breaking news
female education
-
మహిళలు... మణిపూసలు..!
అహల్యాబాయ్ మహారాష్ట్ర సైన్యానికి సారథ్యం వహించి మహిళలను సంఘటితం చేసింది. దుర్గాబాయ్ దేశ్ముఖ్ ఆంధ్ర మహిళాసభను స్థాపించి, పిల్లలందరూ ఉచితంగా చదువుకోవడానికి, స్త్రీవిద్యకు ఎంతగానో కృషి చేసింది. సుచేతా కృపలానీ, కస్తూర్బాగాంధీ, విజయలక్ష్మీ పండిట్... వంటివారంతా స్వాతంత్య్రోద్యమ సమయంలో స్త్రీలందరినీ సంఘటితం చేశారు. అనిబిసెంట్ దివ్యజ్ఞాన సమాజాన్ని స్థాపించి ఆధ్యాత్మికతను ప్రజలలోకి తీసుకువెళ్లడానికి ఒక ఉద్యమం నడిపింది. గుంటూరులో శారదానికేతన్ స్థాపించిన లక్ష్మీబాయమ్మ స్త్రీవిద్యకు తోడ్పడింది. ఇలా చెప్పుకుంటే చరిత్ర పుటల్లో ఎందరో మణిపూసల్లాంటి ఎందరో గొప్ప మహిళలు. వారిలో కొందరిని స్వాతంత్య్ర దినం దగ్గరపడుతున్న సందర్భంలో ఓసారి గుర్తు చేసుకుందాం! రాణీ లక్ష్మీబాయి ఈమె ఝాన్సీలక్ష్మీబాయిగా, రాణీ ఆఫ్ ఝాన్సీగా అందరికీ పరిచితులు. పురుష వేషం ధరించి సైన్యాన్ని ముందుకు నడిపింది. తుది శ్వాస వరకు పోరాడింది, నిజమైన వీరురాలిగా యుద్ధభూమిలో మరణించింది. సంప్రదాయమైన విద్య మాత్రమే కాకుండా, విలు విద్య, గుర్రపు స్వారీ, ఆత్మరక్షణ వంటివి నేర్చుకుంది. తను నమ్మిన సిద్ధాంతం కోసం ఇవి ఉపయోగపడ్డాయని ఆవిడ నమ్మకం. సరోజినీనాయుడు భారతకోకిల సరోజినీనాయుడు భారత జాతీయోద్యమంలో పాల్గొన్నారు. తన వాగ్ధాటితో ఎందరో దేశాభిమానులను ఉద్యమానికి అండగా నిలబడమని ఉత్తేజపరిచారు. పన్నెండేళ్లకే మెట్రిక్ పరీక్షలో ప్రథమంగా నిలిచారు. ఆ తరువాత తన చదువును లండన్లో కొనసాగించారు. ఆమెకు పలు భాషలలో ఉన్న ప్రావీణ్యత కారణంగానే గొప్ప కవయిత్రి, వక్త, రచయిత్రిగా పేరుప్రఖ్యాతులు సంపాదించడమే కాకుండా గవర్నరుగా కూడా తన ప్రతిభ చాటారు. మేడమ్ భికాజీ కామా భారతదేశ స్వాతంత్య్రం కోసం జెండా పట్టుకుని ఐరోపా పర్యటించినందుకుగాను మేడమ్ కామాకు మనమంతా ఋణపడి ఉండాలి. అలెగ్జాండ్రా నేటివ్ గర్ల్స్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్లో చదువు పూర్తి చేసుకున్నాక, మేడమ్ భికాజీ వివాహం చేసుకున్నారు. అయితే ప్లేగు వ్యాధిగ్రస్తులకి సేవ చేస్తూ తాను కూడా ఆ వ్యాధికి గురి కావడంతో వైవాహిక జీవితం దెబ్బతింది. చికిత్సకోసం ఐరోపా వెళ్లారు. వ్యాధి తగ్గిన తర్వాత స్వాతంత్య్ర పోరాటంలో చురుకుగా పాల్గొన్నారు. ఐరోపా నుంచే నేషనలిస్ట్ డాక్యుమెంట్లు అనువాదం చేసి పంపుతూ భారతీయులను ఉత్తేజపరిచారు. జాతీయపతాక రూపకల్పనలో కృషి చేశారు. అరుణా అసఫ్ అలీ ‘ద గ్రాండ్ లేడీ ఆఫ్ ఇండియా’ గా ప్రఖ్యాతి చెందిన అరుణా అసఫ్ అలీ, ఎన్నో ఉద్యమాలలో చురుకుగా పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీలోనూ, క్విట్ఇండియా ఉద్యమంలోనూ తన వంతు సేవలు చురుకుగా అందించారు. రాజకీయ ఖైదీగా తీహార్ జైల్లో జీవితం గడిపారు. క్విట్ ఇండియా ఉద్యమంలో అజ్ఞాతంగా పాల్గొన్న అరుణా... కారాగారం నుంచి విడుదలైన తర్వాత, క్విట్ఇండియా ఉద్యమం నుంచి తప్పుకున్నారు. చదువులో ముందంజలో ఉంటూ అందరి ప్రశంసలు అందుకున్నారు. డిగ్రీ పూర్తయ్యాక, తను ముందుండి పదిమందిని ముందుకు నడిపించడానికి, కలకత్తాలోని గోఖలే మెమోరియల్ స్కూల్లో టీచరుగా తన జీవితాన్ని అంకితం చేశారు. జీవించినప్పుడు పద్మవిభూషణ అవార్డు, మరణానంతరం భారతరత్న అవార్డులు ఆమెను వరించాయి. సుచేతా కృపలానీ భారతదేశంలో మొట్టమొదటి మహిళా ముఖ్యమంత్రి సుచేతా కృపలానీ. ఢిల్లీలోని ఇంద్రప్రస్థ కాలేజీ, సెయింట్ స్టీఫెన్స్ కళాశాలలో ఆమె విద్యాభ్యాసం గడిచింది. బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో పొలిటికల్ హిస్టరీ విభాగంలో ప్రొఫెసర్గా పనిచేశారు. రాజ్యాంగ సంబంధిత అంశాలలో ఉన్న పరిజ్ఞానంతో చట్టాలు, విధానాల గురించి సమగ్రంగా తెలుసుకున్నారు. క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొంటూ, దేశం కోసం పోరాడటం ప్రారంభించారు. భారత రాజ్యాంగ నిర్మాణంలో సైతం పాల్గొన్నారు. -
నిర్లక్ష్యం నీడన పిళ్లై సమాధి
అన్నానగర్: మయూరం వేదనాయగంపిళ్లై తమిళ సాహిత్య తొలి నవలా రచయిత. తన రచనల ద్వారా స్త్రీ విద్య, స్త్రీల స్వేచ్ఛకు ఎంతో కృషి చేశారు. కరువు సంభవించిన సమయంలో సొంత డబ్బుతో పేద వారికి ఇతోధికంగా సాయం అందించిన దయూగుణ శీలి. సామాజిక వేత్త. అలాంటి వ్యక్తి సమాధిని ప్రభుత్వం పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వదిలివేయడంపై రచయితలు, ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మైలాడుదురై సమీపంలోని మయూరం ప్రాంతానికి మునసబుగా పనిచేసిన వేదనాయగంపిళ్లై కొలత్తూరులో 1826 అక్టోబరు 11న జన్మించారు. ఆయన రచయితగా పేరు తెచ్చుకున్నారు. తన రచనల ద్వారా స్త్రీల స్వేచ్ఛను, స్త్రీలకు విద్యను అందించాలని పేర్కొన్నారు. ఆయన రచనల్లో నేతినూళ్, తిరువాళుర్మాలై, తిరువాళుర్ అంతాడి, దేవమాత, పెరియనాయగి, అమ్మన్పధిగం, తమిళ భాషలో తొలి నవలగా చెప్పబడుతున్న ప్రతాపమందలియారుచరితం, సుగుణంబాల్ చరిత్ర, పెన్మణం, పెణ్కల్వి, పెణ్మదిమాలై, సంగీత పర గ్రంథాలైన దేవ స్త్రోత్ర కీర్తనగళ్ తదితరాలు ఉన్నారు. వేదనాయగంపిళ్లై క్రిస్టియన్ వనితను వివాహం చేసుకోవడంతో వారి వంశస్తులు ఆయనను కులం నుంచి వెలివేశారు. దీంతో ఆయన మైలాడుదురై వచ్చి అక్కడే స్థిరపడ్డారు. తమిళ సాహిత్యానికి ఎంతో సేవ చేశారు. పేదలకు తనకు చేతనైనంత మేరకు సహాయం అందించారు. మయూరం ప్రాంతానికి మునసబుగా పనిచేశారు. ఆ సమయంలో కరువు సంభవించడంతో తన సొంత డబ్బుతో పేదలకు సాయం అందించారు. ఆయన 1889 జూలై 21న తుదిశ్వాస విడిచారు. ఆయన భౌతికకాయూన్ని మైలాడుదురై మెయిన్ రోడ్డు నుంచి మాయవరానికి వెళ్లే దారిలోని ఆర్సీ శ్మశాన వాటికలో సమాధి చేశారు. ఆయన సమాధికి ఆనుకునే ఆయన తల్లి మరియమ్మాళ్, భార్య లాజర్ అమ్మాళ్ (వీరిద్దరూ బ్రిటీష్ వనితలు)ల సమాధులు కూడా ఉన్నాయి. పసుపు రంగు సున్నపురాయితో మరియమ్మాళ్ సమాధిని, లాజర్ సమాధిని నిర్మించారు. ఈ రెంటికి ఎదురుగా దీర్ఘ చతురస్రాకారంలో పిళ్లై సమాధి ఉంది. 1983 వరకూ ధర్మపురం మఠం వారు ఈ సమాధులను పరిరక్షించారు. అనంతరం ఎవ్వరూ వీటిని పట్టించుకున్న పాపాన పోలేదు. దీంతో అవి శిథిలావస్థకు చేరుకున్నారు. సమాధిపైన కలుపు మొక్కలు పెరిగిపోరుు అధ్వానంగా దర్శనమిస్తోంది.