breaking news
erra manjil
-
ఏ ప్రాతిపదికన కేబినెట్ నిర్ణయించింది?
సాక్షి, హైదరాబాద్: ఎర్రమంజిల్‌లో చట్టసభల సముదాయాలను నిర్మించాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకోవడానికి దోహదపడిన సమాచార పత్రాలను తమకు నివేదించాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఆ భవనాన్ని ప్రభుత్వం ఎప్పుడు స్వాధీనం చేసుకుందో కూడా తెలియజేయాలని పేర్కొంది. ఎర్రమంజిల్ భవన ప్రదేశంలో శాసనసభ, శాసనమండలి సముదాయాల్ని నిర్మించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యాలపై సోమవారం కూడా వాదనలు జరిగాయి. పిటిషనర్ల వివరాలు వేర్వేరుగా ఉన్నందున ఈ వివరాలు కోరుతున్నట్లు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అక్తర్‌ల ధర్మాసనం వెల్లడించింది. విచారణ మంగళవారానికి వాయిదా పడింది. -
టీ సర్కారుకు హైకోర్టు షాక్!
సాక్షి, హైదరాబాద్ : ఎర్రమంజిల్ ప్యాలెస్ కూల్చివేత- అసెంబ్లీ నూతన భవన నిర్మాణం విషయంలో తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురైంది. తదుపరి ఉత్తర్వులు వెల్లడించేంత వరకు ఎర్ర మంజిల్ భవనాలను కూల్చవద్దని అత్యున్నత న్యాయస్థానం ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ఈ అంశం ఇంకా కోర్టు పరిధిలోనే ఉందని ఇందుకు సంబంధించిన పిటిషన్‌ను విచారిస్తున్న ధర్మాసనం స్పష్టం చేసింది. ఎర్రమంజిల్‌లో అసెంబ్లీ నిర్మాణాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సోమవారం పిటిషన్ విచారణ సందర్భంగా తొలుత కౌంటర్‌కు గడువు కోరిన ప్రభుత్వ లాయర్.. తర్వాత ఈరోజు మధ్యాహ్నమే తమ వాదనలు వినిపిస్తామని పేర్కొన్నారు. తదుపరి విచారణను హైకోర్టు బుధవారానికి వాయిదా వేసింది. కాగా ప్యాలెస్ అనుమతి లేకుండా ఎర్రమంజిల్‌లో ఉన్న భవనాన్ని ఎలా కూలుస్తారంటూ నవాబు వారసులు హైకోర్టులో లంచ్‌మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. తమకు ఎర్రమంజిల్‌లో ఉన్న 12 ఎకరాల భూమికి పరిహారం చెల్లించాలని కోరారు. 1951 నుంచి ఈ కేసు విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో... తుదితీర్పు వెలువడకముందే అసెంబ్లీ భవనాన్ని ఎలా నిర్మిస్తారని పిటిషన్ దాఖలు చేశారు. మరోవైపు ఎర్రమంజిల్‌లో అసెంబ్లీ నిర్మాణం చేపట్టడాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో మరో పిటిషన్ దాఖలైంది. ఈ మేరకు సామాజిక వేత్త పాడి మల్లయ్య హైకోర్టులో ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను విచారించిన హైకోర్టు తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. ఇక చరిత్రాత్మక ఎర్రమంజిల్ ప్యాలెస్‌ను కూల్చి కొత్త అసెంబ్లీ భవన సముదాయం, సచివాలయం ప్రాంగణంలోని భవనాలన్నింటినీ కూల్చి అక్కడే కొత్త సచివాలయ భవనం నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్న విషయం తెలిసిందే. -
జలసౌధ కార్యాలయంలో జగడం
హైదరాబాద్, న్యూస్‌లైన్: హైదరాబాద్ ఎర్రమంజిల్‌లోని జలసౌధ కార్యాలయం మరోసారి ఘర్షణకు నిలయమైంది. వారంరోజులుగా పోటాపోటీ నినాదాలు, ధర్నాలతో హోరెత్తిస్తున్న తెలంగాణ, సీమాంధ్ర ఉద్యోగులు.. శుక్రవారం ఒకడుగు ముందుకేసి కొట్టుకున్నంత పనిచేశారు. పరస్పరం దాడులకు యత్నించారు. దూషణలు, తోపులాటలతో ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఒక దశలో వీరిని పోలీసులు కూడా నియంత్రించ లేకపోయారు. భోజన విరామ సమయంలో ఏపీఎన్జీవోలు చెవిలో పువ్వులు పెట్టుకొని నిరసనతెలపడంతో టీఎన్జీవోలు అభ్యంతరం తెలిపారు. ‘మా తెలంగాణలో మమ్మల్ని దోచుకొని చెవిలో పువ్వు పెట్టుకొని నిరసన తెలుపుతారా? అని ప్రశ్నించారు. వారికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో ఆగ్రహించిన ఏపీఎన్జీవోలు ఒక్కసారిగా టీఎన్జీవో ఇరిగేషన్ సెక్రటరీ ప్రతాప్‌పై దాడికి యత్నించారు. రెండువర్గాల మధ్య తీవ్ర తోపులాట జరి గింది. పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఆ సమయంలో ఏపీఎన్జీవోలకు సంఘీభావం తెలిపేందుకు వచ్చిన కాంగ్రెస్ అధికార ప్రతినిధి తులసిరెడ్డిని అడ్డుకున్నారు. బయటి వ్యక్తులు లోపలికి రావడానికి వీళ్లేదని చెప్పడంతో తులసిరెడ్డి, ఏపీఎన్జీఓల నగర అధ్యక్షుడు పీవీవీ సత్యనారాయణ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. వారిని స్టేషన్‌కు తరలిస్తుండగా.. తులసిరెడ్డి గోబ్యాక్.. అంటూ తెలంగాణ ఉద్యోగులు పెద్దఎత్తున నినాదాలు చేయడంతో మళ్లీ గందరగోళం నెలకొంది. ఏపీఎన్జీవోలు రెచ్చగొడుతున్నారు హైదరాబాద్‌లో శాంతిభద్రతలకు విఘాతం కలిగేలా ఏపీఎన్జీవోలు రెచ్చగొడుతున్నారని తెలంగాణ ఇంజినీర్స్ జేఏసీ కో కన్వీనర్ శ్రీధర్ దేశ్‌పాండే, టీఎన్జీఓల ఇరిగేషన్ సెక్రటరీ ప్రతాప్, టీఎన్జీవో నగర అధ్యక్షుడు వెంకటేశ్వర్రావు ఆరోపించారు. తాము శాంతిర్యాలీ నిర్వహిస్తుంటే దాడులకు పాల్పడుతున్నారని తెలిపారు. 42రోజుల పాటు సకలజనుల సమ్మె చేసినప్పుడు ఏపీఎన్జీవోలకు సమైక్యాంధ్ర గుర్తుకురాలేదా అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి ఏజెంట్‌గా తులసిరెడ్డి కార్యాలయాలకు వచ్చి ఉద్యోగులను రెచ్చగొడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. పార్లమెంటుకు లేఖలు పంచాయతీరాజ్, ఆర్డబ్ల్యూఎస్ అండ్ ఎస్ కార్యాలయాల్లో తెలంగాణ ఉద్యోగులు భోజన విరామ సమయంలో నిరసనకు దిగారు. తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టాలంటూ పార్లమెంట్‌కు లేఖలు రాశారు. కాగా, పంచాయతీరాజ్ అండ్ ఆర్డబ్ల్యూఎస్ కార్యాలయాల్లో సీమాంధ్ర ఉద్యోగులు మానవహారంగా ఏర్పడి జై సమైక్యాంధ్ర నినాదాలు చేశారు. అలాగే, గన్‌ఫౌండ్రీలోని వ్యవసాయ కమిషనర్ కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. కోఠి డీఎంహెచ్ఎస్లో... సమైక్యాంధ్రకు మద్దతుగా కోఠి డీఎంహెచ్ఎస్ ప్రాంగణం లో, అబిడ్స్ తిలక్‌రోడ్డులోని బీమా భవన్ ఎదుట సీమాంధ్ర ఉద్యోగులు ధర్నా నిర్వహించారు. తెలంగాణ ప్రకటన వెనక్కు తీసుకోవాలంటూ వెనక్కి నడుస్తూ వినూత్న రీతిలో నిరసన తెలిపారు. బొగ్గులకుంటలోని దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ కార్యాలయం వద్ద ఏపీఎన్జీవోలు కొద్దిసేపు నిరసన తెలిపారు.