ముట్టుకుంటే.. చర్మం ఊడిపోతుంది!
దక్షిణాఫ్రికాలో భారత సంతతికి చెందిన రెండు నెలల బాలుడు చిత్రమైన జన్యుపరమైన వ్యాధితో బాధపడుతున్నాడు. ఎపిడెర్మోలిసిస్ బులోసా అనే ఈ వ్యాధి కారణంగా.. ఊరికే ముట్టుకుంటే చాలు, అతడి చర్మం ఊడిపోతుంది. అబూబకర్ అనే ఈ పిల్లాడికి వచ్చిన ఈ వ్యాధి.. 50 వేల మందిలో ఒకరికి మాత్రమే వస్తుంది. అబూబకర్కు పుట్టినప్పుడు చర్మం కేవలం ఒక పొర మాత్రమే ఉందని అతడి తల్లిదండ్రులు నజ్మీరా, అర్షద్ అక్బర్ తెలిపారు. దాంతో అతడిని ఎత్తుకోవాలన్నా కూడా.. చేతుల్లో ఒక మెత్తటి దిండు పెట్టుకుని, దానిమీద వాడిని పడుకోబెట్టి ఎత్తుకోవాల్సి వస్తోంది.
ఆ పిల్లాడు తన చేతులతో ఒంటిమీద ఊరికే అలా రాసుకున్నా కూడా చర్మం రాలిపోతుంది. దాంతో ఇన్ఫెక్షన్లు సోకుతున్నాయి. ఈ వ్యాధి వల్ల ఒకోసారి పిల్లల ప్రాణాలు కూడా పోయే ప్రమాదముందని డెర్మటాలజీ ప్రొఫెసర్ జమీలా అబూబకర్ చెప్పారు. పిల్లాడిని అత్యంత జాగ్రత్తగా చూసుకుంటే మాత్రం అతడి ప్రాణాలు కాపాడగలిగే అవకాశం ఉంటుందన్నారు. తనకు ఓ సోదరుడు ఉండేవాడని, అతడు కూడా ఇలాంటి వ్యాధితోనే బాధపడి.. కేవలం ఆరు వారాల వయసులోనే మరణించినట్లు తన తల్లి చెప్పేదని అబూబకర్ తల్లి నజ్మీరా చెప్పారు.