breaking news
equipment distribution
-
ఏ క్షణమైనా ఎన్నికల ప్రకటన
న్యూఢిల్లీ: 17వ లోక్‌సభ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఏక్షణమైనా షెడ్యూల్ విడుదలయ్యే చాన్సుంది. దేశంలో ఎన్నికల వాతావరణం వేడెక్కుతున్న నేపథ్యంలో వచ్చే ఏప్రిల్–మే నెలల్లో జరగాల్సిన ఎన్నికలకు అవసరమైన సామగ్రి తరలింపు పూర్తయిందని అధికార వర్గాలు తెలిపాయి. ప్రస్తుత లోక్‌సభ పదవీ కాలం జూన్ 3వ తేదీతో ముగియనుంది. దీనిపై చర్చించేందుకు వచ్చే వారం ఎన్నికల పరిశీలకులు సమావేశం కానున్నారు. 7 లేదా 8 దశల్లో జరగనున్న ఈ ఎన్నికలకు ఏ క్షణమైనా ప్రకటన వెలువడే అవకాశాలున్నాయని ఈసీ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. మొదటి దశ ఎన్నికల నోటిఫికేషన్ మార్చి ఆఖరిలోగా విడుదలవనుండగా, పోలింగ్ ఏప్రిల్ ప్రథమార్ధంలో జరిగే వీలుందన్నారు. 543 లోక్‌సభ నియోజకవర్గాల్లో 10 లక్షల పోలింగ్ బూత్‌లు ఏర్పాటు చేయనున్నారు. కొన్ని అసెంబ్లీలకు కూడా.. లోక్‌సభతోపాటే ఆంధ్రప్రదేశ్, ఒడిశా, సిక్కిం, అరుణాచల్‌ప్రదేశ్ అసెంబ్లీలకూ ఎన్నికలు జరిపేందుకు ఈసీ ప్రయత్నాలు చేస్తోంది. అదేవిధంగా ఈ మే నెలతో కశ్మీర్ అసెంబ్లీ రద్దుకు ఆరు నెలల గడువు ముగియనుండగా లోక్‌సభతోపాటే అక్కడా అసెంబ్లీ ఎన్నికలు జరిపేందుకు గల అవకాశాలను పరిశీలిస్తోంది. గవర్నర్ పాలనలో ఉన్న ఆ రాష్ట్రంలో సరిహద్దుల్లో ఉద్రిక్తత, వివిధ పరిస్ధితులను అంచనా వేస్తోంది. ఇంకా సమయముంది! ప్రధాన రాజకీయ పార్టీలన్నీ లోక్‌సభ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టేశాయి. ఎన్నికల సంఘం(ఈసీ) ఎన్నికల షెడ్యూల్ ప్రకటించలేదు. 2014 ఎన్నికలకు మార్చి 5వ తేదీన ఎన్నికల ప్రకటన వెలువడింది. ఈసారి 5వ తేదీ దాటిపోయినా ఇంకా ఎన్నికల సంఘం షెడ్యూల్ జారీ చేయకపోవడంపై విపక్షాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ఈసీ ఆలస్యం చేయడం లేదని, నిబంధనల ప్రకారం ఎన్నికల ప్రకటన జారీకి ఇంకా సమయం ఉందని మాజీ ఎన్నికల ప్రధానాధికారి ఓపీ రావత్ అన్నారు. ‘ప్రస్తుత లోక్‌సభ గడువు పూర్తయ్యే సరికి కొత్త ఎంపీలు ప్రమాణ స్వీకారం చేయడానికి సిద్ధంగా ఉండాలి. ఈ 16వ లోక్‌సభ గడువు జూన్ 3వ తేదీతో ముగుస్తుంది. ఎన్నికల షెడ్యూలు ప్రకటనకు మొదటి దశ పోలింగు నోటిఫికేషన్‌కు మధ్య3 వారాలు వ్యవధి ఉండాలి. దీని ప్రకారం చూస్తే మార్చి 15వ తేదీలోగా ఎప్పుడయినా ఈసీ ఎన్నికల ప్రకటన జారీ చేయవచ్చు’అని ఆయన వివరించారు. ఎన్నికలను షెడ్యూలును ఫలానా గడువులోగా ప్రకటించాలన్న నిబంధన ఏదీ లేదని మరో మాజీ ఎన్నికల ప్రధానాధికారి నవీన్ చావ్లా అన్నారు. అధికార పార్టీకి లబ్ధి చేకూర్చడం కోసమే ఎన్నికల సంఘం ఎన్నికల ప్రకటన జారీలో జాప్యం చేస్తోందన్న విపక్షాల ఆరోపణలను ఈసీ తోసిపుచ్చింది. -
ఓట్లేసుడే..
♦ పురుషులు 1,30,917 ♦ మహిళలు 1,34,793 ♦ 291 మంది అభ్యర్థులు.. ♦ 265 పోలింగ్ స్టేషన్లు ♦ పోలింగ్ సిబ్బందికి సామగ్రి పంపిణీ ♦ ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ ఖమ్మం : ప్రజలు ఓటు హక్కు వినియోగించుకునేందుకు జిల్లా యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. కార్పొరేషన్ ఎన్నికల పోలింగ్ ఆదివారం ఉదయం 7 గంటలకు ప్రారంభమై సాయంత్రం 5 గంటలకు ముగుస్తుంది. 50 డివిజన్లలో బరిలో నిలిచిన 291 మంది అభ్యర్థులకు అనుగుణంగా ప్రజలు ప్రశాంత వాతావరణంలో ఓటు వేసేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. నగరంలోని 80 ప్రాంతాల్లో 265 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసి.. వాటిని ముందస్తుగా పరిశీలించారు. బీఎల్ఓల ద్వారా పోల్ చిట్టీలను పంపిణీ చేశారు. దీనికోసం ప్రభుత్వ మహిళా కళాశాలలో పోలింగ్ అధికారులకు, సిబ్బందికి పలు దఫాలుగా శిక్షణ ఇచ్చి.. నియమావళిపై వివరించారు. 2,65,710 మంది ఓటర్లు 50 డివిజన్లలో 1,30,917 పురుషులు, 1,34,793 మంది మహిళలు మొత్తం 2,65,710 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేలా అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. పోలింగ్ ప్రశాంతంగా జరిగేందుకు 80 ప్రాంతాల్లో 265 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. కేంద్రానికి ఒక పోలింగ్ అధికారి, ఒక ఏపీఓ, నలుగురు ఉద్యోగులను నియమించారు. 10 మంది రిటర్నింగ్ అధికారులు, 50 మంది అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులను నియమించి.. ప్రతీ డివిజన్ వివరాలు, ఓటర్లు, అభ్యర్థుల సంఖ్య తదితర అంశాలను సిద్ధంగా ఉంచారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన నాటి నుంచి 10 మోడల్ కోడ్ టీంలు, 10 ఖర్చుల వ్యవహార బృందాలు, 5 వీడియో బృందాలు, 5 గణాంక బృందాలతోపాటు ఐదు ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలను ఏర్పాటు చేశారు. ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించేందుకు పోలీస్ ఉన్నతాధికారులతోపాటు 1,500 మేరకు పోలీస్ సిబ్బందిని నియమించినట్లు అధికారులు ప్రకటించారు. బరిలో 291 మంది వివిధ పార్టీలకు చెందిన 291 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. వీరిలో వైఎస్సార్ సీపీ నుంచి 48 మంది, కాంగ్రెస్ నుంచి 42, టీఆర్ఎస్ నుంచి 50, టీడీపీ నుంచి 48, 40 మంది సీపీఎం, 8 మంది సీపీఐ అభ్యర్థులతోపాటు 42 మంది స్వతంత్రులు బరిలో నిలిచారు. సర్వం సిద్ధం ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు జిల్లా అధికార యంత్రాంగం పదిహేను రోజులుగా కసరత్తు చేస్తోంది. నామినేషన్ల స్వీకరణ, ఉపసంహరణల ప్రక్రియ కార్పొరేషన్లో నిర్వహిస్తూనే.. మరోవైపు పోలింగ్ సిబ్బందికి శిక్షణ ఇవ్వడం, ఈవీఎంలను భద్రపరచడం, ఓట్ల లెక్కింపు కోసం పత్తి మార్కెట్‌ను ఆధీనంలోకి తీసుకొని ఏర్పాట్లు చేశారు. శనివారం జేసీ దివ్య, ఆర్డీఓ వినయ్‌కృష్ణారెడ్డి, కార్పొరేషన్ కమిషనర్ వేణుగోపాల్‌రెడ్డి, డీఎస్పీ సురేష్‌కుమార్ నేతృత్వంలో అన్ని ఏర్పాట్లు చేశారు. ఈవీఎంల పనితీరును పరిశీలించి.. సిబ్బందికి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సమావేశం ఏర్పాటు చేసి.. రాష్ట్ర ఎన్నికల నియమావళిని ప్రకటించారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేశారు. 305 ఈవీఎంల వినియోగం ఎన్నికల్లో ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకునేందుకు 305 ఈవీఎంలు సిద్ధంగా ఉంచామని అధికారులు తెలిపారు. ప్రతి పోలింగ్ స్టేషన్‌కు ఒకటి చొప్పున 265తోపాటు ఎక్కడైనా ఈవీఎంలు పనిచేయకపోవడం.. ఇతర కారణాలతో నిలిచిపోతే వెంటనే మరో ఈవీఎంను వినియోగించుకునేందుకు మరో 50 ఈవీఎంలను సిద్ధంగా ఉంచినట్లు తెలిపారు.