breaking news
formation of New party
-
రాష్ట్రంలో నిరంకుశ పాలన సాగుతోంది
-
సామాజిక తెలంగాణే లక్ష్యం
సాక్షి, హైదరాబాద్: ప్రజా కేంద్రంగా అభివృద్ధే తమ లక్ష్యమని తెలంగాణ జన సమితి (టీజేఎస్) అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం ప్రకటించారు. అన్ని వర్గాల ప్రజలు ఆత్మగౌరవంతో బతికే సామాజిక తెలంగాణ సాధన కోసమే పార్టీని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ప్రస్తుతం తెలంగాణ వెనుకబడింది వనరుల్లేక కాదని, పాలకుల అవినీతి వల్లేనని అన్నారు. ఆదివారం హైదరాబాద్ సరూర్‌నగర్ స్టేడియంలో టీజేఎస్ ఆవిర్భావ సభ జరిగింది. ఈ సందర్భంగా కోదండరాంను పార్టీ అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. అనంతరం పార్టీ జెండాను ఆవిష్కరించి ఆయన ప్రసంగించారు. పార్టీ ఏర్పాటు కారణాలు, లక్ష్యాలపై వివరించారు. ‘‘పోరాడి సాధించుకున్న తెలంగాణలో అధికారంలో ఉన్న నాయకులకు ఉద్యమ ఆకాంక్షల పట్ల గౌరవం పోయింది. ప్రస్తుతం ప్రజల ప్రజాస్వామ్య ఆకాంక్షలకు, నిరంకుశ పాలనకు మధ్య ఘర్షణ కొనసాగుతోంది. ఎటువైపు ఉంటారో తేల్చుకోండని తెలంగాణ సమాజం అడుగుతోంది. ప్రజాస్వామ్య ఆకాంక్షలను బలోపేతం చేయడానికి, నిరంకుశానికి వ్యతిరేకంగా మడమ తిప్పని పోరాటం కొనసాగిస్తాం. ఈ పోరాటంలో అంతిమ విజయం మాదే. యువతకు, రైతులకు, పేద వర్గాలకు న్యాయం జరిగేలా ప్రతి టీజేఎస్ కార్యకర్త కదలాలి. ప్రజలు, వారి బతుకు దెరువు కేంద్రంగా పని చేయాలి. మరో తెలంగాణను నిర్మించుకుందాం. కొత్త రాజకీయాలను సృష్టించుకుందాం’’ అని పిలుపునిచ్చారు. అధికార దుర్వినియోగం చేసే వారిని నిలదీయాలన్నారు. ‘పెత్తనం చేయొద్దు.. దిగిపొమ్మని చెబుతాం.. దింపేందుకు వస్తున్నాం..’ అని పేర్కొన్నారు. ప్రకృతి వనరుల దోపిడీ జరుగుతోందని, ప్రభుత్వానికి కాంట్రాక్టర్లపై ఉన్న ఆసక్తి ప్రజా సంక్షేమంపై లేదని విమర్శించారు. ఇప్పటివరకు జరిగిన ఆగడాలు, అక్రమాస్తులు, కాంట్రాక్టర్ల దోపిడీపై తెలంగాణ జన సమితి విచారణ చేస్తుందని తెలిపారు. హైదరాబాద్‌లో గుడిసెవాసులకు ఒక్కరికి కూడా ఇళ్లు కట్టివ్వలేదన్నారు. హైదరాబాద్ పరిసరాల్లో ఏడెనిమిది వేల ఎకరాల్లో రియల్ ఎస్టేట్ ఆపితే అడ్వొకేట్లకు, జర్నలిస్టులకు, నిరుపేదలందరికీ ఇళ్లు కట్టి ఇవ్వొచ్చని పేర్కొన్నారు. ఈ రాష్ట్రం ఒక్కరితో వచ్చింది కాదు.. తెలంగాణ కోసం 650 మంది బలిదానాలు చేసుకున్నారని కోదండరాం చెప్పారు. అలాంటివారి త్యాగాలతో తెలంగాణ వచ్చిందే తప్ప ఏ ఒక్కరి వల్లో కాదని పేర్కొన్నారు. అలాంటి తెలంగాణలో పోరాడిన వారిపై రౌడీషీట్లు పెట్టారని, పెట్టించిన వారు మంత్రుల స్థానంలో కూర్చున్నారని అన్నారు. ప్రస్తుతం రైతులకు గిట్టుబాటు ధర లేదని, యువతకు ఉద్యోగాలు లేవని, కాంట్రాక్టు ఉద్యోగులకు సమాన వేతనం అందడం లేదని చెప్పారు. రాష్ట్రంలో 2 లక్షల ఖాళీ పోస్టులున్నా వాటిని భర్తీ చేయడం లేదని విమర్శించారు. నాలుగేళ్లలో 15 వేల ఉద్యోగాలే భర్తీ చేశారన్నారు. వేదికపై అన్ని వర్గాలు ఆవిర్భావ సభకు పార్టీ నాయకత్వం భారీ ఏర్పాట్లు చేసింది. వేదికపై వివిధ వర్గాలకు చెందిన వెయ్యి మంది కూర్చునే అవకాశం కల్పించారు. వీరిలో పార్టీ నాయకులతో పాటు మల్లన్నసాగర్, నేరెళ్ల బాధితులు, ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబీకులు, అమర వీరుల కుటుంబీకులు, నిర్వాసితులు ఉన్నారు. కొట్లాడి తెచ్చుకున్నది ఇందుకేనా? రాష్ట్రంలో నియంతృత్వ ప్రభుత్వం కొనసాగుతోందని, ఇందుకేనా కొట్లాడి తెలంగాణను తెచ్చుకున్నది అని ప్రొఫెసర్ హరగోపాల్ ప్రశ్నించారు. అభివృద్ధి అంటే ప్రాజెక్టులు, బిల్డింగులు కట్టడం కాదని ప్రజలు స్వేచ్ఛగా, సుఖంగా జీవించడమని పేర్కొన్నారు. రాష్ట్రంలో నలుగురు వ్యక్తుల చుట్టూనే పాలన నడుస్తోందని ప్రముఖ న్యాయవాది రచనారెడ్డి విమర్శించారు. ‘హైదరాబాద్‌ను డల్లాస్ చేస్తా అంటడు.. మరోరోజు ఇస్తాంబుల్ చేస్తా అంటడు. స్కైవేలు.. హైవేలు అని చెప్పాడు కదా... అవన్నీ ఏమయ్యాయి’ అని మాజీ ఎమ్మెల్సీ దిలీప్‌కుమార్ ప్రశ్నించారు. -
కొత్త పార్టీ పెట్టాలా ? నిశబ్దంగా ఉండాలా ?
రాష్ట్రంలో కొత్త పార్టీ ఏర్పాటు చేయాలా లేక నిశబ్దంగా ఉండాలా అనే మీమాంశంలో అపద్దర్మ ముఖ్యమంత్రి ఎన్ కిరణ్ కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయన కాంగ్రెస్ పార్టీ బహిష్కృతులైన సీమాంధ్ర ప్రాంతానికి చెందిన ఎంపీలతో తన నివాసంలో భేటీ అయ్యారు. రేపు, ఎల్లుండు కూడా వరుసగా తనతో వచ్చే నేతలలో ఆయన భేటీ కానున్నారు. కొత్త పార్టీ అంశంపై ఆయన ఈ సందర్భంగా సదరు ఎంపీలతో చర్చించనున్నారు. సమైక్యవాది అని ముద్రపడిన కిరణ్ కొత్త పార్టీ ఏర్పాటు చేస్తే అది సీమాంధ్రకే పరిమితమా లేక తెలంగాణలో కూడా ఏర్పాటు చేయాలా అనే కోణంలో ఆలోచించనున్నారు. అంతేకాకుండా కొత్త పార్టీ పెడితే ప్రజలు ఎంత మంది తన పార్టీ వైపు మొగ్గు చూపుతారని విషయాన్ని కూడా ఈ సందర్భంగా ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది. సమైక్యమే తన విధానం అంటూ కిరణ్ కుమార్ రెడ్డి తన ముఖ్యమంత్రి పదవిలో ఉండగా నినదించారు. అందులో భాగంగానే అసెంబ్లీకి వచ్చిన ఆంధ్రప్రదేశ్ పునర్వ్యస్థీకరణ బిల్లు తప్పుల తడకగా అభివర్ణించారు. ఆ క్రమంలో బిల్లును తిప్పి రాష్ట్రపతికి పంపారు. అయితే రాష్ట్రపతి ఆ బిల్లును పార్లమెంట్‌కు పంపారు. దీంతో బిల్లు ఇరు సభలలో ఆమోదం పొందింది. ఈ నేపథ్యంలో కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి, ఎమ్మెల్యే పదవులతోపాటు కాంగ్రెస్ ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. కిరణ్ రాజీనామాను గవర్నర్ నరసింహన్ ఆమోదించారు. అపద్దర్మ సీఎంగా కొనసాగాలని గవర్నర్ కోరారు. అయిన కిరణ్ అపద్దర్మ సీఎంగా ఇప్పటి వరకు బాధ్యతలు చేపట్టలేదు. కాగా సీఎం కిరణ్ కొత్త పార్టీ పెట్టే అవకాశాలు ఉన్నాయని గత నాలుగైదు నెలలుగా రాష్ట్రంలో పుకార్లు షికార్లు చేస్తున్న సంగతి తెలిసిందే.