breaking news
Dr. Meghna Reddy K
-
స్కిన్ కౌన్సెలింగ్
నేను ఇటీవల టీ-షర్ట్స్ అంటే బాగా ఇష్టపడి వాటినే వాడుతున్నాను. అయితే అవి వాడుతున్న దగ్గర్నుంచి నా బాహుమూలాల్లో చర్మం నల్లబడినట్లుగా అనిపిస్తోంది. దీనికి పరిష్కారం చెప్పండి. - వై. శ్రీనివాస్, విశాఖపట్నం సాధారణంగా టీ-షర్ట్స్ ఒంటికి పట్టినట్లుగా ఉండటంతో వారు మంచి సౌష్ఠవంతో కనిపించడం వల్ల డైనమిక్ లుక్ వస్తుంది. అయితే బిగుతైన టీ-షర్ట్స్ కొన్ని సమస్యలను తెచ్చిపెట్టవచ్చు. అవి ఒంటికి పట్టేసినట్లుగా ఉండటం వల్ల గాలి ఆడక బాహుమూలాల్లో టీనియా కార్పోరిస్, టీనియా వెర్సికోలర్ వంటి ఫంగల్ ఇన్ఫెక్షన్లు రావచ్చు. మిగతా చర్మంతో పోల్చినప్పుడు అక్కడి చర్మం నల్లగా కనిపించడానికి కారణం... బిగుతైన దుస్తుల వల్ల అక్కడ పిగ్మెంటేషన్ ఏర్పడటమే. మీరు ఒకసారి డర్మటాలజిస్ట్‌ను కలిసి, మీ సమస్యకు వాస్తవ కారణాన్ని తెలుసుకుని తగిన చికిత్స తీసుకోండి. - డాక్టర్ మేఘనారెడ్డి కె. డర్మటాలజిస్ట్, ఒలీవా అడ్వాన్స్డ్, స్కిన్ - హెయిర్ క్లినిక్,హైదరాబాద్ -
డర్మటాలజీ కౌన్సెలింగ్
నా వయసు 22. అయినా నా చర్మం ఎండిపోయినట్లుగా ఉంటోంది. ఆహారంలో మార్పులతో మేను మెరిసేలా చేయడానికి సూచనలు ఇవ్వండి. - సౌమ్య, జనగామ చర్మానికి మేలు చేసే ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల మేని సౌందర్యాన్ని కాపాడుకోవచ్చు.చేపలు, అవిశెలు, బాదం... వీటిల్లో ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ. ఇవి చర్మంలోని తేమను బయటకు వెళ్లనివ్వకుండా కాపాడి మేను మెరిసేలా చేస్తాయి. ముడిబియ్యం, పొట్టుతీయని ధాన్యాలు, బార్లీ వీటిల్లో పీచు పదార్థాలు ఎక్కువ. ఈ పీచు పదార్థాలు చర్మం బిగుతుదనాన్ని కాపాడతాయి. వైటమిన్-బి6 ఎక్కువగా ఉండే ఆహారమైన కాలీఫ్లవర్, పొద్దుతిరుగుడు గింజల నూనె, వాల్నట్, అవకాడో వల్ల హార్మోన్లలోని అసమతౌల్యత వల్ల వచ్చే మొటిమలను నివారించవచ్చు. అరటి, నారింజ, జామ వంటి అన్ని రకాల తాజా పండ్లలో అన్ని రకాల విటమిన్లతో పాటు యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇవి చర్మానికి హానిచేసే ఫ్రీరాడికల్స్ అనే విషాలను తొలగించి మేనిని మెరిసేలా చేస్తాయి. నేను కాస్త చాయనలుపుగా ఉంటాను. మార్కెట్లో దొరికే ఫెయిర్‌నెస్ క్రీములు వాడాలనుకుంటున్నాను. అవి వాడేముందు ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలా? - శ్వేత, హైదరాబాద్ సాధారణంగా తెల్లగా కనిపించడం కోసం ఉపయోగించే ఫెయిర్‌నెస్ క్రీమ్‌లతో చాలా వరకు ప్రమాదం ఉండదు. కానీ వాటిని వాడే ముందర మీరు ఈ జాగ్రత్తలు తీసుకోండి వాడబోయే ఫెయిర్‌నెస్ క్రీమ్‌ను చర్మంపై ఎక్కడైనా (చేతికి అయితే మంచిది) కొద్దిగా ప్యాచ్‌లాగా రాసి... దాని వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేదని తెలుసుకున్న తర్వాతే వాడండి ఏదైనా క్రీమ్ ఎంపిక తర్వాత ఇలా టెస్ట్ చేసుకోకపోతే కొన్నిసార్లు కొందరిలో కాంటాక్ట్ డర్మటైటిస్, అలర్జిక్ రియాక్షన్స్ వచ్చే అవకాశం ఉందని గుర్తుంచుకోండి. ఇలా ప్యాచ్‌లా రాసుకొని పరీక్షించడం వల్ల కొన్ని ప్రమాదాలను ముందే నివారించవచ్చని తెలుసుకోండి. - డాక్టర్ మేఘనారెడ్డి కె. కన్సల్టెంట్ డర్మటాలజిస్ట్, ఒలీవా అడ్వాన్స్డ్ స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్,హైదరాబాద్