breaking news
ficus waiter
-
బాధిత రైతులకు.. అండగా..
గుంటూరు సిటీ: బాధిత రైతుల్లో మనో ధైర్యం నింపేందుకు మరోమారు రాజధాని ప్రాంతంలో పర్యటించనున్నట్టు వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ వెల్లడించారు. బుధవారం గుంటూరులోని పార్టీ జిల్లా కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏర్పాటు చేసిన రాజధాని రైతులు, కౌలు రైతులు, కూలీల హక్కుల పరిరక్షణ కమిటీ గురువారం పలు గ్రామాల్లో పర్యటించి రైతులకు అండగా నిలవనున్నట్టు ఆయన తెలిపారు. ఉదయం పది గంటలకు ఉండవల్లి నుంచి ప్రారంభించి పెనుమాక, నిడమర్రు, ఉద్దండ్రాయునిపాలెం, లింగాయపాలెం గ్రామాల్లో పర్యటన జరగనున్నట్టు వివరించారు. ఈ సందర్భంగా రైతులకు తమ అండ ఉంటుందని తెలియజేయడంతోపాటు ప్రభుత్వానికి స్పష్టమైన హెచ్చరికలు కూడా జారీ చేస్తామన్నారు. అనంతరం జిల్లా ఎస్పీని కలసి వాస్తవ పరిస్థితులపై వినతిపత్రం సమర్పిస్తామన్నారు. రాజధాని ప్రాంతంలోని అన్ని గ్రామాల్లో ఎమర్జెన్సీ వాతావరణం రాజ్యమేలుతోందని మర్రి రాజశేఖర్ ఆందోళన వ్యక్తం చేశారు. రాజధానికి భూములివ్వని వారిని భయభ్రాంతులకు గురిచేసే విధంగా అక్కడ పచ్చచొక్కాల దమనకాండ అమలవుతోందని ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో ప్రజల భూములను దౌర్జన్యంగా లాక్కునేందుకు ప్రయత్నించడమేమిటని ఆయన ప్రశ్నించారు. ఇవ్వనంటే అర్ధరాత్రి దాడి చేసి పోలీసులతో అక్రమంగా నిర్బంధిస్తారా? ఇదెక్కడి న్యాయం? అంటూ పాలకులను నిలదీశారు. దహనకాండ వ్యవహారంలో శ్రీనాథ్‌చౌదరి అనే వ్యక్తిపై అక్రమ కేసు మోపారన్నారు. బాధ్యతాయుత ప్రతిపక్షంగా అక్రమాలను ప్రతిఘటిస్తూ రైతులకు అండగా నిలుస్తున్న వైఎస్సార్ సీపీ పైనే ఆరోపణలు చేస్తూ తమతోపాటు రైతుల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. అయితే వారి తాటాకు చప్పుళ్లకు బెరిరే వారు ఇక్కడ ఎవరూ లేరనే విషయాన్ని సీఎం చంద్రబాబు గుర్తుంచుకోవాలన్నారు. తాము ఇక్కడ రాజధాని నిర్మించవద్దని కానీ, ఎవరూ భూములు ఇవ్వవద్దని కానీ ఎన్నడూ వ్యాఖ్యానించలేదని ఆయన స్పష్టం చేశారు. -
నేటి నుంచి రైతు హక్కుల కమిటీ పర్యటన
విద్యానగర్ (గుంటూరు): ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మించతలపెట్టిన గ్రామాల్లో వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏర్పాటు చేసిన రాజధాని రైతుల, కూలీల హక్కుల పరిరక్షణ కమిటీ గురువారం నుంచి పర్యటించనుందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ తెలిపారు. బుధవారం గుంటూరులోని పార్టీ జిల్లా కార్యాలయంలో మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సన్నాహక సమావేశంలో మంగళగిరి, తుళ్లూరు మండలాల రైతులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. తొలుత మర్రి రాజశేఖర్ మాట్లాడుతూ కమిటీ పర్యటన గురు,శుక్ర రెండు రోజులపాటు జరుగుతుందన్నారు. ఆయా గ్రామాల్లో పార్టీ ప్రధాన కార్యదర్శులు ధర్మాన ప్రసాదరావు, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, పీఏసీ సభ్యుడు అంబటి రాంబాబు, మాజీ మంత్రి పార్థసారధి, ఎమ్మెల్యేలు ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే), గొట్టిపాటి రవికుమార్, కొడాలినాని, ఉప్పులేటి కల్పన, జలీల్‌ఖాన్, రైతు సంఘం అధ్యక్షుడు ఎంవీఎస్ నాగిరెడ్డి, కత్తెర సురేష్, తాడికొండ సమన్వయకర్త క్రిస్టినా పర్యటించి రైతులు, కౌలు రైతులు, కూలీలు, ప్రజల అభిప్రాయాలను సేకరిస్తారన్నారు. కమిటీ గురువారం ఉదయం తొమ్మిది గంటలకు గుంటూరులోని పార్టీ జిల్లా కార్యాలయం నుంచి బయలుదేరి ఉండవల్లి, పెనుమాక, నిడమర్రు, కురగల్లు, నీరుకొండ, ఐనవోలు, శాఖమూరు గ్రామాల్లో పర్యటిస్తారని తెలిపారు. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) మాట్లాడుతూ రాజధాని నిర్మించే ప్రాంతాల్లో రానున్న సమస్యలు, వాటి పరిష్కారాలు, ప్రజలకు ప్రభుత్వం కల్పించాల్సిన సౌకర్యాలు, లాభనష్టాలపై ప్రజలతో చర్చిస్తామన్నారు. రైతులు నష్టపోకుండా ప్రభుత్వం తీసుకునే చర్యలు, అటు రైతులకు ఇటు ప్రజలకు ప్రభుత్వం కల్పించాల్సిన సౌకర్యాలు గురించి చర్చించి వారి వారి అభిప్రాయాలు సేకరిస్తామన్నారు. రాజధాని నిర్మాణంలో ప్రజలకు ఎలాంటి అన్యాయం జరిగినా పార్టీ తరఫున పోరాడేందుకు ప్రతి కార్యకర్త, నాయకుడు సిద్ధంగా ఉండాలని సూచించారు. తాడికొండ నియోజకవర్గ సమన్వయకర్త కత్తెర సురేష్ మాట్లాడుతూ పార్టీ ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు నిర్వహిస్తున్న ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో పార్టీ సేవాదళ్ జిల్లా కన్వీనర్ కొత్తా చిన్నపరెడ్డి, విద్యార్థి విభాగం అధ్యక్షుడు నర్సిరెడ్డి, గుంటూరు రూరల్ మండలం జెడ్పీటీసీ సభ్యుడు కొలకలూరి కోటేశ్వరరావు, దుగ్గిరాల జెడ్పీటీసీ సభ్యురాలు జయలక్ష్మి, ఎంపీపీ రత్నకుమారి, తాడేపల్లి నగర కన్వీనర్ సాంబిరెడ్డి, పెనుమాక మండల కన్వీనర్ మేకా సాంబశివరావు, తుళ్లూరు మండల కన్వీనర్ కృష్ణారావు, నిడమర్రు, పెదవడ్లపూడి ఎంపీటీసీ సభ్యులు శ్రీనివాసరెడ్డి, శేషారావు, శాఖమూరు గ్రామ సర్పంచ్ ప్రసాదరెడ్డి, పార్టీనాయకులు మండేపూడి పురుషోత్తం, జెపీ, వేమారెడ్డి, కృష్ణమూర్తి, మెట్టు శివరామకృష్ణారెడ్డి, కిక్కురు అర్లారెడ్డి, శ్రీనివాసరెడ్డి, ఇంటూరి అంజిరెడ్డి, శివారెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, అభిమానులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఉదయం పది గంటలకు ఉండవల్లి నుంచి ప్రారంభం మంగళగిరి: రాజధాని రైతు హక్కుల పరిరక్షణ కమిటీ పర్యటన గురువారం ఉదయం 10 గంటలకు తాడేపల్లి మం డలం ఉండవల్లి గ్రామం నుంచి ప్రారంభమవుతుందని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) తెలిపారు. ఉండవల్లి, పెనుమాక, మంగళగిరి మండలంలోని యర్రబాలెం, నవులూరు గ్రామాల్లో పర్యటించిన తరువాత కమిటీ నిడమర్రు గ్రామంలో మధ్యాహ్నం భోజన విరా మం తీసుకుంటుందని చెప్పారు. మధ్యాహ్నం మూడు గంటలకు కురగల్లు, నీరుకొండ గ్రామాల్లో పర్యటించిన అనంతరం కమిటీ తాడి కొండ నియోజకవర్గంలోకి ప్రవేశిస్తుందన్నారు.