breaking news
E-Nam purchases
-
ఈ–నామ్‌పై అయోమయం
కరీంనగర్ వ్యవసాయ మార్కెట్లో తొలగని ప్రతిష్టంబన ఆన్లైన్ కొనుగోళ్లకు ససేమిరా అంటున్న వ్యాపారులు ఈనెల 24 నుంచి పత్తి ఆన్లైన్ ట్రేడింగ్‌కు ఆదేశం జమ్మికుంట పత్తి మార్కెట్లో అరకొర ఏర్పాట్లు కరీంనగర్ అగ్రికల్చర్/జమ్మికుంట : కరీంనగర్ వ్యవసాయ మార్కెట్లో ఈ–నామ్ విధానంలో వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోళ్లు చేపట్టేందుకు వ్యాపారులు నిరాకరిస్తున్నారు. ఈ–నామ్ విధానంలో మాత్రమే కొనుగోళ్లు చేయాలని ప్రభుత్వం ఆదేశించినప్పటికీ ససేమిరా అంటున్నారు. అక్టోబర్ మొదటి వారం నుంచి కరీంనగర్ వ్యవసాయ మార్కెట్లోని ఎనిమిది అడ్తీదుకాణాల్లో వ్యాపారులు కొనుగోళ్లు చేపడతున్నారు. ఈ–నామ్లో ప్రతీ లాట్‌ను పరిశీలించి వివరాలను నమోదు చేసుకోవడం, కంప్యూటర్లో ఆన్లైన్ ట్రేడింగ్ చేపట్టడం తమ వల్ల కాదంటున్నారు. మార్కెటింగ్‌శాఖ అధికారులు ఎన్నిసార్లు అవగాహన సదస్సులు నిర్వహించినా వ్యాపారులు ససేమిరా అంటున్నారు. మార్కెట్ కార్యాలయంలో వ్యాపారుల కోసం గదులు కేటాయించి కంప్యూర్లు ఏర్పాటు చేశారు. అధికారులు ఒత్తిడి చేస్తున్న ఫలితంగా కొద్ది మొత్తంలో వస్తున్న వడ్లు, మొక్కజొన్నలను కొంతమంది మాత్రమే ఈ–నామ్లో కొనుగోలు చేస్తున్నారు. ఇక్కడ కూడా సిండికేట్ అయి నాణ్యత లేదంటూ తక్కువ ధరకే టెండర్ కోట్ చేస్తున్నారు. శుక్రవారం మార్కెట్‌కు 296 క్వింటాళ్ల వడ్లు, 328 క్వింటాళ్ల మక్కలు, 1001 క్వింటాళ్ల పత్తి వచ్చింది. పత్తికి మద్దతు ధర కన్నా ఎక్కువగానే చెల్లించినప్పటికీ.. అందులో జిమ్మిక్కులకు పాల్పడుతూ రైతులను ముంచుతున్నారు. అమ్మకానికి తెచ్చిన పత్తిని, ధ్యాన్యాన్ని మార్కెట్లో ఉంచలేక, ఇంటికి తీసుకెళ్లలేక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. శుక్రవారం ఆన్లైన్లోనే పత్తి కొనుగోళ్లు చేపట్టాలని డీఎంవో పద్మావతి ఆదేశించారు. అందుకు నిరాకరించిన వ్యాపారులు కొంతమంది రైతులను తప్పుదోవ పట్టించి కార్యాలయంలో ఆందోళనకు దిగారు. వేలంపాటలోనే పత్తి కొనుగోళ్లు చేపట్టాలని కోరారు. ఆన్లైన్ ట్రేడింగ్‌లో ఎక్కువ మంది వ్యాపారులు పోటీ పడటం వల్ల గిట్టుబాటు ధర లభిస్తుందని డీఎంవో పద్మావతి రైతులకు వివరించారు. నామ్ విధానంపై అవగాహన పెంచుకోవాలని రైతులకు, వ్యాపారులకు సూచించారు. ఈ నెల 24 నుంచి పత్తి కొనుగోళ్లను నామ్ విధానంలోనే చేపట్టాలని ఆమె స్పష్టం చేశారు. జమ్మికుంటలో 24 నుంచి ఈ–నామ్ జమ్మికుంట మార్కెట్లో ఆన్లైన్ ట్రేడింగ్ కాటన్ వ్యాపారులకు మార్కెట్ కార్యదర్శి ఆదేశం జమ్మికుంట : జమ్మికుంట మార్కెట్లో సోమవారం నుంచి ఈ–నామ్ విధానంలోనే పత్తి కొనుగోళ్లు చేపట్టాలని మార్కెట్ కార్యదర్శి వెంకట్‌రెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం మార్కెట్ చైర్మన్లో ఆయన కాటన్ వ్యాపారులు. కమీషన్ ఏజెంట్లతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ ఆదేశాలతో ఈ–నామ్ విధానంలో ఆన్లైన్ ట్రేడింగ్ మాత్రమే నిర్వహించాలని ఆదేశించారు. నామ్ కొనుగోళ్లు ఇలా... రైతులు ఉదయం 9గంటలకే మార్కెట్‌కు చేరుకోవాలి. ఆ తర్వాత వచ్చిన పత్తి వాహనాలను లోనికి అనుమతించరు. గేటు వద్దనే రైతు పేరు, తండ్రి పేరు, గ్రామం, మండలం, జిల్లా, ఫోన్ నంబరు, కమీషన్ ఏజెంట్, సరుకు రకం, బస్తాల సంఖ్య, వాహనం నంబర్ తదితర వివరాలు నమోదు చేస్తారు. ఆ వివరాల ఆధారంగా నామ్ టోకెన్ నంబర్ జారీ చేస్తారు. తద్వారా వ్యాపారులు నాణ్యతను చూసుకొని కంప్యూటర్లో ఆన్లైన్లో ధరలు కోట్ చేస్తారు. ఇప్పటికే వ్యాపారులకు యూజర్ ఐడీ, పాస్వార్డు నంబర్లు మార్కెట్ అధికారులు కేటాయించారు. ధరలు కోట్ చేసిన తర్వాత గడువు అనంతరం ఏ వాహనానికి ఏ వ్యాపారి ఎంత ధర కేటాయించాడో మార్కెట్ అధికారులు డిస్ప్లే ద్వారా అందరికీ కనిపించే విధంగా ప్రదర్శిస్తారు. తూకం, చెల్లింపులు పాత పద్ధతిలోనే..! రైతుల ఉత్పత్తులను గేట్ వద్ద నమోదు చేయడం, వ్యాపారులు ఆన్లైన్లో బిడ్డింగ్ నిర్వహించడం వరకే ఈ–నామ్ విధానం అమలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎలక్ట్రానిక్ యంత్రాల ద్వారా తూకం వేయడం, ఆన్లైన్ ద్వారా రైతుల ఖాతాల్లో నేరుగా డబ్బులు జమచేయడానికి మరికొంత సమయం పడుతుందని తెలుస్తోంది. ఈ–నామ్ సాధ్యమేనా? పత్తి కొనుగోళ్లలో ఈ–నామ్ విధానం సాధ్యమవుతుందా అనే చర్చ వ్యాపార వర్గాల్లో వినిపిస్తోంది. రైతులు తీసుకొచ్చే ఉత్పత్తులకు ఎవ రు గ్రేడింగ్ వేస్తారు, నాణ్యతను ఎలా గుర్తిస్తారనే సందేహాలు నెలకొన్నాయి. పైన నాణ్యత, లోపల నాసిరకం పత్తి అమ్మకానికి వచ్చిన సమయంలో వ్యాపారులు ఎలా ఆన్లైన్లో ధరలు కోట్ చేస్తారనేది ప్రశ్నగా మారింది. కొత్త విధానంతో ఎలాంటి ధరలు పలుకుతాయోనని రైతుల్లోనూ ఆసక్తి నెలకొంది. శుక్రవారం కరీంనగర్ మార్కెట్‌కొచ్చిన ఉత్పత్తులు, ధరలు పంట మద్దతుధర గరిష్టం మోడల్ కనిష్టం ధాన్యం 1510 1385 1360 1350 మొక్కజొన్న 1365 1411 1370 1330 పత్తి 4060 5210 5050 4000 -
ఇక ఆన్లైన్ లో పంటల అమ్మకం
భైంసాలో ఈ-నామ్ కొనుగోళ్లు నేటి నుంచి ప్రారంభం దిగుబడులకు అధిక ధర భైంసా : జాతీయ వ్యవసాయ మార్కెట్(నామ్) విధానంతో దేశంలో ఎక్కడైనా ఒక చోట మార్కెట్లో పంటలు అమ్మకానికి తీసుకువచ్చి ధర అధికంగా ఉన్నచోట అమ్ముకోవచ్చు. ప్రధాన మంత్రి నరేంద్రమోదీ జాతీయ వ్యవసాయ మార్కెట్ పథకాన్ని ప్రవేశపెట్టారు. నామ్ కింద మన జిల్లాలోని ఆదిలాబాద్, భైంసా మార్కెట్ కమిటీలు ఎంపిక చేశారు. రైతులు వ్యవసాయ మార్కెట్‌కు అమ్మకానికి పంట తీసుకురాగానే ప్రవేశ ద్వారం వద్ద ఈ-నామ్లో గేటువద్ద ఆన్లైన్లోనే వివరాలు నమోదు చేయించాలి. దీంతో ఆ వివరాలు నామ్ కింద ఉన్న అన్ని దేశీయ వ్యవసాయ మార్కెట్ కమిటీలకు వెళ్తుంది. ఆ పంటకు సంబంధించి ఏఏ మార్కెట్లో ఎంతెంత ధర ఉందో తెలుస్తుంది. మొదటి దశలో దేశవ్యాప్తంగా 585 మార్కెట్లను నామ్ కింద ఎంపిక చేయనుంది. అందులో భాగంగానే 2015-16 సంవత్సరానికి 250 మార్కెట్లలో 2016-17లో 200 మార్కెట్లలో, 2017-18లో 135 మార్కెట్లలో నామ్ ప్రవేశపెట్టడమే కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చరర్ కోపరేటివ్ స్మాల్‌ఫార్మర్స్ అగ్రి బిజినెస్ కన్సార్టియం (ఎన్ఎఫ్ఏసీ) ద్వారా జాతీయ వ్యవసాయ మార్కెట్ విధానం అమలు చేస్తుంది. ఒక్కోమార్కెట్కు సాఫ్ట్‌వేర్‌కు అవసరమయ్యే కంప్యూటర్లు, ప్రింటర్ ఇతర సామగ్రిని అందజేస్తుంది. రెండో దశలో మన జిల్లాలోనే రెండు మార్కెట్ కమిటీలను ఎంపిక చేశారు. ఏర్పాట్లు పూర్తి.. ఇప్పటికే భైంసా మార్కెట్ కమిటీకి కేంద్ర నామ్ అధికారులు వచ్చారు. ఆన్లైన్ ఈ-నామ్ ఎంట్రీగదితోపాటు ఇతరాత్రా రికార్డులు అందించారు. ఈ-నామ్ కింద ఎలా నమోదు చేయాలో అనే విషయాలపై సిబ్బందికి శిక్షణ కూడా అందించారు. కేంద్ర అధికారిక యంత్రాంగం ఏర్పాట్లను ఇప్పటికే పూర్తి చేసింది. నేటి నుంచి ప్రారంభం భైంసా పట్టణంలో సోమవారం నుంచి ఈ-నామ్ కొనుగోళ్లు ప్రారంభం కానున్నాయి. గాంధీగంజ్ ప్రవేశద్వారం పక్కనే ఎంట్రిగదిని నిర్మించారు. ఈ గదిలో కంప్యూటర్లను అందుబాటులో ఉంచారు. రైతులు రాగానే గ్రామం పేరు, బ్యాంకు ఖాతా, సెల్ నంబరు, పంట వివరాలను నమోదు చేస్తారు. నామ్ కింద ఉన్న అన్ని జాతీయ మార్కెట్లలో ఈ వివరాలు నమోదవుతాయి. అక్కడక్కడ సంబంధిత పంటకు ఉన్న ధరలు కూడా ఆన్లైన్లో నమోదు చేస్తారు. రైతు ఇష్టం మేరకు పంటను సంబంధిత మార్కెట్లకు విక్రయిస్తారు. రైతు సమ్మతి లేకుంటే తిరిగి మళ్లీ రెండో సారి ఈ-నామ్లో వివరాలు నమోదు చేస్తారు. ఒక చోట ఫీజు చెల్లిస్తే చాలు జాతీయ వ్యవసాయ మార్కెట్ విధానం వల్ల దేశంలో ఎక్కడైనా ఒక చోట మార్కెట్ ఫీజు చెల్లిస్తే అన్ని చోట్ల వర్తిస్తుంది. రైతుల వ్యవసాయ ఉత్పత్తులను ఎక్కడైనా కొనుగోలు చేయవచ్చు. గతంలో మధ్య వర్తులు కొనుగోలు చేసి దళారులకు, బడా వ్యాపారులకు ఇచ్చేవారు. ఇప్పుడైతే ఆ పంటను నేరుగా మధ్యవర్తుల ప్రమేయంలేకుండా వ్యాపారులే కొనుగోలుచేసే అవకాశం ఉండడంతో గిట్టుబాటు ధరలు రైతులకు దక్కే అవకాశం ఉంది. ఈ విధానం ప్రారంభంతో రైతులకు ఎలా మేలుచేకూరుతుందో ఆన్లైన్ పంట అమ్మకాలు ఎలా జరుగుతాయో అనే దాని కోసం భైంసా రైతాంగం ఎదురుచూస్తోంది. ఎక్కడి వ్యాపారులైనా... ఇప్పటి వరకు స్థానికంగా ఉన్న వ్యాపారులే రైతుల సరుకులను పరిశీలించి బీట్ నిర్వహిస్తారు. బీట్‌లో వ్యాపారి నిర్ణయించిన ధరకే రైతులు పంటను విక్రయించాల్సి వచ్చేది. స్థానికంగా ఉన్న ఖరీదుదారులకు ఉన్న గోదాం, ఆర్థిక స్థితికి అనుకూలంగానే పంటలను కొనేవారు. కానీ నామ్ కింద జాతీయ వ్యవసాయ మార్కెట్లలోని బడా వ్యాపారులు సైతం కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఈ విధానంతో బెంగళూర్, చెన్నై, ఢిల్లీ, అహ్మదాబాద్‌తోపాటు పలు మార్కెట్లలోనూ ఆన్లైన్లో కొనుగోళ్లు చేపట్టవచ్చు. దేశంలోని అన్ని మార్కెట్‌యార్డుల్లో ఈ సరికొత్త విధానంలో పంటలు అమ్మిన రైతులకు డబ్బులు ఇచ్చేందుకు ఎస్క్రో అకౌంట్ పేరుతో నూతన విధానానికి శ్రీకారం చుట్టింది. ఇప్పటి వరకు రైతులు మార్కెట్లో సరుకులు అమ్మితే అడితిదారులు, కమీషన్ ఎజెంట్లు డబ్బులు చెల్లించేవారు. నూతన విధానంతో కొనుగోలుదారులు రైతులకు పంట సరుకు విలువను మార్కెట్ కమిటీ పర్యవేక్షణలో నిర్వహించే ఎస్క్రో అకౌంట్లో డబ్బులు వేస్తారు. ఖరీదుదారు సంబంధిత డబ్బులను ఈ అకౌంట్లో వేయగానే రైతు తీసుకువచ్చిన సరుకును విలువకట్టి సంబంధిత రైతు ఖాతాలో జమ చేస్తారు. తద్వారా రైతులకు దళారుల బెడద తగ్గనుంది. ఎక్కడెక్కడ ఎంత ధర ఉందో కూడా తెలుసుకునే అవకాశం రైతులకు ఉంటుంది.