breaking news
drown in sea
-
కోనసీమలో విషాదం.. గోదావరిలో ఎనిమిది మంది గల్లంతు!
సాక్షి, అమలాపురం/ముమ్మిడివరం/సాక్షి, అమరావతి: కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం కమినిలంక పంచాయతీ శివారు సలాదివారిపాలెంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఎనిమిది మంది యువకులు గోదావరి నదిలో గల్లంతయ్యారు. గ్రామంలో శుభకార్యం కోసం వచ్చిన వారిలో 11మంది యువకులు సోమవారం మధ్యాహ్నం సరదాగా నదీస్నానానికి వెళ్లగా ప్రమాదవశాత్తూ ఎనిమిది మంది మునిగిపోయారు. కాకినాడకు చెందిన సబ్బిత క్రాంతి మాన్యూల్ (19), సబ్బిత పాల్ మాన్యూల్ (18), తాతపూడి నితీష్ (19), ఎలుపర్తి సాయి (18), మండపేట మండలానికి చెందిన కాలపాక రోహిత్ (18), కె.గంగవరం మండలం శేరిలంకకు చెందిన ఎలిపే మహేష్ (14), ఐ.పోలవరం మండలం ఎర్రగరువుకు చెందిన వడ్డి మహేష్ (15), వడ్డి రాజేష్ (18) గల్లంతయ్యారు. ఒకరిని కాపాడబోయి వరుసగా.. కె.గంగవరం మండలం శేరిలంకలో పోలిశెట్టి నాగరాజు, చిన్నారి దంపతుల కుమార్తె ప్రేమ జ్యోతి ఓణీ ఫంక్షన్ జరిగింది. ఇందుకోసం ఇక్కడకొచ్చిన 11 మంది యువకులు భోజనాల అనంతరం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో గౌతమి గోదావరిని చూసేందుకు వెళ్లారు. స్నానానికి దిగారు. వీరిలో స్థానికంగా నివాసముంటున్న ఎలిపే మహేష్ లోతుగా ఉన్న ప్రాంతంలోకి వెళ్లి దిగాడు.అతనిని రక్షించేందుకు నలుగురు వెళ్లి వారు కూడా మునిగిపోయారు. మరో ముగ్గురూ వారిని కాపాడేందుకు వెళ్లి గల్లంతయ్యారు. అర్థరాత్రి వరకు వీరి ఆచూకీ లభ్యంకాలేదు. స్నానానికి దిగిన వారిలో ముగ్గురు మాత్రమే గట్టు మీదకు చేరారు. వీరిలో కాకినాడకు చెండిన డి.కరుణ్‌కుమార్ ప్రమాదం జరిగిన విషయాన్ని స్థానికులకు తెలిపారు. గల్లంతైన వారంతా 20 ఏళ్లలోపు వారే.. విషయం తెలుసుకున్న కె.గంగవరం, ఐ.పోలవరం, ముమ్మిడివరం పోలీసులు ఘటనా స్థలం వద్దకు చేరుకుని నాటు పడవలపై గాలింపు చర్యలు చేపట్టారు. అయినా ఫలితంలేదు. అధికారుల బృందాలతోపాటు స్థానికులు గౌతమీ గట్టు వెంబడి గాలించారు. రాత్రి సమయంలో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను జిల్లా యంత్రాంగం రప్పించింది. పడవలపై ఫ్లడ్‌లైట్లు ఏర్పాటుచేసి గాలిస్తున్నారు. గల్లంతైన వారంతా 20 ఏళ్లలోపు యువకులే. యువకుల కుటుంబ సభ్యులు ఘటన స్థలానికి చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.కలెక్టర్ ఆర్. మహేష్‌కుమార్, జాయింట్ కలెక్టర్ టి. నిషాంతి, ఎస్పీ బి.కృష్ణారావు గాలింపును పర్యవేక్షించారు. గ్రామస్తుల ఆగ్రహం.. ఎనిమిది మంది యువకులు గల్లంతైనా గాలింపు చర్యలు చేపట్టడంలో పోలీసులు, అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తంచేశారు. మధ్యాహ్నం మూడు గంటలకు ఘటన జరిగితే రాత్రి ఏడు గంటల వరకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలను పిలిపించకపోవడంపై మండిపడ్డారు. కలెక్టర్, జేసీలపై అసంతృప్తిని వెళ్లగక్కారు. సకాలంలో రాకుంటే గల్లంతైన యువకుల ఆచూకీని ఎలా తెలుసుకుంటారని నిలదీశారు.వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి.. గోదావరిలో స్నానానికి దిగి ఎనిమిది మంది యువకులు గల్లంతవడంతో మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. గాలింపు చర్యలు ముమ్మరం చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. గల్లంతైన వారిని రక్షించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకోవాలన్నారు.ప్రమాద హెచ్చరిక బోర్డులు పెట్టండి : సీఎం చంద్రబాబు ఎనిమిది మంది యువకులు గల్లంతవ్వడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఘటనపై జిల్లా కలెక్టర్‌తో ఆయన ఫోన్లో మాట్లాడారు. గల్లంతైన వారిని రక్షించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. బాధిత కుటుంబ సభ్యులకు ఎప్పటికప్పుడు సమాచారం అందించాలని సూచించారు. రాష్ట్రంలోని నీటి వనరులున్న అన్ని ప్రాంతాల్లో ప్రమాద హెచ్చరిక బోర్డులు ఏర్పాటుచేయాలన్నారు. -
కోనసీమ జిల్లాలో విషాదం.. గోదావరిలో 8 మంది యువకులు గల్లంతు
సాక్షి,ముమ్మిడివరం: కోనసీమ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ముమ్మిడివరం మండలం శేరిలంక గోదావరిలో ఎనిమిది మంది యువకులు గల్లంతయ్యారు. కాకినాడ నుంచి కె.గంగవరం మండలం శురుల్లంకలో శుభకార్యానికి వచ్చిన 11 మంది యువకులు స్నానం కోసం గోదావరి నదిలో దిగారు.లోతైన ప్రాంతం కావడంతో 8 మంది గల్లంతయ్యారు. అప్రమత్తమైన స్థానికులు ముగ్గురు యువకుల్ని కాపాడారు. గల్లంతైన వారిని కాకినాడ, రామచంద్రపురం, మండపేటకు చెందిన క్రాంతి, పాల్, సాయి, సతీష్, మహేష్, రాజేశ్, రోహిత్, మహేష్‌గా గుర్తించారు. మిగిలిన ఎనిమిది మంది కోసం గాలింపు చర్యల్ని ముమ్మరం చేస్తున్నారు. -
బీచ్‌లో స్నానం.. అంతలోనే తండ్రిని మింగేసిన అల..
భువనేశ్వర్: పూరీ బీచ్‌లో విషాదం చోటు చేసుకుంది. సముద్రపు స్నానం ఓ బాలుడికి తండ్రిని దూరం చేసింది. ఈ ఘటన ఒడిశాలోని పూరీలో చోటు చేసుకుంది. బాలాసోర్‌కు చెందిన బన్సిధర్ బెహెరా(35) కుటుంబసభ్యులతో కలసి వేసవి టూర్ కోసం పూరీ సముద్ర తీరానికి వెళ్లారు. శనివారం తండ్రీకొడుకులు సరదాగా బీచ్‌లోకి దిగి.. ఆడుతుపాడుతూ స్నానం చేశారు. అలా వారు స్నానం చెస్తూ.. సముద్రపు ఓ పెద్ద అల వైపు బన్సిధర్ బెహెరా దూకాడు. దీంతో ఆ పెద్ద అల వారిని అతలాకుతలం చేసింది. అల నుంచి బన్సిధర్ బెహెరా తిరిగి రాలేదు. 12 ఏళ్ల అతని కొడుకు మాత్రం సురక్షితంగా ఉన్నారు. అతని కుటుంబసభ్యులు అప్రమత్తమైనప్పటికీ ఫలితం లేకుండా పోయింది. అతని మృతదేహం కోసం డైవర్లు, ఫైర్ సిబ్బంది సముద్రంలో వెతుకుతున్నారు. సముద్రంలోకి దిగి స్నానం చేసే సమయంలో జాగ్రత్తగా ఉండాలని ఇక్కడకు వచ్చే పర్యటకులకు చెబుతామని పూరీ బీచ్ పోలీసులు తెలిపారు. అయితే కొంతమంది తాము చెప్పే సూచనలు నిర్లక్ష్యం చేస్తుంటారని అన్నారు. దాని వల్లే ఇలాంటి ప్రమాదలు చోటుచేసుకుంటాయని పేర్కొన్నారు. ఈ ఘటనను కుటుంబసభ్యుల్లో ఒకరు వీడియో తీశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. బన్సిధర్ బెహెరా బాలాసోర్‌లో చిరు వ్యాపారిగా పనిచేస్తున్నారు. -
ప్రాణం తీసిన ఈత సరదా
అక్కిరెడ్డిపాలెం (గాజువాక): ఈత సరదా ప్రాణం తీసంది. ఉడా పార్క్ బీచ్‌లో స్నానానికి దిగిన ఓ యువకుడు మృత్యువాతపడ్డాడు. మూడో పట్టణ పోలీసులు, మృతుని బంధువులు తెలిపిన వివరాల ప్రకారం... ప్రైవేట్ ఎలక్ట్రీషియన్ పనులు చేసుకునే ఎస్.కోటకు చెందిన ఎల్లపు ఎర్రినాయుడు, జగదీశ్వరి దంపతులకు ఎల్లపు రోహిత్ (19), హర్షిత్ ఇద్దరు కుమారులు. వీరిలో రోహిత్ గిడిజాల వద్ద ఉన్న సాయి గణపతి కళాశాలలో పాలిటెక్నికల్ ఈసీఈ పూర్తి చేశాడు. రెండో కుమారుడు హర్షిత్ గాజువాకలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్ చదువుతున్నాడు. ఇద్దరు అన్నదమ్ములకు చదువుపై ఉన్న ఇష్టంతో అక్కిరెడ్డిపాలెంలోని పెద్దమ్మ, పెదనాన్నలైన కాండ్రేగుల రత్నం, నర్సింగరావుల వద్ద ఉండి చదువుకుంటున్నారు. రోహిత్ ఉన్నత చదువులు కోసం సిద్ధమవుతున్నాడు. ఈ నేపథ్యంలో ఆదివారం ఇంటిలో చెప్పకుండా రోహిత్ బయటకు వెళ్లాడు. అక్కడి నుంచి పంతులు గారి మేడ ప్రాంతానికి చెందిన జి.సంతోష్(22), అనకాపల్లికి చెందిన జి.స్వామి(21)తో కలిసి మధ్యాహ్నం నగరంలోని ఉడా పార్క్‌కు వెళ్లారు. వీరిలో ఎవరికీ ఈత రాకపోయినప్పటికీ రోహిత్ మాత్రం స్నానానికి దిగాడు. మిగిలిన ఇద్దరు స్నేహితులు ఒడ్డునే ఉన్నారు. స్నేహితులిద్దరూ చూస్తుండగానే బలమైన కెరటాల తాకిడికి రోహిత్ గల్లంతయ్యాడు. కొద్ది సమయానికి రోహిత్ మృతదేహం ఒడ్డుకు చేరింది. రోహిత్ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కేజీహెచ్‌కు తరలించారు. అయితే ఇంటి నుంచి బయటకు వెళ్లిన రోహిత్ మధ్యాహ్నం భోజనానికి రాకపోవడంతో అతని సోదరుడు హర్షిత్ ఫోన్ చేయగా... రోహిత్ ఉడా పార్కు వెనుక ఉన్న సముద్రంలో గల్లంతయ్యాడన్న విషయం తెలిసింది. దీంతో వెంటనే తల్లిదండ్రులు, బంధువులు తీరానికి చేరుకుని గుండెలవిసేలా రోదించారు. చేతికందొచ్చిన కొడుకు చనిపోవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. త్రీటౌన్ ఎస్ఐ సత్యనారాయణ కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
సముద్రంలో దిగి ఇద్దరు మృతి
విశాఖపట్నం: విశాఖ బీచ్‌లో ఆదివారం వేర్వేరు ప్రాంతాల్లో సముద్ర స్నానానికి దిగిన ఇద్దరు యువకులు మృతిచెందగా, మరొకరు గల్లంతయ్యారు. స్థానిక కొబ్బరితోట ప్రాంతానికి చెందిన కాకర మహేష్ (19), కాకర చంద్రమౌళి (18), రాజు (16), సాయి (15), చందు (14), రమేష్ (19), ఆటోడ్రైవర్ పైడిరాజు, మెడికల్ రిప్రజంటేటివ్ అప్పలరాజు (24) ఆదివారం ఆర్కే బీచ్‌కు వెళ్లి స్నానానికి దిగారు. పెద్ద కెరటం రావడంతో అప్పలరాజు, రమేష్, అన్నదమ్ములు కాకర చంద్రమౌళి, కాకర మహేష్ లోపలికి వె ళ్లిపోయారు. సమీపంలో ఉన్న లైఫ్‌గార్డులు చంద్రమౌళిని, రమేష్‌ను రక్షించారు. కొద్ది నిమిషాలకే అప్పలరాజు మృతదేహం ఒడ్డుకు కొట్టుకొచ్చింది. గల్లంతైన మహేష్ కోసం గాలిస్తున్నారు. విశాఖలోని ఆరిలోవ ప్రాంతం గాంధీనగర్‌కు చెందిన ఏడుగురు యువకులు రుషికొండ బీచ్‌లో స్నానాలకు దిగారు. ఒక్కసారిగా ఉవ్వెత్తిన పెద్ద అల రావడంతో కాకి రాజేష్ (20) సముద్రం లోపలకు కొట్టుకుపోయాడు. సుమారు 20 నిమిషాల తర్వాత మత్స్యకారులు చేపల కోసం వేసిన ఓ వలలో రాజేష్ మృతదేహం లభించింది.