breaking news
french magazine
-
‘రఫేల్’లో కమీషన్ల బాగోతం
పారిస్/న్యూఢిల్లీ: భారత్–ఫ్రాన్స్ మధ్య కుదిరిన రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంలో భారీగా డబ్బు చేతులు మారినట్లు ఫ్రెంచ్ ఆన్లైన్ ఇన్వెస్టిగేటివ్ జర్నల్ ‘మీడియాపార్ట్’ సంచలనాత్మక కథనాన్ని ప్రచురించింది. ఫ్రాన్స్‌కు చెందిన దసాల్ట్ కంపెనీ రఫేల్ ఫైటర్ జెట్లను తయారుచేస్తోంది. వీటిని కొనేందుకు భారత్ 2016లో ఫ్రాన్స్‌తో ఒప్పందంచేసుకుంది. ఈ డీల్ కుదరడానికి సహకరించినందుకు భారత్‌లోని మధ్యవర్తులకు(సుశేన్ గుప్తా) దసాల్ట్ 1.1 మిలియన్ యూరోలు(రూ.9.5 కోట్లకుపైగా) కమీషన్లుగా చెల్లించినట్లు ‘మీడియాపార్ట్’ ప్రచురించింది. ఫ్రాన్స్ అవినీతి నిరోధక శాఖ ఏజెన్సీ ఫ్రాంకాయిస్ యాంటీ కరప్షన్(ఏఎఫ్ఏ) ఆడిటింగ్‌లో ఈ విషయం తేలిందని వెల్లడించింది. 2017 నాటికి దసాల్ట్ ఖాతాలను ఏఎఫ్ఏ పరిశీలించగా అవకతవకలు బయటపడ్డాయంది. ‘గిఫ్ట్ టు క్లయింట్స్’ కింద భారీగా ఖర్చును దసాల్ట్ చూపించినట్లు వివరించింది. ‘మీడియాపార్ట్’ కథనాన్ని దసాల్ట్ ఖండించింది. తాము ఎవరికీ ముడుపులు చెల్లించలేదని, 50 రఫేల్ ఫైటర్జెట్ల ప్రతిరూపాలను(రెప్లికా) తయారు చేయించడానికి ఈ సొమ్మును వెచ్చించినట్లు తేల్చిచెప్పింది. సుశేన్ గుప్తా నేతృత్వంలోని డిఫెన్స్ కంపెనీ ‘డెఫ్సిస్ సొల్యూషన్స్’కు ఆర్డర్ ఇచ్చి, ఈ నమూనాలను తయారు చేయించామని తెలిపింది. అగస్టా–వెస్ట్‌ల్యాండ్ హెలికాప్టర్ల కుంభకోణంలో సుశేన్ గుప్తా సీబీఐ, ఈడీ దర్యాప్తును ఎదుర్కొంటున్నాడు. డెఫ్సిస్ సొల్యూషన్స్ సంస్థ దసాల్ట్ సంస్థకు భారత్‌లో సబ్ కాంట్రాక్టర్. 50 రఫేల్ నమూనాలను తయారీకి 1.1 మిలియన్ యూరోలను భారతీయ కంపెనీకి చెల్లించినట్లు దసాల్ట్ చెబుతున్నప్పటికీ, అందుకు ఆధారాలు చూపలేదని ఏఎఫ్ఏ నివేదించిందని ‘మీడియాపార్ట్’ తెలిపింది. ఒక్కో రఫేల్ నమూనా తయారీకి 20,357 యూరోలు ఖర్చయిందని దసాల్ట్ చెబుతోంది. సొంత ఎయిర్‌క్రాఫ్ట్ మోడల్‌ను తయారు చేయడానికి ఒక భారతీయ కంపెనీకి ఆర్డర్ ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది? ఈ ఖర్చును ‘గిఫ్ట్ టు క్లయింట్’ కింద ఎందుకు చూపారు? అయినా నమూనాల తయారీకి అంత సొమ్ము ఎందుకు? ఒక్కొక్కటి ఒక కారు పరిమాణంలో తయారు చేశారా? ఏఎఫ్ఏ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించగా, దసాల్ట్ సంస్థ సమాధానం చెప్పలేకపోయిందని, కనీసం ఒక్క డాక్యుమెంట్ చూపించలేకపోయిందని ఏఎఫ్ఏ నివేదికను ఉటంకిస్తూ ‘మీడియాపార్ట్’ వెల్లడించింది. ప్రధాని సమాధానం చెప్పాలి: కాంగ్రెస్ మీడియాపార్ట్ కథనం రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. డీల్‌పై దర్యాప్తు జరపాలని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంపై ప్రధాని మోదీ దేశ ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. నైతిక స్థైర్యాన్ని దెబ్బతీయొద్దు: బీజేపీ రఫేల్ డీల్‌పై మీడియాపార్ట్ కథనాన్ని బీజేపీ తోసిపుచ్చింది. అవి ఆధారాల్లేని ఆరోపణలని పేర్కొంది. రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలుపై దర్యాప్తు అవసరం లేదని సుప్రీంకోర్టు గతంలోనే తేల్చిచెప్పిందని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ గుర్తుచేశారు. తప్పుడు ఆరోపణలపై మన సైనిక బలగాల నైతిక స్థైర్యాన్ని దెబ్బతీయొద్దని కాంగ్రెస్‌కు రవిశంకర్ హితవు పలికారు. -
ఏకే 47, రాకెట్ లాంచర్లతో ఉగ్రవాదుల దాడి
ఉగ్రవాదులు ఏకే 47 తుపాకులు, రాకెట్ లాంచర్లు, అత్యాధునిక మిషన్ గన్లతో ప్యారిస్ నగరంలోని పత్రికా కార్యాలయం మీద విరుచుకుపడ్డారు. ఈ విషయాన్ని ఫ్రాన్స్ అధ్యక్షుడు హోలండ్ తెలిపారు. ఫ్రాన్స్‌లోని అన్ని మీడియా సంస్థలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరించారు. గత కొన్ని వారాలుగా పలు ఉగ్రవాద కుట్రలను ముందుగానే అడ్డుకున్నామని హోలండ్ అన్నారు. తాజాగా చార్లీ హెబ్డో కార్యాలయంపై జరిగిన ఉగ్రవాద దాడి అత్యంత హేయమైనదని, ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామని ఆయన చెప్పారు. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2.30 గంటల ప్రాంతంలో ఈ దాడి జరిగింది. పత్రికా కార్యాలయంలోకి ఎలాంటి అలజడి లేకుండా ప్రశాంతంగా మెట్లు ఎక్కి లోపలకు వెళ్లిన ఉగ్రవాదులు.. ఆ తర్వాత ఒక్కసారిగా తుపాకులతో కాల్పులు జరిపి, లాంచర్లతో రాకెట్లు కూడా ప్రయోగించారు. దాంతో పదిమంది అక్కడికక్కడే మరణించారు. తిరిగి పారిపోతూ.. రోడ్డుమీద ఉన్నవారిపై కూడా కాల్పులు జరిపారు. దాంతో ఓ పోలీసు అక్కడే మరణించారు. అనంతరం ఇద్దరు ఉగ్రవాదులు పత్రికా కార్యాలయం సమీపంలోని ఓ మెట్రో స్టేషన్ వైపు పారిపోయారు. కాగా, ప్యారిస్ ఘటన హేయమైన చర్య అని భారత ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ప్రెంచి వాసులకు తమ మద్దతు ఎప్పుడూ ఉంటుందని ఆయన ట్విట్టర్లో పేర్కొన్నారు. అలాగే, ఉగ్రవాదంపై పోరుకు తాము ఎప్పుడూ ముందుంటామని బ్రిటిష్ ప్రధాని డేవిడ్ కామెరాన్ అన్నారు. పత్రికా స్వేచ్ఛ ఉండాల్సిందేనని ఆయన చెప్పారు.