breaking news
EMCET Councilling
-
ఏ ఒక్క రాష్ట్రానికో అధికారమిచ్చినట్లుకాదు!
-
ఏ ఒక్క రాష్ట్రానికో అధికారమిచ్చినట్లుకాదు!
ఢిల్లీ:ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఇంజనీరింగ్ అడ్మిషన్లు విభజన చట్టానికి లోబడే ఉండాలన్న సుప్రీంకోర్టు వ్యాఖ్యలపై తెలంగాణ అడ్వకేట్ జనరల్ రామకృష్ణారెడ్డి వివరణ ఇచ్చారు.చట్ట ప్రకారం ఎంసెట్ కౌన్సిలింగ్ నిర్వహించాలని మాత్రమే సుప్రీంకోర్టు పేర్కొందని ఆయన తెలిపారు. దీంతో ఏ ఒక్క రాష్ట్రానికో అధికారం ఇచ్చినట్లు కాదన్నారు. ఇరు రాష్ట్రాలు సమన్వయంతో కౌన్సిలింగ్ నిర్వహించాలని రామకృష్ణా రెడ్డి సూచించారు. కామన్ అడ్మిషన్లను ఏపీ ఉన్నత విద్యామండలి నిర్వహించాలనడం సరైనది పద్దతి కాదన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ ఎవరికి ఇవ్వాలన్నది ఆయా రాష్ట్ర ప్రభుత్వాలదే నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుందన్నారు. తమ రాష్ట్రాల ఆర్ధిక పరిస్థితి విధానాలకు అనుగుణంగా ఫీజు రీయింబర్స్ మెంట్ అమలు చేస్తారని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఈ విషయంలో ధర్మాసనం జోక్యం ఉండదన్నారు. ఆగస్టు 31 లోగా కౌన్సెలింగ్ పూర్తికావాలని, సెప్టెంబర్ 1 నుంచి తరగతులు ప్రారంభించాలని గత తీర్పులో సుప్రీం పేర్కొన్న సంగతి తెలిసిందే. ఫీజు రీయింబర్స్మెంట్ విషయంలో మాత్రం తాము జోక్యం చేసుకోబోమని చెప్పింది. అక్టోబరు 31 వరకూ కౌన్సెలింగ్ పొడిగించాలన్న తెలంగాణ ప్రభుత్వ విజ్ఞప్తిని సుప్రీంకోర్టు తిరస్కరించింది. అలాగే స్థానికత అంశాన్ని కూడా పక్కనపెట్టింది. -
'షెడ్యూల్ ప్రకారమే ఎంసెట్ కౌన్సిలింగ్'
హైదరాబాద్: ఎంసెట్ రూపొందించిన షెడ్యూల్ ప్రకారమే కౌన్సెలింగ్ ప్రక్రియను నిర్వహిస్తామని బుధవారం మీడియాకు ఉన్నత విద్యామండలి ఛైర్మన్ వేణుగోపాల్‌రెడ్డి తెలిపారు. ఆగస్టు 31వ తేదీలోపు తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల్లో అడ్మిషన్లు పూర్తి చేస్తామని వేణుగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. సెప్టెంబర్ 1 నుంచి ఇంజనీరంగ్ తరగతులు ప్రారంభిస్తామన్నారు. ఎంసెట్ కౌన్సిలింగ్ ప్రక్రియలో భాగంగా గురువారం నుంచి సర్టిఫికేట్ల పరిశీలన ఉంటుందని ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. ఎంసెట్ కౌన్సిలింగ్ విషయంలో ఎలాంటి గందరగోళానికి గురికావొద్దని విద్యార్ధులకు ఉన్నత విద్యామండలి ఛైర్మన్ వేణుగోపాల్‌రెడ్డి సూచించారు.