breaking news
Fabiana
-
89 ఏళ్ల వయస్సులో...
లండన్: కోవిడ్–19 మహమ్మారి వల్ల గత కొన్నిరోజులుగా అన్ని దుర్వార్తలే వింటున్న నేపథ్యంలో ‘ఫార్ములావన్’ మాజీ చీఫ్ ఎకిల్‌స్టోన్ నుంచి ఓ శుభవార్త వచ్చింది. 1978 నుంచి 2017 వరకు ఫార్ములావన్‌కు సీఈఓగా ఉన్న ఆయన త్వరలోనే తండ్రి కాబోతున్నాడు. మామూలుగా అయితే ఎవరైనా తండ్రి కావడం సాధారణ విషయమే. కానీ ఎకిల్‌స్టోన్‌కు ఇప్పుడు 89 ఏళ్లు! అదే ఈ వార్తకున్న విశేషం! ఆయనకు లేటు వయసులోనూ నాన్నయ్యే ‘ఫార్ములా’ పంట పండింది. ఎకిల్‌స్టోన్ మూడో భార్య 44 ఏళ్ల ఫాబియానా ఫ్లోసి ఈ జూలైలో తన వృద్ధండ పెనిమిటికి వారసుణ్ని బహుమతిగా ఇవ్వనుంది. వైద్య పరీక్షల్లో ఆమెకు కలిగే సంతానం మగ శిశువని తేలింది. ఈ వార్త తెలిసినప్పటి నుంచి తన భార్య తెగ సంబరపడుతున్నట్లు ఎకిల్‌స్టోన్ తెలిపారు. తమ ఇద్దరి మధ్య వయసురీత్యా చాలా వ్యత్యాసం ఉండటంతో ఈ వార్తను ఊహించలేదన్నారు. ఎకిల్‌స్టోన్‌కు తన మాజీ ఇద్దరు భార్యల ద్వారా ముగ్గురు అమ్మాయిలు ఉన్నారు. ఇక తాజా వైరస్ మరణమృదంగంపై ఆయన స్పందిస్తూ ‘మొ దట్లో ఏంటీ నాన్సెన్స్ అనుకున్నా. ఫ్లూ గురించి ఎప్పుడూ వినేదే! యేటా ఓ సీజన్‌లా వచ్చిపోయేదే అని భావించా... కానీ ఇది చాలా ప్రమాదకరంగా తయారైంది’ అని కరోనాపై వ్యాఖ్యానించారు. -
ఎఫ్1 బాస్‌కు ‘బేబీ’ కష్టాలు...
బెర్లిన్: ఏ వయసు ముచ్చట ఆ వయసులోనే తీర్చుకోవాలి... లేకుంటే సమస్యలొచ్చిపడతాయి. ఫార్ములా వన్ బాస్ బెర్నీ ఎకిల్‌స్టోన్ (83)కు ఇప్పుడు అదే కష్టమొచ్చిపడింది. ఆయన భార్య ఫాబియానా (37) పిల్లల్ని కనాలని అనుకుంటోంది. ఇదే మాటను ఎకిల్‌స్టోన్‌కు చెప్పిందట. ఆయనేమో ఈ వయసులో పిల్లల్ని కనడం బాగోదేమో అంటున్నారు. ‘నా భార్య ఫాబియానా ఇప్పుడు పిల్లల్ని కనాలనుకుంటోంది. ఇప్పుడు నాకు 83 ఏళ్లు. ఈ వయస్సులో బాగుండదేమో..!’ అని చెప్పారు. అలాగని పిల్లలపై ఆసక్తి చూపడం లేదనుకుంటే పొరపాటే.. ‘నా భార్య కోరిక సాధ్యమవుతుందని ఆశిస్తున్నా. ఒకవేళ అదే జరిగితే ఆరేళ్ల వయసులో స్కూల్‌కు వెళ్లిన నా బిడ్డను నేనే (అప్పటికి నా వయసు 90 ఏళ్లు) తీసుకొస్తే ఎలా ఉంటుందో ఆలోచించండి’ అని ఆయనే అంటున్నారు. ఈ ఎఫ్1 బాస్‌కు ఫాబియానా మూడో భార్య. 2012లో వీరిద్దరు వివాహం చేసుకున్నారు. గతంలో ఇద్దరు భార్యలతో ఆయనకు ముగ్గురు పిల్లలున్నారు.