breaking news
ex-president
-
Jamili Elections: 'జమిలి'పై కమిటీ
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో రాజకీయ వేడి ఒక్కసారిగా పెరిగిపోయింది. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో అధికార బీజేపీని ఎదుర్కొనే వ్యూహాలపై ఓవైపు ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమి కార్యాచరణ సిద్ధం చేస్తుండగా, మరోవైపు ముందస్తు ఎన్నికల ప్రణాళికలకు కేంద్ర ప్రభుత్వం పదును పెడుతోంది. ఈ నెల 18 నుంచి 5 రోజులపాటు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తామని ప్రకటించి ముందస్తు ఎన్నికల అంశాన్ని కేంద్రం ఇప్పటికే తెరపైకి తీసుకొచ్చింది. దానికి మరింత బలం చేకూర్చేలా ‘వన్ నేషన్–వన్ ఎలక్షన్’ సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేయడానికి మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేసింది. జమిలి ఎన్నికల అంశాన్ని తేల్చడానికి 16 మంది సభ్యులతో ఈ కమిటీని నియమించింది. కమిటీ విధివిధానాలు, గడువుపై కేంద్రం త్వరలోనే స్పష్టమైన ప్రకటన చేయనుందని సమాచారం. ఈ పరిణామాలన్నీ చూస్తే ముందస్తు ఎన్నికల హడావుడి మొదలైనట్లే కనిపిస్తోంది. జమిలి ఎన్నికలపై ఇప్పటికే పార్లమెంటరీ స్థాయీ సంఘం, లా కమిషన్ అధ్యయనం చేసి, తమ నివేదికలను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించాయి. జమిలి ఎన్నికల పట్ల అవి సానుకూలంగా స్పందించాయి. భాగస్వామ్యపక్షాల అభిప్రాయాలు తెలుసుకోనున్న కమిటీ ‘వన్ నేషన్–వన్ ఎలక్షన్’పై తొలిసారిగా 2019 జూన్‌లో కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగిన అఖిలపక్ష సమావేశానికి ప్రధాని మోదీ అధ్యక్షత వహించారు. అప్పట్లో సమాజ్‌వాదీ పార్టీ, టీఆర్ఎస్(ఇప్పటి బీఆర్ఎస్), శిరోమణి అకాలీదళ్ వంటి పార్టీలు ఆ ఆలోచనకు మద్దతు ప్రకటించాయి. ఆ తర్వాత 2020 నవంబర్‌లో 80వ ఆల్ ఇండియా ప్రిసైడింగ్ ఆఫీసర్స్ సదస్సులో ‘ఒకే దేశం–ఒకే ఎన్నిక’ అంశంపై ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు. దాదాపు 3 సంవత్సరాల అనంతరం కేంద్ర ప్రభుత్వం దీనిపై కమిటీని ఏర్పాటు చేయడం గమనార్హం. మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఈ కమిటీకి చైర్మన్‌గా వ్యవహరిస్తారు. జమిలి ఎన్నికలకు సంబంధించిన చట్టపరమైన అంశాలను కమిటీ పరిశీలిస్తుంది. నిపుణులు, రాజకీయ పార్టీల నేతలతోపాటు సామాన్య ప్రజల అభిప్రాయాలను సైతం స్వీకరిస్తుంది. భాగస్వామ్యపక్షాల అభిప్రాయాలు తెలుసుకున్న తర్వాత తన నివేదికను కేంద్ర పభుత్వానికి సమర్పిస్తుంది. ఈ ఏడాది నవంబర్, డిసెంబర్ నెలల్లో తెలంగాణ సహా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. వచ్చే ఏడాది ఏడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో సార్వత్రిక ఎన్నికలతోపాటే మొత్తం 12 రాష్ట్రాల శాసనసభ ఎన్నికలను ఒకేసారి నిర్వహిస్తారన్న చర్చ రాజకీయ వర్గాల్లో మొదలైంది. సెప్టెంబర్ 18 నుంచి 22 వరకు జరిగే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో జమిలి ఎన్నికలపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకోవచ్చని ప్రచారం జరుగుతోంది. కోవింద్‌తో జేపీ నడ్డా భేటీ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా శుక్రవారం రామ్‌నాథ్ కోవింద్‌తో సమావేశమయ్యారు. కోవింద్ నేతృత్వంలో కమిటీని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కొద్దిసేపటి తర్వాత ఈ భేటీ జరిగింది. కమిటీ కూర్పుపై వారు చర్చించినట్లు తెలుస్తోంది. కమిటీలో సభ్యులుగా ఎవరెవరు ఉండాలన్న దానిపై అభిప్రాయాలు పంచుకున్నట్లు సమాచారం. ప్రత్యేక సమావేశాల అజెండా త్వరలోనే: ప్రహ్లాద్ జోషీ ఈ నెల 18వ తేదీ నుంచి జరుగనున్న పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల అజెండా రూపకల్పన తుది దశలో ఉందని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషీ చెప్పారు. అజెండాలో పొందుపరిచే అంశాలపై మాట్లాడేందుకు ఆయన నిరాకరించారు. అతి త్వరలోనే అజెండాను బహిర్గతం చేస్తామన్నారు. ప్రత్యేక సమావేశాలకు కావాల్సినంత సమయం ఉందన్నారు. ఇదిలా ఉండగా, పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల చివరి రోజైన ఈ నెల 22న పార్లమెంట్ సభ్యుల గ్రూప్ ఫొటోల చిత్రీకరణకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిసింది. సాధారణంగా ఇలాంటి ఫొటోలను పార్లమెంట్ టర్మ్ మొదలైన తొలి రోజు లేదా చివరి రోజు చిత్రీకరిస్తుంటారు. తరచూ ఎన్నికలతో నష్టమే.. దేశంలో ‘ఒకే దేశం– ఒకే ఎన్నిక’ నిర్వహించాల్సిన అవసరం ఉందని రామ్‌నాథ్ కోవింద్ గతంలో పలు సందర్భాల్లో చెప్పారు. ‘‘తరచూ దేశంలో ఏదో ఒకచోట ఎన్నికలు జరుగుతుండడంతో మానవ వనరులపై భారం పడుతోంది. ఎన్నికల వ్యయం పెరిగిపోతోంది. ఎన్నికల ప్రవర్తనా నియమావళి వల్ల అభివృద్ధి పనులకు ఆటంకం కలుగుతోంది’’ అని 2018లో పార్లమెంట్లో చేసిన ప్రసంగంలో కోవింద్ చెప్పారు. 2014 మేలో కేంద్రంలో మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఒకే దేశం–ఒకే ఎన్నికపై చర్చ ప్రారంభమైంది. దేశంలో లోక్‌సభ, అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తే కోట్ల రూపాయల ప్రజాధనం ఆదా అవుతాయని లా కమిషన్ తన నివేదికలో స్పష్టం చేసింది. దీంతోపాటు అభివృద్ధి పనులకు ఆటంకాలు ఉండవని వెల్లడించింది. దేశంలో 1967 దాకా లోక్‌సభకు, రాష్ట్రాల శాసనసభకు ఒకేసారి ఎన్నికలు జరిగాయి. మోదీ ప్రభుత్వ పదవీ కాలం మరికొన్ని నెలల్లో ముగియనుంది. జమిలి ఎన్నికల వ్యవహారాన్ని ఇంకా సాగదీయకుండా ఏదో ఒకటి తేల్చేయాలన్న పట్టుదలతో ప్రభుత్వం ఉంది. ‘సమాఖ్య’కు విఘాతం: విపక్షాలు ‘జమిలి’పై రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలో కమిటీ ఏర్పాటుపై ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమి స్పందించింది. కేంద్ర ప్రభుత్వ ఆలోచనను తప్పుపట్టింది. లోక్‌సభకు, రాష్ట్రాల శాసనసభలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం సమాఖ్య స్ఫూర్తికి విఘాతం కలిగిస్తుందని ఆందోళన వ్యక్తం చేసింది. సమాఖ్య వ్యవస్థను దెబ్బతీయొద్దని డిమాండ్ చేసింది. రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలో కమిటీ అనేది ప్రజల దృష్టిని మళ్లించే ఎత్తుగడ అని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విమర్శించారు. ఇది కూడా చదవండి: దేవెగౌడ మనవడు, ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు కర్ణాటక హైకోర్టు షాక్.. -
టెక్ మహీంద్రా ఎండీగా మోహిత్ జోషి
న్యూఢిల్లీ: ఐటీ సంస్థ ఇన్ఫోసిస్ మాజీ ప్రెసిడెంట్ మోహిత్ జోషి తాజాగా మరో ఐటీ కంపెనీ టెక్ మహీంద్రా కొత్త ఎండీ, సీఈవోగా నియమితులయ్యారు. ప్రస్తుతం ఆ హోదాల్లో ఉన్న సీపీ గుర్నాణీ డిసెంబర్ 19న పదవీ విరమణ చేశాక .. జోషి బాధ్యతలు చేపడతారు. బాధ్యతల మార్పిడి, కార్యకలాపాలపై అవగాహన కోసం అంతకన్నా ముందుగానే కంపెనీలో చేరతారని టెక్ మహీంద్రా తెలిపింది. మరోవైపు, జోషి తన పదవికి రాజీనామా సమర్పించారని, మార్చి 11 నుంచి ఆయన సెలవులో ఉంటారని ఇన్ఫీ పేర్కొంది. కంపెనీలో ఆయన ఆఖరు పని దినం జూన్ 9గా ఉంటుందని వివరించింది. జోషి 2000లో ఇన్ఫీలో చేరారు. అంతకు ముందు ఆయన ఏబీఎన్ ఆమ్రో, ఏఎన్జెడ్ గ్రిండ్లేస్ తదితర సంస్థల్లో పనిచేశారు. ప్రస్తుతం ఆయన తన కుటుంబంతో కలిసి లండన్‌లో ఉంటున్నారు. డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్, కొత్త టెక్నాలజీలు, భారీ డీల్స్ విషయంలో జోషికి ఉన్న అపార అనుభవం టెక్ మహీంద్రాకు సహాయకరంగా ఉండగలదని గుర్నాణీ తెలిపారు. టెక్ మహీంద్రా కొత్త మైలురాళ్లను అధిగమించడంలో అందరితో కలిసి పనిచేస్తానని, సానుకూల ఫలితాలు సాధించడానికి కృషి చేస్తానని జోషి పేర్కొన్నారు. -
కోర్టు హాల్లో మోర్సీ మృతి
కైరో: ఈజిప్టు పదవీచ్యుత అధ్యక్షుడు మొహమ్మద్ మోర్సీ (67) కోర్టు హాల్లో కుప్పకూలి అక్కడికక్కడే మరణించినట్లు ప్రభుత్వ టీవీ ప్రకటించింది. గూఢచర్యం అభియోగాలు ఎదుర్కొంటున్న మోర్సీ సోమవారం కోర్టుకు హాజరైనప్పుడు ఈ ఘటన జరిగింది. ఆయన భౌతికకాయాన్ని ఆస్పత్రికి తరలించినట్లు టీవీ తెలిపింది. ఈజిప్టును దీర్ఘకాలం పాలించిన హోస్నీ ముబారక్ పదవీచ్యుతుడైన తర్వాత 2012లో జరిగిన ఎన్నికల్లో ఈజిప్టులోని అతిపెద్ద ఇస్లామిస్టు గ్రూపు, ప్రస్తుతం నిషేధానికి గురైన ముస్లిం బ్రదర్‌హుడ్‌కు చెందిన మోర్సీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. -
ప్రజల రాష్ట్రపతి..అబ్దుల్ కలాం
-
త్వరలో హోస్నీ ముబారక్ విడుదల: న్యాయవాది
ఈజిప్టు మాజీ అధ్యక్షుడు హోస్నీ ముబారక్ వారం రోజుల్లోగా జైలు నుంచి విడుదలయ్యే అవకాశం కనిపిస్తోంది. ఆయనపై ఉన్న చిట్టచివరి అవినీతి కేసు రాబోయే రెండు రోజుల్లో తేలిపోతుందని, అందువల్ల ఆయన విడుదల కావచ్చని ఆయన తరఫు న్యాయవాది తెలిపారు. కేవలం పాలనాపరమైన కొన్ని అంశాలు మాత్రం మిగిలిపోయాయని, అవి పూర్తి చేయగానే ఆయన విడుదలవుతారని న్యాయవాది ఫరీద్ అల్ దీబ్ చెప్పినట్లు సిన్హువా వార్తా సంస్థ తెలిపింది. అధికార దుర్వినియోగం, సమాచార శాఖ మంత్రి నుంచి బహుమతులు తీసుకోవడం వంటి నేరాలు ముబారక్‌పై ఉన్నాయి. ఆ బహుమతుల విలువకు తగిన మొత్తాన్ని ఆయన తిరిగి చెల్లిస్తారని న్యాయవాది చెప్పారు. అధ్యక్ష భవనాల నిర్వహణకు కేటాయించిన సొమ్మును దోచుకున్నారని కూడా ముబారక్‌పై ఆరోపణలున్నాయి. ఇప్పటికే ముబారక్ నిర్బంధం సమయం ముగిసినట్లు అలీ మాషల్లా అనే న్యాయ నిపుణుడు తెలిపారు. అయితే, చిట్టచివరి అవినీతి కేసు ఇంకా తేలకపోతే మాత్రం ముబారక్ మరో 45 రోజులు జైల్లోనే ఉండాల్సి వచ్చే అవకాశం ఉందన్నారు.