
సాక్షి, హైదరాబాద్: ఎర్రమంజిల్‌లో చట్టసభల సముదాయాలను నిర్మించాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకోవడానికి దోహదపడిన సమాచార పత్రాలను తమకు నివేదించాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఆ భవనాన్ని ప్రభుత్వం ఎప్పుడు స్వాధీనం చేసుకుందో కూడా తెలియజేయాలని పేర్కొంది.
ఎర్రమంజిల్ భవన ప్రదేశంలో శాసనసభ, శాసనమండలి సముదాయాల్ని నిర్మించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యాలపై సోమవారం కూడా వాదనలు జరిగాయి. పిటిషనర్ల వివరాలు వేర్వేరుగా ఉన్నందున ఈ వివరాలు కోరుతున్నట్లు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అక్తర్‌ల ధర్మాసనం వెల్లడించింది. విచారణ మంగళవారానికి వాయిదా పడింది.