breaking news
Finance Committee Meeting
-
రేపు సీఎంతో 16వ ఆర్థిక సంఘం భేటీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పర్యటనలో భాగంగా 16వ ఆర్థిక సంఘం బృందం ఆదివారంహైదరాబాద్ చేరుకుంది. చైర్మన్ అరవింద్ పనగరియా నేతృత్వంలోని ఈ బృందంలో అజయ్ నారాయణ్ ఝా, యానీ జార్జి మ్యాథ్యూ, మనోజ్ పాండా, డాక్టర్ సౌమ్య కాంతి ఘోష్ సభ్యులుగా ఉన్నారు. సోమవారం ఉదయం ప్రజాభవన్‌లో పట్టణ స్థానికసంస్థల ప్రతినిధులు, గ్రామీణ స్థానికసంస్థల ప్రతినిధులు, రాష్ట్ర ఆర్థిక సంఘం చైర్మన్/సభ్యులు, అధికారులతో వరుస సమావేశాలు నిర్వహించనుంది. ఆ తర్వాత వ్యాపార, వాణిజ్య, పారిశ్రామిక సంఘాలు, సంస్థలతోపాటు రాజకీయ పార్టీల ప్రతినిధులతో విడివిడిగా సమావేశం కానుంది. రాత్రి 8 గంటలకు సీఎం రేవంత్‌రెడ్డి సచివాలయంలో ఈ బృందానికి విందు ఇవ్వనున్నారు. రేపు సీఎంతో సమావేశం.. మంగళవారం ఉదయం 10 గంటలకు ప్రజాభవన్‌లో సీఎం రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో ఆర్థిక సంఘం బృందం సమావేశం కానుంది. రాష్ట్రం నుంచి కేంద్రానికి పన్నుల రూపంలో వెళ్తున్న ఆదాయంతో పోలిస్తే రాష్ట్రానికి కేంద్రం చేస్తున్న కేటాయింపులు తక్కువగా ఉంటున్నందున వాటిని పెంచేలా కేంద్రానికి నివేదించాలంటూ 16వ ఆర్థిక సంఘానికి సీఎం విజ్ఞప్తి చేసే అవకాశం ఉంది. అభివృద్ధిలో పురోగమిస్తున్న తెలంగాణ వంటి రాష్ట్రాలకు నిధుల కేటాయింపులు పెంచితే దేశ ఆర్థిక వ్యవస్థ మరింత వృద్ధి చెందుతుందని.. తద్వారా కేంద్ర, రాష్ట్రాలకు ఆదాయం పెరుగుతుందని ఆయన సూచించనున్నట్లు తెలిసింది.15వ ఆర్థిక సంఘం నిధుల వినియోగంతోపాటు 16వ ఆర్థిక సంఘం నుంచి ఆశిస్తున్న సహకారంపై ఈ సమావేశంలో రాష్ట్ర ఆర్థిక, పురపాలక శాఖలు ప్రత్యేక ప్రజెంటేషన్ ఇవ్వనున్నాయి. అనంతరం ప్రజాభవన్‌లో అరవింద్ పనగరియా బృందానికి భట్టి విక్రమార్క విందు ఇవ్వనున్నారు. మధ్యాహ్నం 1 గంటకు అరవింద్ పనగరియా బృందం మీడియా సమావేశంలో తమ పర్యటన వివరాలను వెల్లడించనుంది. 11న ఉదయం 16వ ఆర్థిక సంఘం తిరిగి వెళ్లిపోనుంది. 2025–26 నుంచి 2030–31 మధ్య కేంద్రం, రాష్ట్రాల మధ్య జరగాల్సిన నిధుల పంపకాల విషయంలో 16వ ఆర్థిక సంఘం చేయనున్న సిఫారసులు కీలకం కానున్నాయి. 2025 అక్టోబర్ 31 నాటికి నివేదిక సమరి్పంచాల్సి ఉండగా 2026 ఏప్రిల్ 1 నుంచి ఇది అమల్లోకి రానుంది. రాష్ట్రాల ఆర్థిక వనరులను అంచనా వేసి ఐదేళ్ల కాలంలో దేశవ్యాప్తంగా ఉన్న పంచాయతీలు, మున్సిపాలిటీలకు అదనపు నిధులను సమకూర్చడానికి తీసుకోవాల్సిన చర్యలనూ సిఫారసు చేయనుంది. పీహెచ్‌సీని సందర్శించనున్న 16వ ఆర్థిక సంఘం 16వ ఆర్థిక సంఘం సభ్యుడు అజయ్ నారాయణ్ ఝా మంగళవారం మధ్యాహ్నం ప్రజాభవన్‌లో పురపాలక శాఖ అధికారులతో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. 15వ ఆర్థిక సంఘం కింద జీహెచ్ఎంసీకి మంజూరైన నిధుల వినియోగంపై సంస్థ అధికారులు ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. ఆ తర్వాత ఆయన మధ్యాహ్నం 3 గంటలకు యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలంలోని అనంతారం గ్రామాన్ని సందర్శించనున్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్సీ) పనితీరును, గ్రామీణ ప్రాంతాల్లో వైద్య రంగానికి కేటాయించిన 15వ ఆర్థిక సంఘం నిధుల వినియోగాన్ని పరిశీలించనున్నారు. అనంతరం తిరిగి హైదరాబాద్ చేరుకోనున్నారు. -
నేడు ఆర్థిక రంగ నిపుణుల సమావేశం
హైదరాబాద్: ఆర్థిక రంగ నిపుణుల కమిటీ సమావేశం నేడు జూబ్లీహాలులో జరగనుంది. రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కోసం 14వ ఆర్ధిక సంఘానికి ఏడు కీలక అంశాలపై ప్రతిపాదనలు సమర్పించేందుకు రాష్ట్ర సర్కార్ ఈ సందర్భంగా సన్నద్ధమవుతోంది. రాష్ట్రంలో అమలు చేస్తున్న కార్యక్రమాలు, వాటికి కేటాయిస్తున్న నిధులు వంటి అంశాలపై సోదాహరణంగా ఆర్ధిక సంఘానికి వివరించాలని నిర్ణయించింది. ఈరోజు ఉదయం జూబ్లీ హాలులో ఆర్థిక శాఖ నిర్వహించే సమావేశంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, ఇతర మంత్రులు, అధికారులు ఆర్ధిక సంఘం ప్రతినిధులు పాల్గొననున్నారు. ఆర్థిక సంఘం చైర్మన్ వైవి రెడ్డి, సభ్యులు అనిజిత్ సేన్, సుష్మానాధ్, ఎం.గోవిందరావు, సుదిప్తో మండల్, కేంద్రం నుంచి వచ్చే పలువురు అధికారులు కూడా సమావేశంలో కీలక అంశాలపై చర్చిస్తారు. ఈ సందర్భంగా రాష్ట్ర అవసరాలను వివరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేసుకుంటోంది. ఏడు రంగాలకు సంబంధించిన అవసరాలపై ఆర్ధిక సంఘానికి ప్రతిపాదనలు సమర్పించనుంది. రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థ, ప్రణాళిక, గ్రామీణాభివృద్ధి, ఎస్సీ-ఎస్సీ సబ్‌ప్లాన్, ఆరోగ్యం, నగదు బదిలీ పథకం, నీటిపారుదలశాఖలపై ఈ ప్రతిపాదనలు ఉంటాయి. రాష్ట్రంలో అమలు చేస్తున్న పథకాలు, వాటిపై చేస్తున్న ఖర్చు, అందుకు కావాల్సిన నిధులు వంటి అంశాలను వివరించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు.