breaking news
eeli nani
-
'అభ్యంతరకర వ్యాఖ్యలెందుకు'
మంత్రిపై మునిసిపల్ చైర్మన్ బొలిశెట్ట వ్యాఖ్య తాడేపల్లి గూడెం: మంత్రి పైడికొండల మాణిక్యాలరావు టీడీపీ నాయకులపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడం తగదని , మంత్రిపై ఎవరూ ఎటువంటి ఫిర్యాదులు చేయలేదని మునిసిపల్ చైర్మన్ బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. ఆదివారం సాయంత్రం ఆయన విలేకరులతో మాట్లాడుతూ మంత్రిపై టీడీపీ సమన్వయ కర్త ఈలి నాని ఎటువంటి ఫిర్యాదులు చేయలేదన్నారు. కావాలంటే వీడియో సీడీలు తమ వద్ద ఉన్నాయని వాటి ద్వారా తెలుసుకోవచ్చన్నారు. పత్రికలలో వచ్చిన కథనాల ఆధారంగా మంత్రి మాణిక్యాలరావు సవాల్ చేయడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎస్పీ, డీఎస్పీ తదితర అధికారులతో మాట్లాడిన మంత్రి మిత్రపక్షమైన టీడీపీతో మాట్లాడకపోవడం శోచనీయమన్నారు. విజయవాడలో జరిగిన సమావేశంలో కొందరు కార్యకర్తలు తమ ఆవేదనను ముఖ్యమంత్రి చంద్రబాబు కు తెలిపే సమయంలో వారిని వారించి తాము కూడా ఎన్నికల కేసులలో కోర్టుల చుట్టూ తిరుగుతున్నామని అన్నారే తప్ప మంత్రి తమపై కేసులు పెట్టి వేధిస్తున్నారని ఎక్కడా అనలేదని వివరించారు. -
చంద్రబాబుతో ఈలి నాని భేటీ
తాడేపల్లి గూడెం ఎమ్మెల్యే ఈలినాని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యారు. బుధవారం ఉదయం హైదరాబాద్‌లోని చంద్రబాబు నివాసంలో ఈలి నాని ఆయన్ని కలిశారు. ఈలినాని టీడీపీ చేరే ప్రయత్నంలో భాగంగానే ఈ భేటీ జరిగింది. అయితే త్వరలో గుంటూరు ఎంపీ రాయపాటి సాంబశివరావు, తాడిపత్రి ఎమ్మెల్యే జే సీ దివాకర్ రెడ్డి కూడా టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధమైంది. రాష్ట్ర విభజన నేపథ్యంలో సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీపై ఆ ప్రాంత ప్రజలు నిప్పులు చెరుగుతున్నారు. దాంతో రానున్న ఎన్నికల్లో తమకు డిపాజిట్లు కూడా వచ్చే పరిస్థితి లేదని కాంగ్రెస్ పార్టీ నాయకులు భావిస్తున్నారు. అందులోభాగంగా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు తాజా మంత్రులు, సీనియర్ నేతలు టీడీపీ తీర్థం పుచ్చుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ రోజు ఉదయం చంద్రబాబు నాయుడును ప్రముఖ హాస్య నటుడు వేణుమాధవ్ కూడా కలిశారు. తనకు నల్గొండ జిల్లా కోదాడ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసే అవకాశం కల్పించాలని చంద్రబాబును ఈ సందర్భంగా వేణుమాధవ్ కోరినట్లు సమాచారం. -
గూడెం టికెట్ గోలగోల!
గూడెం రాజకీయాలు గందరగోళంగా మారుతున్నాయి. రాజకీయంగా చైతన్యవంతమైన పశ్చిమగోదావరి జిల్లాకు కేంద్రస్థానంగా ఉన్న తాడేపల్లిగూడెం టీడీపీ టిక్కెట్ కోసం పోటీ పెరిగింది. అయితే.. ఇన్నాళ్లుగా ఆ పార్టీలో ఉన్న నాయకులు, జెండాను మోసిన కార్యకర్తలను కూడా పక్కన పెట్టేస్తున్న చంద్రబాబు నాయుడు, ఇతర పార్టీల నాయకులు, మాజీ ఎమ్మెల్యేలకు వల వేయడం ఇప్పుడు కొత్త సమస్యలు తెచ్చిపెడుతోంది. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇద్దరు నాయకుల మధ్య ఇప్పుడు టీడీపీ టికెట్ కోసం పోటీ పెరిగినట్లు కనిపిస్తోంది. రాష్ట్ర విభజనకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో తమ పార్టీకి పుట్టగతులుండవని గట్టిగా నమ్ముతున్న కాంగ్రెస్ నాయకులు సహజంగానే పక్కచూపులు చూస్తున్నారు. దివంగత నాయకుడు ఈలి ఆంజనేయులు కుమారుడిగా రాజకీయాల్లోకి అడుగుపెట్టిన ఈలి నాని, కాంగ్రెస్ టికెట్ మీద ఎమ్మెల్యేగా గెలిచిన కొట్టు సత్యనారాయణ.. ఇద్దరూ ఇప్పుడు తెలుగుదేశం వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది. వీళ్లలో కొట్టు సత్యనారాయణ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ టికెట్ కోసం కూడా తీవ్రంగా ప్రయత్నించి.. అది సాధ్యం కాకపోవడంతో ఇప్పుడు టీడీపీ వైపు చూస్తున్నారని అంటున్నారు. ఈలి నాని కాంగ్రెస్ నుంచి టీడీపీ, అక్కడి నుంచి పీఆర్పీలోకి జంప్ చేసి, ఆ పార్టీ అధినేత పుణ్యమాని మళ్లీ కాంగ్రెస్ నాయకుడయ్యరు. ఈయన కూడా ఎలాగోలా టీడీపీ టికెట్ దక్కించుకోవాలని విశ్వప్రయత్నాలు సాగిస్తున్నారు. మంత్రి గంటాతో పాటు నెలాఖరు లోపు నాని టీడీపీలో చేరతారని నియోజకవర్గంలో ప్రచారం జరుగుతోంది. తాడేపల్లిగూడెం టిక్కెట్ ఖరారు చేసుకున్నట్లు ఆయన అనుచరులు చెబుతున్నారు. ఇక ఇదే నియోజకవర్గంలోని మాజీ ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణది విచిత్రమైన పరిస్ధితి... మహానేత వైఎస్ పాదయాత్ర పుణ్యమా అని 2004లో తొలిసారి అసెంబ్లీకి ఈయన అడుగుపెట్టారు. గత ఎన్నికల్లో ఓటమి తర్వాత కాంగ్రెస్‌లోనే ఉంటూ నియోజకవర్గ ఇన్చార్జిగా కొనసాగుతున్న సమయంలో వైఎస్ మరణం వల్ల ఈయనకు రాజకీయంగా పెద్ద దెబ్బే తగిలింది. ఎమ్మెల్యే ఉన్న ఈలి నాని తిరిగి కాంగ్రెస్ లోకి రావడంతో ఇద్దరి మధ్య విరోధం మరింతగా పెరిగింది. కాంగ్రెస్‌లో తనకు మనుగడ లేదని, పార్టీకి గుడ్ బై చెప్పాలని డిసైడైయారు. వైఎస్సార్సీపీలోకి వెళ్లడానికి ప్రయత్నించినా సాధ్యపడలేదు. ఈ దశలో టీడీపీలో చేరడానికి రంగం సిద్దం చేసుకున్నారు. తాడేపల్లిగూడెం టీడీపీ టిక్కెట్ ఈయనకు ఖరారవుతోందనుకుంటున్న దశలో ఈలి నాని కొట్టు ఆశలపై గండికొడుతున్నారు. దీంతో తాడేపల్లిగూడెం టీడీపీ టికెట్ కోసం ప్రత్యర్ధులిద్దరూ పోటీపడుతుండటం నియోజకవర్గంలో ఆసక్తి కలిగిస్తోంది. తాడేపల్లిగూడెం టిక్కెట్‌పై ఆశలు పెట్టుకున్న ముళ్లపూడి బాపిరాజు, మాజీ మంత్రి ఎర్రా నారాయణస్వామి మనవడు ఎర్రా నవీన్‌లకు చంద్రబాబు సరికొత్త రాజకీయాలతో దిమ్మ తిరిగిపోయింది. ఎప్పట్లానే సొంత పార్టీ కార్యకర్తలకు చంద్రబాబు మొండిచేయి చూపడం తెలుగు తమ్ముళ్లకు ఆగ్రహం కలిగిస్తోంది. దీంతో ఇపుడు పశ్చిమలో తాడేపల్లిగూడెం టీడీపీ టిక్కెట్ హాట్ టాపిక్ గా మారింది.