మార్చి నాటికి ఈ-పీడీఎస్ విధానం
విజయవాడ సిటీ, న్యూస్‌లైన్ :
నిత్యావసర వస్తువుల సరఫరా పారదర్శకంగా జరిగేందుకు ఈ-పీడీఎస్ విధానాన్ని మార్చి నుంచి అమలు చేయటానికి అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. మాన్యువల్ విధానానికి స్వస్తి పలికి గ్రామ స్థాయి వరకు ఆన్లైన్ ద్వారా రేషన్ సరకులు పంపిణీ చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ విధానం అమలులోకి రానుంది. ఇప్పటికే హైదరాబాద్, తూర్పుగోదావరి జిల్లాల్లో ప్రయోగాత్మకంగా దీనిని అమలు చేస్తున్నారు. మంగళవారం సబ్‌కలెక్టర్ కార్యాలయంలో ఈ విధానంపై పౌరసరఫరాల అధికారులకు ఈ-పీడీఎస్‌పై శిక్షణ తరగ తి నిర్వహించారు. ఈ-పీడీఎస్ విభాగం రాష్ట్ర డెప్యూటీ డెరైక్టర్ శంకరశాస్త్రి అధికారులకు కొత్త విధానంపై అవగాహన కల్పించారు. సుప్రీం కోర్టు ఉత్తర్వుల ప్రకారం కొత్త విధానాన్ని త్వరలో ప్రారంభించబోతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారిణి సంధ్యారాణి, పౌర సరఫరాల శాఖ జిల్లా మేనేజర్ చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు.
చురుగ్గా కంప్యూటరీకరణ
ఈ-పీడీఎస్ విధానం అమలు చేసేందుకు పౌర సరఫరాల శాఖ అధికారులు రేషన్ షాపులు, కార్డుల వివరాలను ఆన్లైన్ చేస్తున్నారు. డిపోల వారీగా కంప్యూటరీకరణ జరుగుతోంది. పట్టణాల్లో ఒక ప్రాంత ంలో నివాసం ఉండి వేరే ప్రాంతంలో కార్డు కల్గిఉన్న వారిని గుర్తించి సంబంధిత డిపోలకు వాటిని మార్పు చేస్తున్నారు. సరకులు తీసుకునే వారిని గుర్తించేందుకు ఆధార్ ద్వారా కుటుంబ సభ్యుల వేలిముద్రలు తీసుకుంటారు. వేలిముద్రలు మ్యాచింగ్ అయితేనే సరకులు ఇస్తారు.
ఈ-పీడీఎస్ ద్వారా జరిగే మార్పులు..
క్లోజింగ్ బ్యాలెన్స్ ప్రకారం, ప్రతీ నెలా సరకులు
అలాట్మెంట్ ఆర్డర్ అన్లైన్లో ఇస్తారు.
చౌకధరల దుకాణం డీలరు మీసేవకు వెళ్లి ఎలాట్మెంట్ ప్రకారం సరకు కోసం సొమ్ము చెల్లిస్తారు.
డీడీలు తీసుకోవటం మాన్యువల్ విధానంలో మండల కేంద్రాల్లో ఆర్ ఓలు రాయడాన్ని రద్దు చేస్తారు.
మీసేవలో సొమ్ము చెల్లించగానే మండల్ లెవల్ పాయింట్ గోడౌన్ నుంచి సరకు విడుదల చేస్తారు.
గోడౌన్ నుంచి డిపోలకు సరుకు విడుదల కాగానే ప్రతీ చౌకదుకాణం ఏరియాలో 20 మంది కార్డుదారులకు ఎస్ఎంఎస్లు వస్తాయి. సంబంధిత దుకాణాల్లో స్టాక్ ఎంత ఉందన్న సమాచారం క్షణాల్లో కార్డుదారులకు చేరుతుంది.