breaking news
Dubai International Airport
-
యూఏఈలో అనూహ్య వర్షాలు
దుబాయ్: మాడ పగిలిపోయే ఎండ వేడికి, ఎడారులకు నిలయమైన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌ను భారీ వర్షాలు పలకరించాయి. బుధవారం కుండపోత వర్షాలతో యూఏఈ తడిసి ముద్దయింది. భారీ వర్షాలను తట్టుకునే ఏర్పాట్లేవీ పెద్దగా లేకపోవడంతో దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం రన్‌వే మొత్తం నీట మునిగింది. దీంతో ప్రపంచంలోనే అత్యంత రద్దీ ఎయిర్‌పోర్ట్‌గా ఖ్యాతికెక్కిన దుబాయ్ ఎయిర్పోర్ట్ నుంచి విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఎయిర్పోర్ట్ పార్కింగ్ ప్రాంతంలోని కార్లు మునిగిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఒకటిన్నర సంవత్సరంలో పడాల్సిన వర్షపాతం బుధవారం ఒక్కరోజే నమోదైందని సిటీ వాతావరణ శాఖ వెల్లడించిన గణాంకాల్లో తేలింది. 14.2 సెంటీమీటర్లమేర వర్షపాత నమోదైందని అధికారులు తెలిపారు. దేశవ్యాప్తంగా స్కూళ్లు మూసేశారు. సమీప బహ్రెయిన్, ఒమన్, ఖతార్, సౌదీ అరేబియాల్లోనూ వర్షాలు కురిశాయి. భారీ వర్షాల కారణంగా జరిగిన ఆస్తినష్టాల వివరాలను ప్రభుత్వం బయటపెట్టలేదు. వర్షాల కారణంగా భారత్ నుంచి దుబాయ్‌కు విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అయితే మేఘమథనం వల్లే ఈ వర్షాలు కురిశాయని నిపుణుల అంచనా. -
అత్యంత రద్దీ విమానాశ్రయంగా దుబాయ్
దుబాయ్: 2016లో సుమారు 8.36 కోట్ల మంది ప్రయాణించడం ద్వారా దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రపంచంలోనే అత్యంత రద్దీ విమానాశ్రయంగా నిలిచింది. 2017లో ప్రయాణికుల సంఖ్య 8.9 కోట్లకు చేరుతుందని దుబాయ్ ఎయిర్‌పోర్ట్స్ సీఈఓ పాల్ గ్రిఫిత్స్ ఆశాభావం వ్యక్తంచేశారు. ఓవరాల్ ట్రాఫిక్(జాతీయ, అంతర్జాతీయ, సరకు రవాణా)లో తొలిస్థానం కోసం అట్లాంటా, బీజింగ్ విమానాశ్రయాలకు దుబాయ్ చేరువవుతున్నట్లు ఈ గణాంకాలు చూపుతున్నాయని చెప్పారు.