breaking news
first attempt
-
‘విజయ్’గాథ: ఎలాంటి కోచింగ్ లేకుండా 22 ఏళ్లకే సివిల్స్ ర్యాంకు
తొలి ప్రయత్నంలోనే సివిల్స్‌లో ర్యాంక్... ఏ కోచింగ్ సెంటరులోనూ శిక్షణ లేకుండా, కేవలం ఇంట్లోనే గడుపుతూ...! అదికూడా కేవలం 22 ఏళ్ల వయసులోనే సాధించటమంటే ఆషామాషీ కాదు. అలాగని అహోరాత్రాలు అతడు పుస్తకాలకే అంటుకుపోయాడా? అంటే అదీ లేదు. సగటున రోజుకు 7–8 గంటల చదువుతో తన కలను నిజం చేసుకున్నాడు. సివిల్స్ బీజాన్ని చిన్ననాటే అతడి మనసులో నాటిన తల్లిదండ్రులు సలహాలను మాత్రమే ఇస్తూ, చాయిస్‌ను అతడికే వదిలేశారు. ఈ కృషిలో రెండేళ్లు అతడు సోషల్‌మీడియాకు దూరంగా ఉంటే తల్లిదండ్రులు రెండేళ్లపాటు టీవీ వీక్షణను త్యాగం చేశారు. తెనాలి: తెనాలికి చెందిన దోనేపూడి విజయ్‌బాబు సివిల్స్‌లో తొలిప్రయత్నంలోనే 682వ ర్యాంకు సాధించి, ఐఆర్ఎస్కు ఎంపికయ్యారు. అతని తల్లిదండ్రులు రాజ్యలక్ష్మి, మధుబాబు. రాజ్యలక్ష్మి గ్రాడ్యుయేట్ అయితే, జీఎస్టీ సూపరింటెండెంట్‌గా చేస్తున్న మధుబాబు చదువుల దాహం తీరనిది. ఇప్పటికి ఎనిమిది పీజీలు చేశారాయన. జిల్లా కలెక్టరు కావాలని ఆశ పడినా దిగువ మధ్యతరగతి కుటుంబం, ఆర్థిక సమస్యల నడుమ అటుకేసి చూసే అవకాశం లేకపోయింది. తాను అందుకోలేకపోయిన సివిల్స్ సౌధాన్ని తమ కవల పిల్లలు అజయ్‌బాబు, విజయ్‌బాబు సాధిస్తే చూడాలని తపన పడ్డారు. అలాగని వారిపై ఒత్తిడేమీ తేలేదు. పునాది బాగుండే విద్యాసంస్థల్లో చేర్పించారు. పోటీపరీక్షలకు ప్రోత్సహించారు. నిర్ణయం తీసుకొనే స్వేచ్ఛనిస్తూ, సలహాలు మాత్రం ఇస్తూ వచ్చారు. ఫలితంగానే విజయ్‌బాబు ఐఆర్‌ఎస్‌ను ఖాయం చేసుకున్నారు. తాతయ్య ఉత్తరంతో బీజం.. 2007లో ప్రైవేటు కాన్వెంటులో నాలుగో తరగతి చదువుతుండగా విజయ్‌బాబు జిల్లాస్థాయి భగవద్గీత పోటీల్లో పాల్గొన్నారు. డిగ్రీ విద్యార్థులతో పోటీపడి బహుమతి సాధించారు. సంతోషపడిన తాతయ్య ప్రభాకరరావు భవిష్యత్తులో కలెక్టరు కావాలంటూ ఆశీర్వదిస్తూ ఉత్తరం రాశారు. అప్పుడే తన మనసులో బలమైన ముద్ర పడిందని, ఇప్పటికీ ఆ ఉత్తరం తన దగ్గరుందని విజయ్‌బాబు చెప్పారు. టెన్త్‌లో 10/10 జీపీఏ సాధించాక విజయ్ తెనాలిలోని ప్రైవేటు కాలేజీలో చేరారు. తోటివారంతా ఎంపీసీ గ్రూపు తీసుకుంటుంటే, అతను ఎంఈసీని ఎంచుకున్నారు. ‘సివిల్స్ కొట్టాలంటే ఇంజినీరింగ్ చేయాలని రూలేం లేదు.. ఆర్ట్స్ గ్రూపుతోనే సాధించొచ్చు.’ అన్న తండ్రి సలహాను నూరుశాతం నమ్మారు. రకరకాల ఫౌండేషన్ కోర్సుల పేరుతో ఎంపీసీ విద్యార్థులపై ఉండేంత ఒత్తిడి ఆర్ట్స్‌కు ఉండకపోవటం నిజంగా కలిసొచ్చిందని అంటారు విజయ్‌బాబు. ప్రశాంతంగా చదువుకుని 975 మార్కులతో రాష్ట్రస్థాయిలో 3, 4 ర్యాంకుల్లో నిలిచానని చెప్పారు. ఐఏఎస్‌పైనే గురి.. ఇంటర్ తర్వాత డిగ్రీకి ప్రతిష్టాత్మకమైన న్యూఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్స్ కాలేజీని విజయ్ ఎంచుకున్నారు. 400 సీట్ల కోసం 30 వేల మంది పోటీపడితే రాతపరీక్ష, ఇంటర్వ్యూలోనూ నెగ్గి సీటు ఖాయం చేసుకున్నారు. 2019లో బీఏ ఆనర్స్‌ను ఫస్ట్ డివిజనులో పాసై జూలైలో తెనాలి వచ్చేశారు. అప్పట్నుంచి సివిల్స్‌కి గురిపెట్టారు. ఇటీవల విడుదలైన ఫలితాల్లో 682 ర్యాంకును పొందారు. గతంలో సివిల్స్ టాపర్స్ ఇంటర్వ్యూలను వినటం, వారి విధానాల్లో తనకు నప్పినవి ఎంచుకుని పాటించటం, ఆన్లైన్లో టెస్ట్ సిరీస్‌తో ప్రాక్టీస్ చేయటం, దినపత్రికలు చదవటం, తనలాగే సివిల్స్‌కు తయారవుతున్న మిత్రులతో చర్చిస్తూ, తప్పొప్పులు సరిచేసుకుంటూ రెండేళ్లపాటు పడిన శ్రమకు ఫలితం లభించిందని విజయ్‌బాబు చెప్పారు. రోజూ జాగింగ్, మెడిటేషన్ విధిగా చేశానని తెలిపారు. తల్లిదండ్రులు టీవీ వీక్షణ త్యాగం చేశారని చెప్పారు. ఐఆర్ఎస్ పోస్టింగ్ తీసుకున్నా ఐఏఎస్ సాధనకు మళ్లీ సివిల్స్ ప్రిలిమినరీ పరీక్ష తన సోదరుడు అజయ్‌బాబుతోపాటు రాసినట్టు చెప్పారు. ఇద్దరికీ బెస్టాఫ్ లక్ చెబుదాం. -
సివిల్స్‌లో మెరిశారు..
సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్స్ -2014 ఫలితాల్లో జిల్లా యువకులు మెరిశారు. జాతీయస్థారుులో ఉన్నత ర్యాంకులు సాధించి జిల్లావాసులను మురిపించారు. వరంగల్ గిర్మాజీపేటకు చెందిన 24 ఏళ్ల క్రాంతి తొలి ప్రయత్నంలోనే 50వ ర్యాంకుతో.. హన్మకొండలోని బాలసముద్రానికి చెందిన 26 ఏళ్ల పింగిళి సతీష్‌రెడ్డి పట్టువదలని విక్రమార్కుడిలా రెండో ప్రయత్నంలో 97వ ర్యాంకుతో అత్యుత్తమ ప్రతిభ చాటారు. - 50వ ర్యాంకు సాధించిన క్రాంతి - 97వర్యాంకు పొందిన పింగిళి సతీష్‌రెడ్డి - యువ అధికారుల స్ఫూర్తితో లక్ష్య సాధన - హోం స్టేట్‌గా తెలంగాణను ఎంచుకుంటామని వెల్లడి ముంబైలో బహుళజాతి కంపెనీలో సీఏగా పని చేస్తున్నప్పుడు చాలెంజింగ్‌గా ఉండే సివిల్స్ రాయాలని అనిపించింది. అఖిల భారత సర్వీస్ అధికారులకు ఉండే విభిన్నమైన విధులు నాలో స్ఫూర్తిని కలిగించాయి. ఏడాదిపాటు లాంగ్‌లీవ్ పెట్టి సివిల్స్‌కు ప్రిపేరయ్యాను. హోంస్టేట్గా తెలంగాణను ఎంచుకుంటాను. కొత్త రాష్ర్టంలో సవాళ్లను సమర్థవంతంగా పరిష్కరించేందుక కృషి చేస్తా. సాక్షి, హన్మకొండ : తొలి ప్రయత్నంలోనే సివిల్స్ జనరల్ కేటగిరీలో జాతీయ స్థాయిలో క్రాంతి 50వ ర్యాంకు సాధించి జిల్లా కీర్తిని నలుమూలల చాటాడు. క్రాంతి తల్లిదండ్రులు పాటి సురేందర్, జ్యోతి కాగా.. బాబారుు కొండల్రావు వరంగల్ గ్రేటర్ మునిసిపల్ కార్పొరేషన్లో డీఈగా పనిచేస్తున్నారు. క్రాంతికుమర్ తండ్రి జవహర్ నవోదయ విద్యాలయ సంస్థలో లెక్చరర్, ప్రిన్సిపాల్‌గా పలు హోదాల్లో పని చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన మధ్యప్రదేశ్‌లోని బుర్హన్‌పూర్ నవోదయ విద్యాలయం ప్రిన్సిపాల్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. క్రాంతికుమర్ ఐదో తరగతి వరకు మదనపల్లి, చిత్తూరు జిల్లా, ఐదు నుంచి పది వరకు పెదవేగి, ఏలూరు పశ్చిమగోదావరి జిల్లాల్లో చదివారు. అనంతరం షోలాపూర్, మహారాష్ట్రలో నవోదయ విద్యాలయాల్లో చదివారు. ఆపై ఇరవై ఒక్క ఏళ్లకే పూణేలో చార్టెడ్ అకౌంటెంట్ కోర్సును పూర్తి చేసి ముంబైలో ఓ బహుళజాతి కంపెనీలో ఏడాదికి తొమ్మిది లక్షల రూపాయల వేతనంతో సీఏగా పని చేశారు. ఈ వృత్తిలో ఉండగానే దీర్ఘకాలిక సెలవు పెట్టి ఢిల్లీకి వెళ్లి సివిల్స్‌కు ప్రిపేరయ్యారు. తొలి ప్రయత్నంలోనే సివిల్స్‌లో జనరల్ కేటగిరీలో జాతీయ స్థాయిలో 50వ ర్యాంకు సాధించారు. మెయిన్స్‌లో ఆప్షనల్‌గా కామర్స్ సబ్జెక్టును ఎంచుకున్నారు. మధ్యప్రదేశ్ బురహన్పురంలో ఉన్న క్రాంతి ‘సాక్షి’తో ఫోన్లో మాట్లాడారు. అఖిల భారత సర్వీస్ అధికారులకు ఉండే విభిన్నమైన విధులు నాలో స్ఫూర్తిని కలిగించాయని, దీంతో ఏడాదిపాటు లాంగ్‌లీవ్ పెట్టి సివిల్స్‌కు ప్రిపేరయ్యానని చెప్పారు. హోంస్టేట్గా తెలంగాణను ఎంచుకుంటానన్నారు. కొత్తగా ఏర్పడిన రాష్ట్రం కావడంతో అనేక సవాళ్లు ఉన్నాయని, వాటిని సమర్థవంతంగా పరిష్కరించేందుకు, తెలంగాణ అభివృద్ధికి దోహదపడేందుకు కృషి చేస్తానన్నారు. అదేవిధంగా సివిల్స్‌లో 97 వ ర్యాంక్ సాధించిన సతీశ్‌రెడ్డి తల్లిదండ్రులు సీతారాంరెడ్డి, విజయలక్ష్మి. వీరు హన్మకొండలోని బాలసముద్రంలో నివాసం ఉంటున్నారు. తొలి ప్రయత్నంలో మెయిన్స్‌లో విఫలమైన సతీశ్‌రెడ్డి, ద్వితీయ ప్రయత్నంలో విజయం సాధించాడు. మెయిన్స్‌లో ఆయన సోషియాలజీని ఆప్షన్‌గా ఎన్నుకున్నారు. -
మొదటి షాట్ తీస్తుండగా....నాన్న మరణవార్త తెలిసింది
తొలియత్నం కథ, కవిత, ఆట, పాట, చిత్రం, శిల్పం... కళ, కల్పన, మరే సృజనకైనా ప్రేరణ ప్రేమ. ప్రేమ ఈ ప్రపంచపు ప్రాణవాయువు. అది సృజనకు అగ్గి రాజేస్తుంది. హృదయాంతరాళాల్లో కొత్త ప్రపంచాలను సృష్టిస్తుంది. యుగయుగాలుగా, తరతరాలుగా మనిషిని ఊరిస్తున్న, ఊపేస్తోన్న ఈ ప్రేమ ఝంజాటాన్ని, మనసుల గుంజాటనల్ని కళాకారులు రకరకాల రూపాల్లో ఆవిష్కరించారు. అలాంటి ప్రేమను కథావస్తువుగా చేసుకుని దర్శకుడు వై.వి.ఎస్.చౌదరి వెండితెరపై ‘శ్రీ సీతారాముల కల్యాణం చూతము రారండి’ అనే దృశ్య కావ్యాన్ని తన తొలియత్నంగా రూపొందించారు. నువ్వు నన్ను నమ్మొద్దు. అలాగే నిన్ను కూడా నువ్వు నమ్మొద్దు. మనం నమ్మాల్సింది ప్రేమను. మనిద్దరి మధ్య ఉన్న ప్రేమ నిజమైతే, అది ఒక శక్తిగా మారి మనల్ని పెళ్లి దాకా తీసుకెళ్తుంది. పెళ్లిపీటల మీద ఎవరు కూర్చున్నా తాళి కట్టేది మాత్రం నేనే’ - ఇది సినిమాలో హీరో హీరోయిన్‌తో చెప్పే డైలాగ్. ప్రేమ శక్తి మీద ఉన్న నమ్మకంతో ఈ డైలాగ్ రాసుకున్నాను. అదే లైన్ మీద కథ అల్లుకున్నాను. ప్రేమ మీద నమ్మకంతో ప్రేమకథ రాసుకున్నాను కానీ నన్ను నేను నమ్మడానికి, నిరూపించుకోవడానికి చాలా సంఘర్షణ అనుభవించాను. నా మొదటి సినిమా కోసం నా ప్రయాణంలో మలుపులు, ఒక సినిమాలో కన్నా ఎక్కువగా ఉన్నాయి. నాగార్జునగారు హీరోగా చేసిన అయిదు సినిమాలకు నేను డెరైక్షన్ డిపార్ట్మెంట్లో పనిచేశాను (అగ్నిపుత్రుడు, జానకి రాముడు, గోవిందా గోవిందా, క్రిమినల్, నిన్నే పెళ్లాడతా). తను సెట్లో ఓ పక్క నల్ల కళ్లద్దాలు పెట్టుకుని కూర్చుని అందరినీ గమనిస్తుండేవారు. టాలెంట్‌ను గుర్తించడంలో ఆయన ఎప్పుడూ ముందుండేవారు. తన కెరీర్లో చాలామందిని దర్శకులుగా పరిచయం చేశారు. అందుకే ఆయన్ను సెల్యులాయిడ్ సైంటిస్ట్ అంటుంటాను. నా కష్టించే తత్వం, క్రమశిక్షణ ఆయన్ని ఆకట్టుకున్నాయి. ‘గోవిందా గోవిందా’, ‘క్రిమినల్’కు పనిచేసిన సమయాల్లో దర్శకుడిగా అవకాశం ఇస్తానని చెప్పారు. అవి ఫ్లాప్ కావడంతో రెండుసార్లు అవకాశం చేజారింది. ‘నిన్నే పెళ్లాడతా’ సమయంలో మళ్లీ మాట ఇచ్చారు. ఆ సినిమా హిట్ కావడంతో తన మాట నిలబెట్టుకున్నారు. సినిమా తీయడానికి నాగార్జునగారు సిద్ధంగా ఉండటంతో, స్క్రిప్ట్ వర్క్ మొదలుపెట్టాను. అప్పుడు రవితేజ నా రూమ్మేట్. తనను పక్కన పెట్టుకుని ఒక్కొక్క సీన్ డిస్కస్ చేస్తూ రెండు రోజుల్లో స్క్రిప్ట్ పూర్తిచేశాను. ఈలోపు నాగార్జునగారు కొత్త దర్శకుడితో గ్రేట్ ఇండియా ఎంటర్టైన్మెంట్ బ్యానర్ మీద సినిమా తీస్తున్నట్టు పత్రికా ప్రకటన కూడా ఇచ్చారు. మరి ఈ కథకు హీరో ఎవరైతే బాగుంటారా అని ఆలోచిస్తున్న సమయంలో ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైంది. ఆ పోస్టర్ మీద హీరోతో పాటు ఈ అబ్బాయి ఎవరు అని ఒక క్యాప్షన్ ఉంచారు. పోస్టర్ చూసి ఇతనెవరో సన్నగా, స్టైల్‌గా అచ్చం రజనీకాంత్‌లా ఉన్నాడు, నా కథకు సరిపోతాడని అనుకున్నాను. ఎంక్వైరీ చేస్తే పేరు పవన్ కల్యాణ్, చిరంజీవిగారి తమ్ముడని తెలిసింది. కల్యాణ్‌గారిని అప్రోచ్ అవుదామని ప్రయత్నిస్తే, అప్పటికే తను ‘గోకులంలో సీత’ కమిట్ అయ్యాడని తెలిసింది. ఆ ప్రయత్నం విరమించుకున్నాను. అదే సమయంలో అన్నపూర్ణ బ్యానర్ మీద సుమంత్‌ను హీరోగా పరిచయం చేస్తున్నారని తెలిసి అవకాశం అడిగాను. అప్పటికే తనను రామ్‌గోపాల్‌వర్మ దర్శకత్వంలో పరిచయం చేస్తున్నామని చెప్పారు. తరువాత జేడీ చక్రవర్తి, శ్రీకాంత్, జగపతిబాబు, వెంకటేశ్‌లకు కథ వినిపించాను. పట్టు వదలకుండా ఇండస్ట్రీలో ఉన్న తొంభై శాతం మంది హీరోలకు ఈ కథ చెప్పాను. అందరూ చూద్దాం చేద్దాం అన్నారే తప్ప అడుగు ముందుకు పడలేదు. చాలా విసిగిపోయి కొత్తవాళ్లతో చేయాలని నిర్ణయించుకున్నాను. సినిమా చర్చ వచ్చినప్పుడు నాగార్జునగారు హీరో ఎవరు కావాలని అడిగారు. కొత్తవాళ్లయితే బాగుంటుందన్నాను. నేను అవసరం లేదా అన్నారాయన. ఈ కథకు కొత్తవాళ్లయితే బాగుంటుందని అన్నాను. సరే అన్నారాయన. నేను ఆర్టిస్ట్ కోసం అన్వేషిస్తుండగా సినిమాటోగ్రాఫర్ ఛోటా కె.నాయుడు వెంకట్‌ను పరిచయం చేశారు. హీరోగా తను సరిపోతాడనిపించింది. మిగతా ఆర్టిస్టులందరినీ బాంబేకు వెళ్లి సెలక్ట్ చేశాను. నిజానికి ఆ రోజుల్లో అంతా కొత్తవాళ్లతో సినిమా చేయాలంటే ప్రొడ్యూసర్‌కు తెగింపు ఉండాలి. ఎందుకంటే రాఘవేంద్రరావుగారు కొత్తవాళ్లతో తీసిన పరదేశి, దాసరిగారి కల్యాణ ప్రాప్తిరస్తు, కృష్ణవంశీ సింధూరం ఏవీ ఆశించిన ఫలితాలనివ్వలేదు. నా సినిమా కథ ప్రకారం ఫస్టాఫ్ దుబాయ్‌లో జరుగుతుంది. సెకండాఫ్ రాజమండ్రి దగ్గర ఒక పల్లెటూళ్లో జరుగుతుంది. కొత్తవాళ్లతో అంత బడ్జెట్ పెట్టి తీయడం ప్రొడ్యూసర్‌కు చాలా రిస్క్. ఇలాంటి సందర్భాల్లో నాగార్జునగారు నామీద నమ్మకంతో ఆ సాహసం చేశారు. సినిమా జరుగుతున్నప్పుడు అంతా కొత్తవాళ్లు కాబట్టి అప్పుడప్పుడూ కాన్ఫిడెన్స్ కోల్పోయేవాణ్ని. చుట్టూ ఉన్నవాళ్లు నాగార్జునగారికి చాలా విషయాలు నెగటివ్‌గా చెప్పేవారు. ఆయన వినేవారు తప్ప రియాక్ట్ అయ్యేవారు కాదు. ఆయన నామీద నమ్మకంతో నేనేం అడిగితే అది సమకూర్చేవారు. ఇవన్నీ ఒకవైపు. మరోవైపు నేను మొదటి షెడ్యూల్ కోసం వైజాగ్‌లో ఉన్నాను. షెడ్యూల్ చివరిరోజు రామాయణ సారానికి సంబంధించి మొదటి షాట్ తీస్తుండగా మా నాన్నగారి మరణవార్త తెలిసింది. పని డిస్ట్రబ్ అవడం ఇష్టంలేక, సాయంత్రం వరకూ సినిమా షూట్ చేశాను. నిజానికి షెడ్యూల్ మధ్యలోనే ఆయన అనారోగ్యం పాలైనా, పదమూడేళ్ల తరువాత నాకు వచ్చిన అవకాశాన్ని డిస్ట్రబ్ చేయడం ఇష్టంలేక, తన విల్పవర్తో అంతకాలం బతికారేమో అనిపించింది. నా జీవితాన్ని అత్యంత ప్రభావితం చేసిన నాన్న మరణం నన్ను చాలా కుంగదీసింది. కొన్ని రోజులు గడిచాక, నాకు నేను సర్దిచెప్పుకుని తిరిగి షూటింగ్ మొదలుపెట్టాను. ఈ సినిమాకు సంబంధించి నేను చెప్పుకోవలసింది మొదటగా నాగార్జునగారైతే, రెండో వ్యక్తి అక్కినేని నాగేశ్వరరావుగారు. నేను ఎన్టీర్ పరమ భక్తుడినైతే, మా అమ్మా నాన్న ఏఎన్నార్‌గారి వీరాభిమానులు. ఇందులో తాత పాత్రకు ఆయన తప్ప మరొకరు సరిపోరేమోననిపించింది. నటనలో అత్యున్నత శిఖరాలనందుకున్న ఏఎన్నార్, మరోవైపు నటనకు సంబంధించి ఓనమాలు దిద్దని ముగ్గురు కొత్త నటులతో నా మొదటి సినిమా తీయడం ఒక గొప్ప అనుభవం. అక్కినేనిగారు సెట్లో నన్ను సార్ అని పిలిచేవారు. అదేంటి సార్ అంటే, నేనే నిన్ను గౌరవించకపోతే మరెవరు గౌరవిస్తారనేవారాయన. ఆయనతో కలిసి పనిచేయడం నా అదృష్టంగా భావిస్తాను. ఇక కొత్త ఆర్టిస్ట్ అయినా పాత్రను అర్థం చేసుకుని నటించాడు వెంకట్. చాందిని చాలా ధైర్యం గల అమ్మాయి. దుబాయ్‌లో పర్మిషన్ లేకుండా విపరీతమైన చలిలో షూట్ చేస్తున్నాం. దాదాపు మూడు కిలోమీటర్లు ఉన్న టన్నెల్ మధ్యలో ఒక ఎడ్జ్‌లో నిలబడాలి. పోలీసులు చూస్తే పట్టుకుంటారేమోనని టెన్షన్ పడుతుంటే, తను చాలా ధైర్యంగా నిలబడి చాలా తొందరగా షాట్ పూర్తిచేసింది. అలా అందరి సహకారంతో, అన్ని అడ్డంకులు దాటుకుని 99 రోజుల్లో షూటింగ్ పూర్తిచేశాం. సంగీతం విషయానికొస్తే, అది చిన్నప్పటినుంచీ నా నరనరాల్లో ఉంది. కీరవాణిగారిని హింస పెట్టి నాకు కావలసిన విధంగా పాటలు చేయించుకున్నాను. సీతారామశాస్త్రిగారు అద్భుతమైన సాహిత్యం అందించారు. పాటలు తీశాక, నేను పిక్చరైజ్ చేసిన విధానం చూసి కీరవాణిగారు మెచ్చుకున్నారు. సంభాషణలు రాసిన జంధ్యాలగారైతే, డబుల్ పాజిటివ్ చూసి మళ్లీ రెండోసారి చూశారు. టైటిల్ విషయంలో చాలా చర్చ జరిగింది. నా ఆరాధ్య దైవం ఎన్టీఆర్ డెరైక్షన్‌లో వచ్చిన సీతారామకళ్యాణంలో పాటను టైటిల్‌గా వాడుకున్నాను. కొంతమంది టైటిల్ చాలా పొడవుగా ఉందన్నారు. తెలుగువాళ్ల నరనరాల్లో జీర్ణించుకున్న పాట కావడంతో టైటిల్ రిచ్ అవుతుందని నమ్మకంతో ఉన్నాను. దానికి ‘ట్రస్ట్ లవ్’ అనే క్యాప్షన్ పెట్టాను. 1998 జూన్ 26న సినిమా విడుదలైంది. రామ్‌గోపాల్‌వర్మ, రాఘవేంద్రరావు వంటి ఎందరో పెద్దలు సినిమా చూసి ప్రశంసించారు. ఈ సినిమా యూత్‌కి బాగా కనెక్ట్ అయ్యింది. నా ప్రేమలో, నా చుట్టూ ప్రేమకథల్లో జరిగిన కొన్ని సున్నితమైన ఫీలింగ్స్‌ను కథలో చేర్చాను. దాంతో చాలామంది ఇది తమ ప్రేమకథలా భావించారు. అందుకే ఈ సినిమా అంత పెద్ద విజయాన్ని సాధించిందనిపిస్తుంది. - కె.క్రాంతికుమార్‌రెడ్డి