దేవా..‘దేశ్‌ముఖ్’ ఇలా..
- ఆస్పత్రి సిబ్బంది, యాజమాన్యం మధ్య సమన్వయ లోపం
- తగ్గిన రోగుల సంఖ్య
- నష్టాల బాటలో దవాఖాన
సాక్షి,సిటీబ్యూరో : అది పేదల అపర సంజీవని.. కార్పొరేట్‌కు దీటుగా, సర్కార్ దవాఖానాల్లో లభించని సేవలకు ప్రత్యామ్నాయంగా వైద్య సదుపాయం అందజేసిన దుర్గాబాయి దేశ్‌ముఖ్ ఆసుపత్రి ఒకప్పటి ప్రాభవాన్ని కోల్పోతుంది. మొట్టమొదటిసారి హార్ట్ సర్జరీ చేసిన ఘనత ఆ ఆసుపత్రి సొంతం. నగరంలోని విద్యానగర్‌లో ఏర్పాటు చేసిన ఈ ఆసుపత్రి సుమారు 50 ఏళ్లుగా అతితక్కువ ఫీజులతో సేవలను అందజేస్తోంది. సామాజిక సేవ, ప్రజ లకు ఆరోగ్య సదుపాయం అందజేసే లక్ష్యంతో దుర్గాబాయి దేశ్‌ముఖ్ స్థాపించిన ఈ ఆసుపత్రి నగరంతో పాటు వివిధ ప్రాంతాల ప్రజలకు చేరువైంది. అలాంటి గత ఏడాదిన్నర కాలంగా చోటుచేసుకుంటున్న పరిణామాలు, ఉద్యోగులు, యాజమాన్యానికి మధ్య పెరుగుతున్న వైరుధ్యాలు ఆసుపత్రి వైభవాన్ని మసకబారుస్తున్నాయి. ఆసుపత్రికి వచ్చే రోగుల సంఖ్య ఇప్పుడు సగానికి పైగా పడిపోయింది. రోజుకు 30,40 మంది ఇన్‌పేషెంట్లు కూడా ఆసుపత్రికి రావడం లేదు. అవుట్పేషెంట్ల సంఖ్య 200 నుంచి 100కు పడిపోయింది. దీంతో ఉద్యోగులకు జీతాలు కూడా చెల్లించలేని స్థితిలో ఆసుపత్రిని నెట్టుకొస్తున్నామని యాజమాన్యం ఆవేదన వ్యక్తం చేస్తుంది.
ఈ ఘర్షణకు ముగింపు లేదా..
ఆసుపత్రిలో శాంతియుత వాతావరణం నెలకొని బాగా అభివృద్ధి చెందితే ఒప్పందం మేరకు ఉద్యోగుల డిమాండ్లను నెరవేరుస్తామని యాజమాన్యం చె బుతోంది.
‘‘ఒకప్పుడు నెలకు రూ.కోటీ 20 లక్షలకు పైగా ఆదాయం లభించేది. ఇప్పుడు రూ.90 లక్షలు మాత్రమే వస్తోంది. ఆసుపత్రి నిర్వహణ ఖర్చులు, సిబ్బంది జీతభత్యాలకు ఇది చాలడం లేదు.’’ అని ఆసుపత్రి నిర్వహణా అధికారి ఒకరు ఆందోళన వ్యక్తం చేశారు. ఉద్యోగుల సహకరిస్తే నష్టాల నుంచి గట్టెక్కగలమని పేర్కొన్నారు. మరోవైపు తమ న్యాయమైన సమస్యలను పరిష్కరిస్తే ఆసుపత్రి అభివృద్ధికి అన్ని విధాలుగా సహకరిస్తామని ఉద్యోగులు చెబుతున్నారు. ఇలా యాజమాన్యానికి, ఉద్యోగులకు నడుమ నెలకొన్న ఘర్షణ కొనసాగుతూనే ఉంది. ఇటీవల ఆసుపత్రి కార్యదర్శి పై కొందరు ఉద్యోగులు దాడికి యత్నించారంటూ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. తమ సమస్యలపైనే ఆయనను నిలదీసినట్లు ఉద్యోగుల వాదన. ఈ ఉదంతం ఇరువురి మధ్య దూరాన్ని మరింత పెంచింది. ఈ పరిణామాలు ఆసుపత్రికి వచ్చే రోగులపై ప్రభావం చూపుతున్నాయి.