ఆస్పత్రి పాలైన జిమ్నాస్ట్
రియో డీ జనీరో: ఒలింపిక్స్‌లో పతకం సాధించడమనేది ప్రతీ క్రీడాకారుడి కల. అందుకోసం తీవ్రంగా శ్రమిస్తారు. ఒలింపిక్స్‌కు అర్హత సాధించడం ఒక ఎత్తైతే, అక్కడ సత్తా చాటడం మరొక ఎత్తు. అందులోనూ జిమ్నాస్టిక్స్ అంటే మరింత కఠినమైన సాధన చేయాల్సి ఉంటుంది. తనను తాను నిరూపించుకోవాలని ప్రయత్నంలో జిమ్నాస్ట్‌లు గాయాలు బారిన పడటం అధికంగానే జరుగుతూ ఉంటుంది.
తాజాగా ఈ తరహా ఘటనే రియో ఒలింపిక్స్ లో చోటు చేసుకుంది. ఓ ఫ్రెంచ్ జిమ్నాస్ట్ ఫీట్ చేసే క్రమంలో తీవ్రంగా గాయపడి ఆస్పత్రి పాలయ్యాడు. పురుషుల క్వాలిఫయింగ్‌లో భాగంగా నిర్వహించిన వాల్ట్ జిమ్నాస్టిక్స్ లో సమిర్ ఎయిట్ సెడ్ తీవ్రంగా గాయపడ్డాడు. అతను బ్యాక్ ఫ్లిప్స్ను పూర్తి చేసే క్రమంలో గాలిలోకి ఎగిరి అదుపు తప్పి నేలపై పడ్డాడు. దీంతో విలవిల్లాడిపోయిన సమిర్ను ప్రాథమిక చికిత్స చేసిన తరువాత స్ట్రైచర్ పై ఆస్పత్రికి తరలించారు. సమిర్ కిందకు పడేటప్పుడు కాలిపిక్కలోని ప్రధాన ఎముక తీవ్రంగా ఫ్రాక్చరైనట్లు డాక్టర్లు ధృవీకరించడంతో అతని ఒలింపిక్స్ కల ముగిసింది. అయితే ప్రస్తుతం డాక్టర్ల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్న సమిర్ భవితవ్యం కూడా ప్రశ్నార్థకంగా మారింది.