breaking news
G. Kisanreddy
-
‘విమోచనం’.. ఉద్రిక్తం
హన్మకొండ: తెలంగాణ విమోచన దినోత్సవమైన సెప్టెం బర్ 17ను అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చే స్తూ బీజేపీ వరంగల్‌లో చేపట్టిన కలెక్టరేట్ ముట్టడి, జాతీయ జెండా ఎగురవేత ఉద్రిక్తంగా మారింది. తొలుత బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి సారథ్యంలో హన్మకొండలోని తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద సమావేశం జరిగింది. అనంతరం తెలంగాణ అమరవీరులకు నివాళులర్పించి, కలెక్టరేట్‌కు ర్యాలీగా బయలుదేరారు. పోలీసు వలయాన్ని చేధించుకొని బీజేపీ కార్యకర్తలు కలెక్టరేట్ వైపునకు పరుగులు తీశారు. కలెక్టరేట్‌లోకి వెళ్లకుండా బీజేపీ నాయకులు, కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది. రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, బీజేపీ శాసనసభాపక్ష ఉపనేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ, డాక్టర్ టి.రాజేశ్వర్‌రావు, మాజీ ఎంపీ చందుపట్ల జంగారెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఎడ్ల అశోక్‌రెడ్డి, నాయకులు, కార్యకర్తలు బైఠాయించారు. కిషన్‌రెడ్డి, ప్రభాకర్‌ను పోలీసులు అదుపులోకి పోలీసు స్టేషన్‌కు తరలిస్తుండగా కార్యక్తలు అడ్డగించారు. పోలీసులు, కార్యకర్తల మధ్య తోపులాట, ఘర్షణ వాతావరణం నెలకొంది. అనంతరం వ్యక్తిగత పూచీకత్తుపై నాయకులను వదిలేశారు. కాగా, నైజాం పాలన నుంచి విమోచనం పొందిన సెప్టెం బర్ 17వ తేదీన తెలంగాణ విమోచన దినాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడానికి తెలంగాణ జేఏసీ మరో ఉద్యమం చేయాల్సిన అవసరముందని కిషన్‌రెడ్డి అన్నారు. రాష్ట్రంలో తాము అధికారంలోకి రాగానే తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహిస్తామన్నారు. -
అర్హులకు అన్యాయం జరగనివ్వం
సంగారెడ్డి క్రైం: టీఆర్ఎస్ సర్కార్ ఎన్ని జిమ్మిక్కులు చేసినా అర్హులైన వారికి సంక్షేమ పథకాలు అందేలా చూస్తామని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు జి. కిషన్‌రెడ్డి అన్నారు. మన రాష్ట్రం..మన పాలనలో న్యాయం జరుగుతుందని ఆశించిన ప్రజలు టీఆర్ఎస్కు పట్టం కడితే, కేసీఆర్ నేతృత్వంలోని సర్కార్ ఏ వర్గానికి న్యాయం చేయలేకపోతోందని ధ్వజమెత్తారు. మెదక్ జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలోని బాలాజీ మంజీరా గార్డెన్స్‌లో మంగళవారం బీజేపీ తెలంగాణ రాష్ట్ర కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కిషన్‌రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణలో కరెంట్ కోతలు తీవ్రమయ్యాయని, దీంతో రైతుల పరిస్థితి దయనీయంగా మారిందన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతులు కరెంట్ కోసం రోడ్డెక్కాల్సిన దుస్థితి నెలకొంద న్నారు. రైతులు గొంతెమ్మ కోర్కెలు కోరడం లేదని పంటల సాగు కోసం కరెంటు కావాలంటే, వారిపై లాఠీలు ఝుళిపించడం అన్యాయమన్నారు. రైతు సంక్షేమమే ధ్యేయమంటూ గద్దెనెక్కిన టీఆర్ఎస్ ఇంతవరకూ ఏ ఒక్క రైతుకూ ఒక్క రూపాయి కూడా రుణంగా ఇచ్చిన పరిస్థితి లేదన్నారు. ఎస్సీ,ఎస్టీ, బీసీ లబ్ధిదారులకు రుణాలు మంజూరు చేసినా, నిధులు మాత్రం ఇప్పటికీ విడుదల కాలేదన్నారు. మరోవైపు ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై స్పష్టమైన ప్రకటన చేయకపోవడంతో లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్ అగమ్యగోచరంగా తయారైందన్నారు. పేద విద్యార్థులందరికీ ఫీజు రీయింబర్స్మెంట్ వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. 1956 స్థానికత ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు. ప్రస్తుతం కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం సమీక్షలకే పరిమితమైందని, ఏ ఒక్క పథకం అమలుకు నోచుకోవడం లేదని ధ్వజమెత్తారు. ఇంటికో ఉద్యోగం ఇస్తామని ఇచ్చిన హామీ పక్కన బెడితే , ఉద్యోగ ఖాళీలు భర్తీ కాక నిరుద్యోగులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారన్నారు. ప్రభుత్వం అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రకటనలు చే స్తూ కాలయాపన చేస్తుందని ఆరోపించారు. రేషన్ కార్డుల ఏరివేతలో ఏ ఒక్క అర్హుడికి అన్యాయం జరిగినా తాము ఊరుకోబోమని హెచ్చరించారు. కేంద్రం నుంచి ఎటువంటి సాయం అందడం లేదని టీఆర్ఎస్ ప్రభుత్వం కావాలనే అసత్య ప్రచారం చేస్తుందని విమర్శించారు. సామాజిక పెన్షన్లకు అనేక కొర్రీలు పెడుతున్న టీఆర్ఎస్ సర్కార్, కొత్తవాటిని ఇచ్చే ప్రయత్నం కూడా ఇంకా మొదలు పెట్టలేదన్నారు. పేద రోగులకు అత్యవసర సమయంలో ఆర్థిక సాయాన్ని అందించే ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎం రిలీఫ్ ఫండ్) ఇంకా ప్రారంభం కాలేద న్నారు. సీఎం సహాయ నిధి కింద ఆర్థిక సాయం కోసం చేసుకున్న వేలాది దరఖాస్తులు పెండింగ్‌లోనే ఉన్నాయని తెలిపారు. సమావేశంలో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు బండారు దత్తాత్రేయ, సిహెచ్ విద్యాసాగర్‌రావు, నాగం జనార్దన్‌రెడ్డి, లక్ష్మీనారాయణ, ఇంద్రసేనారెడ్డి, బద్దం బాల్‌రెడ్డి, ఎమ్మెల్యేలు డా.లక్ష్మణ్, చింతల రాంచంద్రారెడ్డి, రాజాసింగ్, ఎన్వీఎస్.ప్రభాకర్, నాయకులు కె.సత్యనారాయణ, కాసాల బుచ్చిరెడ్డి, కొండాపురం జగన్, అనురాధారెడ్డి, తాళ్ల కల్పన, విజయలక్ష్మి పాల్గొన్నారు. సమావేశానికి ముందు మాసాయిపేట దుర్ఘటనలో మృతి చెందిన చిన్నారులకు బీజేపీ తెలంగాణ కౌన్సిల్ సంతాపం ప్రకటించారు.