లోక్‌సభ సీటిస్తే బీజేపీలో చేరతా
ఎమ్మెల్యే చిన్నం రామకోటయ్య
సాక్షి, హైదరాబాద్: వచ్చే సాధారణ ఎన్నికల్లో తనకు ఏలూరు లోక్‌సభ స్థానం కేటాయిస్తానంటేనే బీజేపీలో చేరతానని నూజివీడు ఎమ్మెల్యే చిన్నం రామకోటయ్య చెప్పారు. లేనిపక్షంలో నూజివీడు అసెంబ్లీ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగుతానని తెలిపారు. సోమవారం అసెంబ్లీ లాబీల్లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికల కమిషన్ నిర్దేశించిన మేర ఖర్చు చేస్తానని, ద్విచక్ర వాహనంపై మాత్రమే ఊరూరూ తిరిగి ప్రచారం చేస్తానన్నారు.
పోతే అందరం టీడీపీలోకి పోతాం: ఏరాసు
కర్నూలు జిల్లాకు చెందిన కాంగ్రెస్ నేతలందరం ఉమ్మడిగా టీడీపీలోనే చేరతామని రాష్ట్ర న్యాయ శాఖ మంత్రి ఏరాసు ప్రతాప్‌రెడ్డి చెప్పారు. సోమవారం అసెంబ్లీ లాబీల్లో మాట్లాడిన ఆయన.. ఎవరెవరు వెళతారన్న ప్రశ్నకు మాత్రం స్పందించలేదు.
మల్కాజ్గిరి నుంచి పోటీచేస్తా: మహేందర్‌రెడ్డి
లోక్‌సభకు ముందస్తు ఎన్నికలు జరిగితే రంగారెడ్డి జిల్లా మల్కాజ్గిరి నియోజకవర్గం నుంచి పోటీచేస్తానని తాండూరు ఎమ్మెల్యే పట్నం మహేందర్‌రెడ్డి చెప్పారు. మహబూబ్‌నగర్ జిల్లా కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి, సీఎంఆర్ విద్యా సంస్థల అధిపతి మల్లారెడ్డి ఈ సీటును ఆశిస్తున్నారు కదా.. అని ప్రశ్నించగా వారు ఎవరు? అని ప్రశ్నించిన ఆయన.. తాను రంగారెడ్డి జిల్లా వాసినని చెప్పారు.