breaking news
folk literature
-
ద్రావిడ సంస్కృతిపై శోధన సాగాలంటే...
ఈ దేశ మూలవాసులైన ద్రావిడులు మొదట్లో ఉత్తర భారతంలో నివసించేవారు. ఆర్యుల రాక తర్వాత వారు దక్షిణ ప్రాంతానికి వచ్చి స్థిర నివాసం ఏర్పరచుకుని ఒక విలక్షణమైన సాంస్కృతిక వారసత్వాన్ని ప్రోది చేశారు. దక్షిణ భారతీయ సమాజం వేల సంవత్సరాలుగా అనేక జాతులతో కలిసి జీవన గమనాన్ని సాగించినప్పటికీ వారి సాంస్కృతిక విలక్షణత మాత్రం పుస్తె కట్టడం నుండి పాడె కట్టడం వరకు కొట్టొచ్చినట్లు కనిపిస్తూనే ఉంటుంది. దక్షిణ భారతదేశంలో ద్రవిడ జాతులు అత్యంత ప్రాచీనమైన సాంస్కృతిక నేపథ్యం కలిగి ఉన్నప్పటికీ ఈ భాషల్లో సాహిత్యం మాత్రం పదో శతాబ్దానికి అటూ ఇటుగా మాత్రమే లభిస్తోంది. తమిళులు మాత్రమే తమ సంగ సాహిత్యం అత్యంత ప్రాచీనమైనదనీ, ఈ సాహిత్యం క్రీ.పూ. 500 నుండి కనిపిస్తున్నదనీ ప్రకటించుకున్నారు. దాదాపుగా క్రీస్తుశకం ఒకటో శతాబ్దం వాడైన శాతవాహన చక్రవర్తి హాలుడు సేకరించి గుదిగుచ్చిన ‘గాథా సప్తశతి’ అనే ప్రాకృత గ్రంథంలో పిల్ల, పొట్ట, కరణి వంటి తెలుగు పదాలు కనిపిస్తున్నాయి. దీన్ని బట్టి ఆనాటికే తెలుగు భాష సమాజంలో బాగా స్థిరపడిన వ్యవహారిక భాషగా ఉందని చెప్పవచ్చు. అంతేగాకుండా, సాహిత్య భాషలుగా పేరుపడిన తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో గ్రంథ రూపంలో లభిస్తున్న సాహిత్యం కంటే ముందే మౌఖిక రూపంలో నిక్షిప్తమైన జానపద సాహిత్యం పుంఖానుపుంఖాలుగా తప్పకుండా ఉండి ఉంటుంది. ఉదా హరణకు ఇప్పటివరకు ఉన్న ఆధారాలను అనుసరించి తెలుగులో నన్నయ భారతాన్ని ఆది గ్రంథంగా భావిస్తున్నాం. అయితే, నన్నయ తల్లి పాడిన జోల పాట కూడా మౌఖిక వాఙ్మయంలో ఆనాటికే నెలకొని ఉంది అన్న సత్యాన్ని ఇక్కడ మనం మరచిపోకూడదు. కాబట్టి, నన్నయకు పూర్వమే తెలుగువారికి విస్తృతమైన మౌఖిక సాహిత్యం కూడా తప్పకుండా ఉంది. ఇటువంటి సాహిత్యం మాత్రమే ఒక జాతికి సంబంధించిన సహజమైన సంస్కృతికి ప్రతీకగా నిలుస్తుంది. అందుచేత, పరిశోధకులు ప్రధానంగా మూల వాసులు మౌఖికంగా నిక్షిప్తం చేసిన జానపద సాహిత్యంపై విరివిగా పరిశోధనలు జరపాల్సిన అవసరం ఉంది. నేటి భాషా శాస్త్ర పరిశోధకుల అంచనాలకు అందినంతవరకు ద్రావిడ భాషలు 27 కనిపిస్తున్నాయి. ఈ విషయంలో కూడా మరింత పరిశోధన జరగాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. అంతే కాకుండా, ఈ ఆదిమ జాతులు అందించిన సంస్కృతిపై తగినంత పరిశోధన జరగలేదు అన్నది నిర్వివాదాంశం. ఈ లోటును భర్తీ చేయడం కోసమే ప్రొఫెసర్ వీఐ సుబ్రహ్మణ్యం, ఐఏఎస్ అధికారి కాశీ పాండ్యన్ వంటి మేధావులు కొందరు ద్రవిడ సంస్కృతిపై పరిశోధన కోసం ఒక కేంద్రాన్ని మంజూరు చేయాలని నాటి సీఎం నందమూరి తారక రామారావుని కోరారు. అయితే ద్రవిడ సంస్కృతిపై అత్యంత ఆదరాభిమానాలు కలిగిన రామారావు ఏకంగా ఒక విశ్వవిద్యాలయాన్నే మంజూరు చేశారు. అది 1997 అక్టోబర్ 20న కుప్పంలో ప్రారంభమైంది. ద్రావిడ విశ్వవిద్యాలయం ప్రధాన లక్ష్యాలలో కొన్ని... ద్రవిడ సంస్కృతిలోని ప్రాచీనత, విలక్షణతను, విశిష్టతను లోక విదితం చేయడం; ద్రవిడ సంస్కృతిపై వివిధ భాషల్లో నేటి వరకు జరిగిన పరి శోధనలు, ప్రచురణలను పదిల పరచడం, ప్రచారం చేయడం; తద్వారా, భావ వినిమయానికి, సంస్కృతీ పరిరక్షణకు బాటలు వేయడం. ద్రావిడ కుటుంబానికి చెందిన గిరిజన భాషలతో సహా లిఖిత భాషలు, మాట్లాడే ద్రావిడ భాషల సమగ్ర అభివృద్ధికి కృషి చేయడం; ద్రావిడ భాషలు, సాహిత్యం, సంస్కృతికి సంబంధించిన కళలు, హస్తకళలు, అనుబంధ విషయాలలో ఉన్నత స్థాయిలో బోధనను, శిక్షణను అందించడం. భారత దేశం లోపల, వెలుపల ద్రావిడ భాషలు, సాహిత్యం, సంస్కృతి, ఆధునిక శాస్త్రాలు, వైద్యం, ఇంజనీరింగ్, సాంకేతికత వాటి అనుబంధ విషయాలపై అధ్యయనం చేయాలనుకునే వారికి శిక్షణ ఇవ్వడం. విశ్వ విద్యాలయ లక్ష్యాలకు అనుగుణంగా, అవసరాలకు అనుగుణంగా ఇతర భాషల సాహిత్యాన్ని ద్రావిడ భాషలలోకి అనువదించడం అలాగే ద్రావిడ భాషల సాహిత్యాన్ని ఇతర భాషలలోకి అనువదించడం. ద్రావిడ విశ్వవిద్యాలయంలో ఇప్పటికే మూలికా వనం ఏర్పాటయింది. ఈ వనంలో ద్రవిడ సాహిత్యంలోనూ, వైద్యంలోనూ కనిపించే చాలా అరుదైన, వివిధ జాతులకు చెందిన 250 వన మూలికలు సేకరించి, పెంచుతున్నారు. జానపద గిరిజన విజ్ఞానాలపై ప్రత్యేకమైన మ్యూజియం ఏర్పాటు చేశారు. అరుదైన తాళ పత్రాలను సేకరించి భద్రపరిచారు. ఒక ద్రావిడ భాషలో ప్రచురితమైన విలువైన పుస్తకాలను, పదకోశాలను ఇతర ద్రావిడ భాషల్లోకి అనువదించి ముద్రించారు. ద్రావిడ సంస్కృతిని మరింత మూలాల్లోకి వెళ్లి పరిశోధించడానికి తగిన విధంగా ఏపీ ప్రభుత్వం కూడా చొరవ తీసుకుని ‘తెలుగు ప్రాచీన హోదా కేంద్రా’న్ని ద్రావిడ విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేయడానికి గట్టి కృషి చేయాలి. అలాగే, తెలుగు అకాడమీని (ప్రస్తుతం తెలుగు సంస్కృత అకాడమీని) కూడా ద్రావిడ విశ్వ విద్యాలయంలో ఏర్పాటు చేయడం ద్వారా తెలుగు భాషా సాహిత్యాలపై జరిగిన, జరుగుతున్న విశేష కృషిని సమన్వయం చేసుకోవడానికి వీలు కలుగుతుంది. సంస్కృత సాహిత్యంలో ప్రవేశించిన ద్రావిడ సాంస్కృతిక మూలాలను కూడా మరింత లోతుగా అన్వేషించే అవకాశం ఏర్పడుతుంది. ఇటువంటి అంశాలపై చొరవను చూపినట్లయితే ప్రభుత్వం ద్రావిడ సంస్కృతి పట్ల తన చిత్తశుద్ధిని చాటుకున్నట్లవుతుంది. (క్లిక్ చేయండి: ఆనీ ఎర్నౌ.. ఆమె కథ మన జీవిత కథ) – డాక్టర్ వేలం పళని సహాయ ఆచార్యులు, తెలుగు శాఖ, ద్రావిడ విశ్వవిద్యాలయం (అక్టోబర్ 20న ద్రావిడ విశ్వవిద్యాలయం రజతోత్సవాల సందర్భంగా) -
‘సామెత లేని మాట ఆమెత లేని ఇల్లు’
జానపదం అంటే గ్రామీణ ప్రాంతం అని అర్థం. అమరకోశం, వ్యాసభారతంలో దీని ప్రస్తావన ఉంది. ఎర్రన అరణ్యశేషంలో గ్రామీణులు అనే అర్థంతో ‘జానపదులు’ పదాన్ని ప్రయోగించాడు. జానపద విజ్ఞానం అనేది ఫోక్లోర్ అనే ఆంగ్ల పదానికి అనువాదం. 1846లో డబ్ల్యు.జె. థామస్ అనే ఆంగ్ల జానపద విజ్ఞాన శాస్త్రవేత్త ఫోక్లోర్ పదాన్ని రూపొందించాడు. జానపద సాహిత్యం జానపద కళలు, ఆచారవ్యవహారాలు, సంస్కృతి, జానపద సాహిత్యం మొదలైన వాటన్నింటిని కలిపి జానపద విజ్ఞానం అంటారు. జానపద సాహి త్యం దీనిలో ఒక భాగం. జానపదులంటే అనాగరికులు, మొరటు వారు, కర్షకులు అనే అభిప్రాయం ఉండేది. జానపదులు నిరక్షరాస్యులైనప్పటికీ ప్రస్తుతం వారి జీవిత అనుభవసారాన్ని జానపద విజ్ఞానంగా, పరిశోధనాత్మకంగా అధ్యయనం చేస్తున్నారు. జానపదుల ప్రదర్శన కళల్ని పోషించి పరిరక్షిస్తున్నారు. జానపదుల భాష, సంప్రదాయం, సంస్కృతీవిశేషాలను నిశితంగా పరిశోధిస్తున్నారు. ఎం. డార్సన్ అనే జానపద విజ్ఞాన పరిశోధకుడు ‘జానపద విజ్ఞానం- జానపద జీవితం’ అనే గ్రంథంలో ‘ ఇది గత కాలానికి సంబంధించింది కాదని, వర్తమాన కాలానికి కూడా ప్రతిధ్వని’ అని అన్నారు. నిత్యం చైతన్య స్ఫూర్తి ఉన్న జానపద విజ్ఞానం ఆధునిక జీవితానికి ప్రేరణ కలిగిస్తుంది. బ్రిటిషర్ల పాలనలో మద్రాసులో సర్వే యర్ జనరల్‌గా ఉన్న కల్నల్ మెకంజీ (1754- 1821), కావలి బొర్రయ్య, వెంకటరామస్వామి, లక్ష్మయ్య సహకారంతో కైఫీయత్తులను రాయిం చి సంకలనం చేయించారు. ఆంధ్రదేశంలో స్థానిక చరిత్రలు, స్థలపురాణ చరిత్రలు, గ్రామ చరిత్రలకు సంబంధించిన కైఫీయత్తులు తెలు గువారి జానపద సంస్కృతికి దర్పణాలు. భారతదేశానికి 1874లో ఉద్యోగరీత్యా వచ్చిన జె.ఎ.బోయల్ జానపద సాహిత్యం పట్ల అభిమానంతో దక్షిణ భారతదేశానికి సంబం ధించిన ఆరు జానపద గేయ గాథలను సేకరించి ‘ఇండియన్ ఆంటిక్విటీ’ అనే గ్రంథాన్ని ప్రచురించారు. దీనిలో సర్వాయి పాపని కథ ప్రసిద్ధి. జానపద గేయగాథలను సేకరించిన తొలి పాశ్చాత్యుడు బోయల్. సి.పి.బ్రౌన్ జానపద భాషలో గణనీయ కృషి చేశారు. బొబ్బిలి కథ, కుమార రాముని కథ, పల్నాటివీరచరిత్ర, కాటమరాజు కథ, కామమ్మ కథ వంటి ప్రసిద్ధ గాథలు సేకరించి ప్రచురించారు. ఆర్.ఎస్.బాగ్స ‘ఫోక్లోర్ మైథాలజీ అండ్ లెజెండ్’ అనే ప్రామాణిక నిఘంటువులో జానపద విజ్ఞానాన్ని సూక్ష్మదృష్టితో వర్గీకరించారు. ఛార్లెస్ ఇ.గోవర్ ఫోక్సాంగ్స ఆఫ్ సదరన్ ఇండియా (1871) అనే గ్రంథాన్ని ప్రచురించా రు. అందులో వేమన పద్యాలను జానపద గే యాల కింద ఉదహరించారు. ఈ విషయాన్ని తర్వాత జె.ఎ. బోయల్ (1874) ఖండించారు. స్టీ థాంప్సన్ అనే పాశ్చాత్యుడు ‘‘ది టైమ్స్ ఆఫ్ ది ఫోక్టేల్’’ అనే గ్రంథం ద్వారా జానపద కథా మూలాలను కథానిర్మాణ పద్ధతులను వివరించారు. జానపద సాహితీ వికాసం పాశ్చాత్య భాషావేత్తల గణనీయమైన కృషి తెలుగువారికి మార్గదర్శకమైంది. 20వ శతాబ్ది పూర్వార్ధంలో నందిరాజు చలపతిరావు స్త్రీల పాటలు సేకరించి 1903లో ప్రచురించారు. 1910-20 మధ్యకాలంలో అప్పగింతల పాటలు, అడవి గోవింద నామకీర్తనలు, శ్రావణమంగళవారం పాటలు వంటి స్త్రీల ఆధ్యాత్మిక, వైవాహిక సందర్భాలకు చెందిన పాటలతో పాటు ‘చల్ మోహన రంగ’, సిరిసిరిమువ్వ, వంటి ఉత్తేజపూరితమైన పాటలను కూడా ప్రచురించారు. 20వ శతాబ్ది ఉత్తరార్ధంలో వేటూరి ప్రభా కరశాస్త్రి, చిలుకూరి నారాయణరావు వంటి పండితులు జానపద సాహిత్యానికి విశేష కృషి చేశారు. చిలుకూరి నారాయణరావు లక్షకుపైగా సామెతలు సేకరించి ప్రచురించారు. నేదునూరి గంగాధరం, మిన్నేరు, మున్నేరు, పన్నీరు, సెల యేరు, పసిడి పలుకులు, వ్యవసాయ సామె తలు, ఆటపాటలతో ‘జానపద వాఙ్మయ వ్యాసావళి’ని ప్రచురించారు. కృష్ణశ్రీ ‘స్త్రీల రామాయణపు పాటలు’,‘స్త్రీల పౌరాణిక పాట లు’, ‘పల్లె పదాలు’ వంటి గ్రంథాలు రచించా రు. హరి ఆదిశేషుడు ‘జానపదగేయ వాఙ్మ యం’ అనే ప్రామాణిక గ్రంథాన్ని రచించారు. దీనికిగానూ ఆయనకు మద్రాసు తెలుగు భాషాసమితి బహుమతి లభించింది. జానపద సాహిత్యం వర్గీకరణ జానపద విజ్ఞానంలో ప్రధానాంశమైన సాహిత్యంలో వస్తు సంస్కృతి, సాంఘిక ఆచారాలు, ప్రదర్శన కళలు, భాషావిశేషాలు ప్రతిబింబిస్తాయి. సాహిత్యంలో ప్రధానంగా గేయశాఖ, వచనశాఖ, దృశ్యశాఖ ముఖ్యమైనవి. జానపద గేయాలను 1. కథాసహితాలు 2. కథా రహితాలు అని రెండు విధాలుగా వర్గీకరించవచ్చు. కథాసహిత గేయాల్లో ప్రధానంగా శ్రామిక, స్త్రీల, వృత్తి సంబంధ గేయాలు ఉంటా యి. శ్రామికుల అలసటను, శారీరక శ్రమను పోగొట్టి ఉత్సాహాన్ని పెంపొందించేవి శ్రామిక గేయాలు. స్త్రీల పాటల్లో వ్రత, పౌరాణిక కథలు ఉంటాయి. వృత్తిసంబంధ గేయాల్లో వీరగాథలు, అద్భుత గాథలు, చారిత్రక గాథలు, మతసంబంధ గాథలు ఉంటాయి. జన జీవనంలో జానపద గేయం అన్ని కోణాలను సృశిస్తుంది.కథా రహిత గేయాల్లో శ్రామిక, పారమార్థిక కౌటుంబిక గేయాలు ప్రధానమైనవి. జానపద కళా రూపాలు జానపద కళా రూపాలు దృశ్యశాఖకు సంబంధించినవి. వీటిలో యక్షగానం, తోలుబొమ్మలాట, బుర్రకథ, పులి వేషాలు, గొరవ నృత్యం, ఒగ్గుకథ, కోలాటం వంటివి ప్రసిద్దమైనవి. మౌఖికం, అనామక కర్తృత్వం, జానపద సాహిత్య లక్షణం వచన జానపద సాహిత్యంలో సామెతలు, పొడుపు కథలు ఎంతో ప్రాచుర్యం పొందాయి. ఆధునిక సమాజం - జానపద సాహిత్య ప్రయోజనం ఎంతో వైజ్ఞానిక ప్రగతిని సాధించిన ఆధునిక సమాజంలో జానపద సాహిత్యం కొన్ని సామాజిక సమస్యల పరిష్కారానికి దోహదం చేస్తోంది. ప్రత్యేకించి.. 1. కుటుంబ నియంత్రణ 2. అక్షరాస్యత 3. పొదుపు ఉద్యమం 4. స్త్రీ విద్య 5. పిల్లల పెంపకం 6. అవినీతి నిర్మూలన 7. ఆరోగ్య కార్యక్రమాలు 8. ఆర్థిక అసమానతలు ప్రసార మాధ్యమాల ద్వారా ప్రజల్లో అవగాహన కలిగించి చైతన్యవంతుల్ని చేయడానికి జానపద సాహిత్యం తోడ్పడుతుంది. ప్రసిద్ధ జానపద గ్రంథాలు- రచయితలు ఎంకిపాటలు - నండూరి సుబ్బారావు బంగారుమామ పాటలు - కొనకళ్ల వెంకటరత్నం తెలుగు జానపద గేయ సాహిత్యం(తొలి సిద్ధాంత గ్రంథం) - ఆచార్య బి.రామరాజు యక్షగాన వాఙ్మయ చరిత్రం - ఆచార్య ఎస్.వి. జోగారావు తెలుగు హరికథా సర్వస్వం , జానపద కళాసంపద, తెలుగులో కొత్త వెలుగులు - ఆచార్య తూమాటి దొణప్ప తెలుగు జానపద గేయ గాథలు - ఆచార్య నాయని కృష్ణకుమారి తెలుగు వీర గాథా కవిత్వం, రేనాటి సూర్య చంద్రులు - ఆచార్య తంగిరాల సుబ్బారావు తెలుగు-కన్నడ జానపద గేయాల తుల నాత్మక పరిశీలన, జానపద సాహిత్య స్వరూపం,ఆంధ్రుల జానపద విజ్ఞానం - డాక్టర్ ఆర్.వి.ఎస్. సుందరం అనంతపురం జిల్లా స్త్రీల పాటలు, జానపద విజ్ఞాన వ్యాసావళి, జానపదుల తిట్లు -డాక్టర్ జి.ఎస్.మోహన్ {స్తీల రామాయణ పాటలు, పల్లెపదాలు ఊర్మిళాదేవి నిద్ర, - కృష్ణశ్రీ పల్లెపదాల్లో ప్రజా జీవనం - డాక్టర్ యెల్దండ రఘుమారెడ్డి జానపద పురాగాథలు - డాక్టర్ రావి ప్రేమలత ముద్రిత జానపద గేయాల్లో నిఘంటువు కెక్కని పదాలు- డాక్టర్ నాయని కోటేశ్వరి తెలంగాణ శ్రామిక గేయాలు -డాక్టర్ జి. లింగారెడ్డి స్తీల గేయాలు - సంప్రదాయాలు - డాక్టర్ సి.హెచ్. వసుంధరా రెడ్డి తెలుగు పొడుపు కథలు - డాక్టర్ కసిరెడ్డి వెంకటరెడ్డి జానపద కళారూపాలు - డాక్టర్ మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి గిరిజన గీతాలు - డాక్టర్ ఫిరాట్ల శివరామకృష్ణమూర్తి తోలుబొమ్మలాట - మొదలి నాగభూషణ శర్మ ప్రసిద్ధ జానపద గేయాలు శృంగారరస ప్రధానాలు: చెల్లి చంద్రమ్మా, ఊర్మిళాదేవి నిద్ర, చల్‌మోహనరంగ కరుణరస ప్రధానాలు: సారంగధర కథ, కామమ్మ కథ అద్భుత రస ప్రధానాలు బాలనాగమ్మ కథ, కాంభోజరాజు కథ, బాలవర్థిరాజు కథ, మదన కామరాజు కథ. హాస్య ప్రధానాలు: గంగా-గౌరీ సంవాదం, గౌరీ-లక్ష్మీసంవాదం. చారిత్రక ప్రాధాన్యమున్న కథలు దేశింగు రాజు కథ, సర్దార్ పాపన్న కథ, చిన్నపరెడ్డి కథ. మాదిరి ప్రశ్నలు 1. జానపద విజ్ఞానం అంటే? 1) జానపద సంస్కృతి 2) జానపద ప్రదర్శన కళలు 3) జానపద విశ్వాసం 4) పైవన్నీ 2. పొడుపు కథలు జానపద సాహిత్యంలో ఏ విభాగానికి సంబంధించినవి? 1) గేయ 2) దృశ్య 3) వచన 4) ప్రదర్శన 3. ‘రేనాటి సూర్యచంద్రులు’ ఏ శాఖకు చెందింది? 1) పౌరాణిక 2) సాంఘిక 3) ఇతిహాస 4) చారిత్రక 4. శారదకాండ్రు ఏ ప్రాంతంలో ఉన్నారు? 1) రాయలసీమ 2) తెలంగాణ 3) కోస్తాంధ్ర 4) ఉత్తరాంథ్ర 5. తోలుబొమ్మలాట జానపద విజ్ఞానంలో ఏ విభాగానికి చెందింది? 1) మౌఖిక జానపద విజ్ఞానం 2) వస్తు సంస్కృతి 3) జానపద కళలు 4) జానపద ఆచారాలు 6. జానపద గేయాల ప్రచురణకు తెలుగులో ఎవరు ఆద్యుడు? 1) మెకంజీ 2) థామ్స్ 3) సి.పి.బ్రౌన్ 4) జె.ఎ.బోయల్ 7. వీరగాథలపై పరిశోధన చేసినవారు? 1) డాక్టర్ యెల్దండ రఘుమారెడ్డి 2) డాక్టర్ జి. లింగారెడ్డి 3) డాక్టర్ తంగిరాల సుబ్బారావు 4) డాక్టర్ జి.ఎస్. మోహన్ 8. తెలుగు జానపద సాహిత్యాన్ని మానవ శాస్త్ర దృష్టితో పరిశీలించిన మహిళా పరిశోధకురాలు? 1) డాక్టర్ రావి ప్రేమలత 2) డాక్టర్ నాయని కృష్ణకుమారి 3) డాక్టర్ పి. కుసుమ కుమారి 4) డాక్టర్ డి.లలిత కుమారి 9. పొడుపు కథలకు పర్యాయపదం? 1) విడుపు కథ 2) ప్రహేళిక 3) మారు కత 4) పైవన్నీ 10. ‘సామెత లేని మాట ఆమెత లేని ఇల్లు’ అనే సామెతలో ఆమెత పదానికి అర్థం? 1) మేత 2) నగ 3) విందు 4) స్త్రీ డీఎస్సీ(ఎస్ఏ, ఎల్పీ) 2012లో అడిగిన ప్రశ్నలు 1. జానపద సాహిత్యానికి ప్రధాన లక్షణాల్లో ఒకటి? 1) అనామిక లేదా సామూహిక కర్తృత్వం 2) నిర్ణీత రచనా కాలం 3) కృతకశైలి 4) లిఖిత రచన 2. అప్పగింతలు, అలక పాటలు ఈ శాఖకు చెందినవి? 1) శ్రామిక గేయాలు 2) పారమార్థిక గేయాలు 3) బాల గేయాలు 4) స్త్రీల పాటలు 3. జానపదోచ్ఛారణలో ఎలా జరుగుతుంది? 1) ఒత్తులు నిలుస్తాయి 2) పదాదివకారం నిలుస్తుంది 3) మార్ధన్య దంతమాలీయభేదం నిలుస్తుంది 4) చకారం సకారం అవుతుంది 4. డాక్టర్ బిరుదురాజు రామరాజు దేనికి ప్రసిద్ధులు? 1) కార్యపరిష్కారణ శాస్త్రం రాసినందుకు 2) విశ్వవిద్యాలయ ఆచార్యులైనందుకు 3) జానపద సాహిత్యంపై మొదట పరిశోధన చేసినందుకు 4) జానపద సాహిత్యాన్ని సేకరించినందుకు 5. జానపద గేయాల్లో రామాయణ పాటలు ఏ శాఖకు చెందినవి? 1) శృంగార గేయాలు 2) శ్రామిక గేయాలు 3) పౌరాణిక గేయాలు 4) చారిత్రక గేయాలు సమాధానాలు 1) 1; 2) 4; 3) 4; 4) 3; 5) 3.