్సాన్‌మొబిల్ వాటా విషయంలో ఇంకా ఏమీ తేలలేదు. ఉక్రెయిన్ మీద దాడికి ప్రతిగా రష్యాపై ప్రపంచ దేశాలు ఆంక్షలు విధించిన నేపథ్యంలో గతేడాది ఏప్రిల్‌లో సఖాలిన్–1 నుంచి ఉత్పత్తిని ఎక్సాన్ నెఫ్ట్గాజ్ నిలిపివేసింది. ఉక్రెయిన్ యుద్ధానికి ముందు సఖాలిన్–1లో రోజుకు 2,20,000 బ్యారెళ్ల (బీపీడీ) చమురు ఉత్పత్తయ్యేది. నవంబర్ నుంచి మళ్లీ 1,40,000–1,50,000 బీపీడీ మేర ఉత్పత్తి మొదలుపెట్టారు. -
విదేశీ చమురు, గ్యాస్ క్షేత్రాలు భారీగా కొనాలి: ధర్మేంద్ర ప్రధాన్
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు దాదాపు సగానికి తగ్గిపోయిన నేపథ్యంలో.. విదేశీ చమురు, గ్యాస్ క్షేత్రాలను భారత్ భారీగా కొనుగోలు చేయాలని చమురు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చెప్పారు. అలాగే, దేశీయంగానూ ఇంధన అన్వేషణ కార్యకలాపాలు పెంచాలని, వ్యూహాత్మక నిల్వలను ఏర్పాటు చేసుకోవాలని ఆయన పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీతో జరిగిన సమావేశంలో పారిశ్రామిక దిగ్గజాలు ఈ మేరకు అభిప్రాయాలు వెలిబుచ్చినట్లు ప్రధాన్ తెలిపారు. చమురు రేట్లు తగ్గడంతో ఆంధ్రప్రదేశ్‌లోని వైజాగ్, కర్ణాటకలోని మంగళూరు, పాడూరులలోని వ్యూహాత్మక కేంద్రాల్లో నిల్వలు పెంచుకోవాలని వ్యాపారవేత్తలు సూచించినట్లు ఆయన చెప్పారు.