breaking news
fake business
-
‘తప్పు’ తేలితే తప్పదు శిక్ష
సాక్షి, అమరావతి: మోటారు సైకిల్ మీద పెద్ద మొత్తంలో ఇనుము తుక్కు తరలించడం సాధ్యమా అంటే.. కానేకాదని ఎవరైనా చెబుతారు. కానీ, విజయవాడ వన్‌టౌన్‌కు చెందిన ఒక తుక్కు వ్యాపారి (స్క్రాప్ డీలర్) మోటార్ సైకిళ్లపై టన్నులకొద్దీ తుక్కు ఇనుమును ఇతర రాష్ట్రాలకు తరలించేశారట. ఆ సంస్థ లావాదేవీలు అసహజంగా ఉండటంతో వాణిజ్య పన్నుల శాఖ అధికారులు లోతుగా పరిశీలించి, ఈ వాహన్ ద్వారా ఆ వాహనాలను పరిశీలిస్తే.. అవన్నీ మోటారు సైకిళ్లని, వాటిపైనే ఏకంగా 20 టన్నుల తుక్కు ఇనుము తరలించినట్లు వే బిల్లులు తీసుకున్నారని వెల్లడైంది. ఆ బిల్లులన్నీ నకిలీవేనని తేలింది. అంతేకాదు ఒడిశా నుంచి విశాఖకు సరుకు తరలించినట్లుగా పేర్కొన్న లారీ నంబర్‌ను పరిశీలించగా.. బిల్లులో పేర్కొన్న సమయంలో ఆ లారీ కేరళలో ఉన్నట్టు తేలింది. ఇలా పలువురు వ్యాపారులు అసలు సరుకు రవాణా చేయకుండానే దొంగ వే బిల్లులు తీసుకొని ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ పేరుతో ప్రభుత్వం నుంచి ఎదురు డబ్బులు తీసుకుంటున్నారు. ఆ స్క్రాప్ వ్యాపారి దొంగ వే బిల్లులు సృష్టించినట్లు స్పష్టం కావడంతో కేసులు నమోదు చేశామని, ఆ లావాదేవీలపై పన్ను వసూలు చేయడంతో పాటు దానికి రెట్టింపు పెనాల్టీ విధించనున్నట్లు వాణిజ్యపన్నుల శాఖ చీఫ్ కమిషనర్ గిరిజా శంకర్ చెప్పారు. తప్పు చేసిన వారు దొరికిపోతారిలా.. గతంలో వాణిజ్య పన్నుల శాఖ అంటే వ్యాపారులు తమను వేధించే విభాగంగా చూసేవారు. ఎక్కడికక్కడ వాహనాలు ఆపి తనిఖీలు చేయడం, చెక్ పోస్టు తనిఖీలు, మూకుమ్మడిగా వ్యాపారులపై తనిఖీల పేరుతో బెంబేలెత్తించేవారు. జీఎస్టీ వచ్చిన తర్వాత ఆ వాతావరణం కనిపించడంలేదు. దొంగ ఎక్కడున్నాడో గుర్తించి అక్కడే తనిఖీలు చేస్తున్నారు. విజయవాడలో అనేక మంది స్క్రాప్ డీలర్లు ఉండగా దొంగ వ్యాపారం చేస్తున్న ఆ డీలరు దగ్గరకే నేరుగా వెళ్లడమే దీనికి నిదర్శనం. ఇందుకోసం వాణిజ్య పన్నుల శాఖ అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు వ్యాపారులపై వేధింపులు లేకుండా డేటా అనలిటిక్స్ కేంద్రాన్ని ఏర్పాటు చేసి రాష్ట్రంలో జరుగుతున్న వ్యాపార లావాదేవీలను నిరంతరం పర్యవేక్షిస్తోంది. ఒక వ్యాపారి తీసుకుంటున్న ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్, వే బిల్లులు, వస్తువుల కొనుగోళ్లు, విక్రయాలు, పన్ను చెల్లింపులు వంటి అనేక అంశాలను పరిశీలించి వాటి మధ్య భారీ తేడాలు ఉంటే డేటా అనలిటిక్స్ ద్వారా సులభంగా గుర్తిస్తోంది. దీని ద్వారా గతంలోలా ప్రతి వ్యాపారినీ తనిఖీ చేయాల్సిన అవసరం లేదని, తప్పు ఎవరు చేస్తున్నారో నిర్ధారించుకొని, పూర్తి సాక్ష్యాధారాలతో దాడులు చేస్తున్నట్లు గిరిజా శంకర్ తెలిపారు. ఈ విధంగా ఈ మధ్య కాలంలో జరిపిన తనిఖీల్లో విజయవాడలోని ఒక ప్రముఖ ఎలక్ట్రికల్ షోరూం ఎటువంటి బిల్లులు లేకుండా 80 శాతం పైగా నగదు రూపంలో లావాదేవీలు నిర్వహిస్తున్నట్లు గుర్తించామన్నారు. ఒకడ్రై ఫ్రూట్ వ్యాపారి రూ.35 కోట్ల మేర నగదు లావాదేవీలు నిర్వహించినట్లు గుర్తించారు. కొంతమంది వ్యాపారులు సరుకు రవాణా అయిపోగానే కంప్యూటర్ నుంచి డేటా డిలీట్ చేయడం, వాట్సాప్ ద్వారా లావాదేవీలు నిర్వహిస్తూ అయిపోయిన వెంటనే వాటిని డీల్ట్ చేస్తున్న విషయాన్ని అధికారులు గుర్తించారు. డిలీట్ చేసిన డేటాను మొత్తం తిరిగి రిట్రీవ్ చేసి ఆధారాలతో కేసులు నమోదు చేశారు. నిజాయితీగా వ్యాపారం చేస్తున్న వారికి అనవసరపు తనిఖీలు, దాడులు ఉండటంలేదు. ఈ విధానం పట్ల పలువరు వ్యాపారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తనిఖీలు తగ్గించడమే లక్ష్యం రాష్ట్రంలో వ్యాపారులపై దాడులు లేకుండా చేయాలన్నదే మా ప్రభుత్వ విధానం. ఇందుకోసం పూర్తిస్థాయిలో డేటా అనలిటిక్స్ కేంద్రం ఏర్పాటు చేస్తున్నాం. దీనివల్ల తప్పుడు వ్యాపారం చేస్తున్న వారిని సులభంగా గుర్తించవచ్చు. చట్ట ప్రకారం వ్యాపారం చేస్తూ బాధ్యతగా పన్ను చెల్లించే వాతావరణం తీసుకువస్తాం. ఇందుకోసం వ్యాపారులతో ఎప్పటికప్పుడు సమావేశాలు నిర్వహించి సూచనలు, సలహాలు తీసుకుంటాం. – బుగ్గన రాజేంద్రనాథ్, ఆర్థిక, వాణిజ్య పన్నుల శాఖ మంత్రి -
అంతా రహస్యమే..
నరసరావుపేటలో రహస్యంగా వ్యాపారాలు పేటను కల్తీల కోటగా మారుస్తున్న అత్యాశాపరులు నేమ్ బోర్డులు ఏర్పాటు చేయకున్నా పట్టించుకోని అధికారులు రూపాయి రూపాయి నువ్వేమి చేస్తావంటే..మనుషుల మధ్య సంబంధాలు చెడగొడతాను..మనుషుల మధ్య ఆంతర్యాలు పెంచుతాను..మనుషుల మనసుల్లో అత్యాశను పెంచి..అదే మనుషుల ప్రాణాలను గాలిలో దీపంలా మారుస్తానని చెప్పిందట..ఇప్పుడ నరసరావుపేట ఆయిల్ వ్యాపారులూ ఈ రూపాయి పేరాశలో మునిగిపోయారు..పసిపిల్లలు తాగే పాల నుంచి వంటిట్లో నూనెల వరకు కల్తీ చేస్తూ ప్రజల ఆరోగ్యంతో నిత్యం చెలగాటమాడుతున్నారు..అసలు వీరు ఏమి చేస్తున్నారో కూడా తెలియనంత రహస్యంగా వ్యాపారాలు కొనసాగిస్తున్నారు. నరసరావుపేట: పట్టణంలో వ్యాపారం మొత్తం రహస్యమే. అంతా కల్తీనే..తాము చేసేది పది మందికీ తెలియకుండా అంతా రహస్యంగా వ్యాపారం చేయాలనుకుంటున్నారు ఇక్కడి ఆయిల్ వ్యాపారులు. వారు ఏ వ్యాపారం చేస్తున్నారో...ఏ పేరుతో వ్యాపారం చేస్తున్నారో అనేది తెలియనే తెలియదు. వీరి దురాశ పుణ్యమాని నరసరావుపేట..కల్తీల కోటగా మారిపోయింది. ఏడాది కాలంలో అధికారులు ఇక్కడ 16 సార్లు పాలు, శనగనూనె మిల్లులు, వాటర్ ప్లాంట్లపై దాడులు నిర్వహించారు. శనగనూనె, పామాయిల్, తవుడు నుంచి తీసిన రైస్ బ్రౌన్ ఆయిల్‌ను పీపాలు, ట్యాంకర్లతో టోకు మొత్తంగా దూర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. దీనిని తమ సొంత బ్రాండ్లపై తక్కువ రేటు ఉన్న ఆయిల్‌ను ఎక్కువ రేటు ఉన్న ఆయిల్‌తో కలిపి ప్యాకెట్లలో నింపుతున్నారు. రాష్ట్రంతోపాటు ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నారు. ఇలా కోట్ల రూపాయల కల్తీ వ్యాపారం చేస్తున్నారు. కోటప్పకొండ, వినుకొండ, సత్తెనపల్లి రోడ్లు, బరంపేట ప్రాంతాల్లో ఇటువంటి ఆయిల్ మిల్లులు ఉన్నాయి. పట్టణంలో కొబ్బరి, శనగగుండ్లతో ఆయిల్ తయారు చేసే మిల్లులు చాలా ఉన్నా వాటికి నేమ్ బోర్డులు ఏర్పాటు చేయలేదు. దాల్, రైస్ మిల్లుల్లో చాలా వాటికీ పేర్లు లేవు. బయటి నుంచి చూస్తే లోపల ఏమి జరుగుతుందో ఎవరికీ తెలియదు. కొత్త వ్యక్తులకు పలానా పేరు గల మిల్లు అని చెప్పినా త్వరగా తెలుసుకోలేని పరిస్థితి ఉంది. పరిశ్రమ పెట్టేందుకు పరిశ్రమల శాఖ, వ్యాపారం చేసేందుకు వాణిజ్య పన్నుల శాఖ, కార్మిక శాఖ నుంచి తగిన లెసైన్స్‌లు పొంది వీరు వ్యాపారం చేయాలి. ప్రభుత్వ నిబంధన ప్రకారం ప్రతి ఒక్కరూ తాము చేస్తున్న వ్యాపారానికి తగిన బోర్డు ప్రవేశ ద్వారం వద్ద ఏర్పాటు చేయాలి. నరసరావుపేటలో ఇవేమీ అమలు కావడం లేదు. నేమ్ బోర్డులు తప్పకుండా ఏర్పాటు చేయాలి లెసైన్స్‌లు తీసుకున్న వ్యక్తులు తప్పకుండా నేమ్ బోర్డులు ఏర్పాటు చేయాలి. బోర్డులు లేని వ్యాపారాలను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటాం - మంజులారాణి, వాణిజ్యపన్నుల శాఖాధికారి, నరసరావుపేట -
చిట్టీల పేరుతో హెడ్‌కానిస్టేబుల్ చీటింగ్
హైదరాబాద్ సిటీ (సరూర్‌నగర్): చిట్టీల పేరుతో ఓ హెడ్ కానిస్టేబుల్ జనం నెత్తిన టోపీ పెట్టిన సంఘటన సరూర్‌నగర్‌లోని గ్రీన్పార్కుకాలనీలో సోమవారం వెలుగు చూసింది. అబిడ్స్ పోలీస్ స్టేషన్లో హెడ్‌కానిస్టేబుల్ పనిచేస్తున్న వెంకటేశ్వర్లు సరూర్‌నగర్‌లోని గ్రీన్‌పార్కు కాలనీలో అరుణ చిట్‌ఫండ్ నిర్వహిస్తున్నాడు. కోట్ల రూపాయల్లో వ్యాపార లావాదేవీలు నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో చిట్టీలు పాడుకున్నవారికి డబ్బులు ఇవ్వకుండా వేధిస్తున్నాడు. అతడ్ని నమ్మి కోట్ల రూపాయలు చిట్టీలు వేసి మోసపోయామని గ్రహించిన బాధితులు సోమవారం సరూర్‌నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు. బాధితుల ఫిర్యాదుపై పోలీసులు నిర్లక్ష్యం చేశారు. ఇదేమి అన్యాయమని నిలదీసిన బాధితులపై ఎస్ఐ ప్రభాకర్ సర్వీసు రివాల్వర్‌తో బెదిరించాడు. ఉన్నతాధికారులు స్పందించి తగిన న్యాయం చేయాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు.