breaking news
gadwal town
-
ఏడాదిలో రూ.70 కోట్లు తాగేశారు
గద్వాల : అక్షరాలా రూ.70 కోట్లు. మద్యం ప్రియులు తాగుడుకు తగలేసిన మొత్తం ఇది. ఆదాయం కోసం ప్రజల బలహీనతలను సొమ్ము చేసుకుంటోంది ప్రభుత్వం. 2014 జూలై 1 నుంచి 2015 జూన్ 30 వరకు అంటే ఒక్క ఏడాదిలో తాగుడుకు ఇంత వెచ్చించారు. టార్గెట్ల కోసం ఆబ్కారీశాఖ అధికారులే స్వయంగా బెల్టుషాపుల సంసృ్కతిని ప్రోత్సహిస్తున్నారు. దీంతో తాగునీరు దొరకని గ్రామాల్లో సైతం మద్యం ఏరులై పారుతోంది. ఈ ఏడాదిలో ప్రభుత్వ లెక్కల ప్రకారమే సుమారు రూ.70 కోట్ల మేర అమ్మకాలు జరిగాయని తెలిసింది. అనధికారిక లెక్కలైతే ఇది మరికొంత పెరిగి ఉంటుంది. బేవరీస్ కార్పోరేషన్ లిమిటెడ్ నుంచి గద్వాల నియోజకవర్గంలోని (అయిజతో కలుపుకొని) వివిధ మద్యం దుకాణాలకు ఏడాదిలో రూ.50 నుంచి రూ.55 కోట్ల మద్యం విక్రయాలు జరిగాయి. దీనిపై మరో 20 నుంచి 25 శాతం వరకు మార్జిన్‌తో మద్యం ప్రియులకు విక్రయిస్తారు. అంటే మొత్తంమీద సుమారు రూ.70 కోట్ల వరకు మద్యం అమ్మకాలు సాగాయి. ప్రస్తుతం మరో మూడునెలల పాటు మద్యం దుకాణాల లెసైన్స్‌లను పొడగించింది. వచ్చే ఏడాదికి ప్రభుత్వం కొత్త మద్యం పాలసినీ అమలులోకి తీసుకరానుంది. దీని ప్రకారం మద్యం వ్యాపారులకు మరింత లాభం చేకూర్చనుంది. మద్యం దుకాణాల ద్వారా 2014-15లో సుమారు రూ.15 కోట్ల ఆదాయం సమకూరింది. గద్వాల పట్టణంలో ఒక బార్‌తోపాటు ఆరు మద్యం దుకాణాలు, జమ్మిచేడులో రెండు, మల్థకల్, గట్టు, ధరూరు మండలాల్లో ఒకటి, అయిజలో నాలుగు మద్యం దుకాణాలు అధికారికంగా ఉన్నాయి. అయితే వీటి పరిధిలో అనధికారికంగా బెల్టుషాపులు నడుపుతున్నారు. అయినా ఆబ్కారీశాఖ అధికారులు పట్టించుకున్న పాపానపోలేదు. ఎక్సైజ్‌శాఖ నిర్ణయించిన భారీ లెసైన్స్ ఫీజు బట్టి వ్యాపారం చేయాలంటే దుకాణాల వారికి బెల్టుషాపులు నడపాల్సిందే. నియోజకవర్గంలోని గ్రామాల్లో అనధికార లెక్కల ప్రకారం సుమారు 100 కుపైగా బెల్టుషాపులు ఉన్నాయి. అధికారులు చూసి చూడనట్లు వదిలేయడంతో దుకాణాల్లో సెకెండ్స్ మద్యం విపరీతంగా పెరిగిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇవ్వన్ని అబ్కారీశాఖకు జమకాని ఆదాయం అనే విషయం తెలియక అధికారులు అనధికారికంగా వారికి సహకరిస్తూ ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్నారు. -
ఒకే కాలనీలో నాలుగు ఇళ్లలో చోరీ
గద్వాల టౌన్ (మహబూబ్‌నగర్): తాళం వేసి ఉన్న ఇళ్లులను లక్ష్యంగా చేసుకుని దొంగలు రెచ్చిపోయారు. మహబూబ్‌నగర్ జిల్లా గద్వాల పట్టణం పాత హౌసింగ్‌బోర్డు కాలనీలో మంగళవారం రాత్రి జరిగిన ఈ ఘటపై పోలీసులు తెలిపిన వివరాలివీ.. మార్కెట్ యార్డు రిటైర్డు అధికారి ఇస్మాయిల్ మంగళవారం కుటుంబ సభ్యులతో కలసి కర్నూలులోని బంధువుల ఇంటికి వెళ్లారు. గుర్తు తెలియని దుండగులు రాత్రి ఇంటి తాళాలు పగులగొట్టి బీరువాలో ఉన్న మూడు తులాల బంగారు, రూ.5 వేల నగదును అపహరించారు. సమీపంలో ఉండే మార్కెట్ యార్డు కమీషన్ వ్యాపారి మహేశ్వర్‌రెడ్డి ఇంట్లో చొరబడి రూ.20 వేల నగదు, 5 తులాల బంగారు నగలను ఎత్తుకెళ్లారు. ఆ ఇంటిని ఆనుకొని ఉన్న శంకర్ ఇంటి తాళాలను పగులగొట్టి రూ.3 వేల నగదును మాయం చేశారు. సమీపంలో ఉన్న రిటైర్డ్ ఉపాధ్యాయుడు తిరుమలరావు ఇంట్లో సైతం చొరబడ్డారు. అక్కడ ఎలాంటి నగదు, బంగారం లభించలేదు. ఇస్మాయిల్, తిరుమలరావు ఇళ్లలో గతంలోనే నాలుగైదు సార్లు చోరీలు జరగడం విశేషం. చుట్టుపక్కల వారు బుధవారం విషయాన్ని గ్రహించి బాధితులకు సమాచారం అందించారు. చోరీ జరిగిన ఇళ్లను పోలీసులు పరిశీలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని వారు తెలిపారు. -
వ్యక్తి దారుణ హత్య
ఓ వ్యక్తి దారుణహత్యకు గురైన సంఘటన మహబూబ్ నగర్ జిల్లాలో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. మహబూబ్ నగర్ జిల్లా గద్వాల పట్టణంలోని విద్యుత్తు ఉపకేంద్రం సమీపంలో బుధవారం అర్ధరాత్రి గుర్తుతెలియని దుండగులు ఓ వ్యక్తిని బండరాయితో మోది హత్య చేశారు. ముఖాన్ని గుర్తుపట్టడానికి వీలులేకుండా చిద్రం చేశారు. అయితే స్థానికులు మృతుడిని గద్వాల మండలంలోని నదీ అగ్రహారం గ్రామానికి చెందిన దాదావలి(45) గా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దాదావలి హత్యకు గల కారణాలు, నిందితుల వివరాలు ఇంకా తెలియరాలేదు.