సీనియర్ల ప్రపంచంలోకి ఈజీ ఫోన్
మార్కెట్లోకి విడుదలచేసే రకరకాల ఫీచర్ ఫోన్లన్నీ కేవలం యువతకేనా.. సీనియర్ సిటిజన్ల కోసం అవసరం లేదా..? అంటే వారికోసం ఓ కొత్తరకం మొబైల్ ఫోన్ ను తయారు చేశామంటున్నది సీనియర్ వరల్డ్ కంపెనీ. సీనియర్ల ప్రపంచంలోకి ఓ కొత్తరకం ఫీచర్ ఫోన్ ను కంపెనీ విడుదల చేసింది. ఈజీ ఫోన్ గా పిలుచుకునే ఈ ఫోన్ ను సీనియర్లకు అనుకూలంగా రూపొందించామని వెల్లడించింది.
కేవలం రూ. 3,375 లకే ఈ ఈజీఫోన్ ను కంపెనీ మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. సీనియర్ వరల్డ్.కామ్, అమెజాన్ ఇండియా, ఫ్లిప్ కార్ట్, ఈబే ఇండియా లలో ఈ ఫోన్ అందుబాటులో ఉంటుందని కంపెనీ పేర్కొంది. సీనియర్లకు అవసరమయ్యే అన్ని రకాల ఫీచర్లతో ఈ ఫోన్ రూపొందించామని చెప్పింది. పెద్ద స్క్రీన్ , పెద్ద ఫాంట్ సైజ్, డయలింగ్ కీలు కూడా పెద్దవిగా, ఫోటో డయిల్, క్రాడిల్ చార్జర్ వంటి ఫీచర్లు ఈ ఫోన్లో ఉన్నాయని కంపెనీ ఆవిష్కరణ అనంతరం తెలిపింది.
ఎస్ఓఎస్ బటన్ తో కూడిన ఈ ఫోన్, నాలుగు ఆటోమేటెడ్ పనులను చేసేటట్టు రూపొందించామని తెలిపింది. క్లిష్టమైన వివరాలతో ఐదు ఎమర్జెన్సీ కాంటాక్టులు, వాటికి కాల్స్, ఎస్ఎంఎస్ చేసుకునే సౌలభ్యం, ఇన్ కామింగ్ కాల్స్ లిస్ట్, కస్టమైసెబుల్ మెనూ ఫీచర్లను ఆటోమేటెడ్ గా ఈ ఫోన్లో పొందుపరిచామని పేర్కొంది. సీనియర్లు ప్రత్యేక అవసరాలకే ఫోన్లను వాడుతుంటారని, వారికి కచ్చితంగా ఈ ఫోను ఉపయోగపడుతుందని కంపెనీ సీఈవో రాహుల్ గుప్తా తెలిపారు.
కేవలం కమ్యూనికేషన్ డివైజ్ లాగానే కాక, సీనియర్ల మనస్సులో స్వేచ్ఛ, శాంతిని నెలకొల్పేలా దీన్ని తయారుచేశామని పేర్కొన్నారు. సులభం, సరళత, భద్రతకు మధ్య తేడాను ఈజీఫోన్ భర్తీ చేస్తుందని చెప్పారు. డెలివరీ సర్వీసులు, పాడు అయినప్పుడు బాగు చేయడం వంటి ఉచిత సర్వీసులు ఈ కంపెనీ కల్పించనున్నట్టు రాహుల్ గుప్తా చెప్పారు.