న్యూరాలజీ కౌన్సెలింగ్
మళ్లీ ఫిట్స్ రావడం మొదలైంది ఏం చేయాలి?
మా చెల్లి వయసు 17 ఏళ్లు. ఇంటర్మీడియట్ చదువుతోంది. చిన్నప్పట్నుంచీ ఫిట్స్‌తో బాధపడుతోంది. చాలాసార్లు కాలేజీలోనే ఆమెకు ఫిట్స్ వచ్చాయి. దాంతో కాలేజీ వారూ, కుటుంబసభ్యులూ ఆందోళనకు గురైన సందర్భాలు చాలా ఉన్నాయి. హైదరాబాద్‌కు తీసుకెళ్లి వైద్యం చేయించాం. కొంతకాలం బాగానే ఉంది. కానీ ఈమధ్య మళ్లీ ఫిట్స్ రావడం మొదలైంది. ఆమె అనారోగ్యం కుటుంబంలో అందరికీ ఆందోళన కలిగిస్తోంది. ఈ వ్యాధి పూర్తిగా నయం చేయడానికి ఏదైనా చికిత్స ఉందా? దయచేసి మాకు తగిన సలహా అందించండి.
- బి. కరుణాకర్‌రెడ్డి, నల్గొండ
ఫిట్స్ (మూర్ఛ) అనేది మెదడులో సంభవించే ప్రకోపనాలకు సంకేతం మాత్రమే. ఫిట్స్ వల్ల నిజానికి ఎలాంటి ప్రాణహానీ ఉండదు. కానీ చాలామంది ఫిట్స్‌ను ఏదో తీవ్రమైన, అరుదైన, ప్రమాదకరమైన సమస్యగా చూస్తుంటారు. కానీ అది నిజం కాదు. ఇది చాలా సాధారణమైన సమస్య. మెదడులోని నాడీ కణాల్లో నిరంతరం విద్యుత్ ప్రసారం జరుగుతూ ఉంటుంది. ఉన్నట్లుండి మెదడులోని కొన్ని ప్రాంతాల్లోని నాడీ కణాల్లో విద్యుత్ చర్యలు అస్తవ్యస్తమైనప్పుడు ఫిట్స్ వస్తాయి. వీటినే సీజర్స్ అని కూడా అంటారు. ఇలా తరచూ ఫిట్స్ వస్తుంటే దాన్ని తెలుగులో మూర్ఛ అని ఇంగ్లిష్‌లో ఎపిలెప్సీ అని అంటారు. ఫిట్స్ అన్నీ ఒకే రకానికి చెందినవి కావు. ఈ సమస్య ఎక్కడ మొదలవుతుందో దాన్ని బట్టీ, ఆ సమయంలో కనిపించే లక్షణాలను బట్టీ ఇది ఏరకమైన ఫిట్స్ అన్నది నిర్ధారణ చేస్తారు.
సాధారణంగా ఫిట్స్ వచ్చిన సందర్భాల్లో కొద్దిసేపట్లోనే ఎలాంటి వైద్యసహాయం లేకుండానే పేషెంట్ తనంతట తానుగా కోలుకుంటాడు. అయితే ఫిట్స్ వచ్చిన సమయంలో ఆ వ్యక్తిని ఒకవైపునకు ఒరిగి ఉండేలా పడుకోబెట్టడం చాలా ముఖ్యం. దీనివల్ల శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది లేకుండా చేయవచ్చు. ఫిట్స్ వచ్చినప్పుడు ఆ వ్యక్తి తనకు తెలియకుండానే నిద్రలోకి జారుకుంటాడు. మళ్లీ కొద్దినిమిషాల్లోనే స్పృహలోకి వస్తాడు.
అలా కొద్దినిమిషాల్లోనే స్పృహలోకి రాకపోతే మాత్రం వెంటనే ఆసుపత్రికి తరలించి వైద్య సహాయం అందించాలి. అంతేగానీ ఫిట్స్ వచ్చిన సమయంలో పేషెంట్ నోట్లో ఏదైనా పెట్టడం, చేతిలో తాళాల వంటి ఇనుప వస్తువులు ఉంచడం, ముక్కు దగ్గర ఏదైనా తోలు వస్తువు వాసన చూపడం వంటి చర్యలకు ఎట్టి పరిస్థితుల్లోనూ పూనుకోకూడదు. ఇలాంటి చర్యల వల్ల పేషెంట్‌కు ఎలాంటి ప్రయోజనం ఉండదు. పైగా కొన్ని సందర్భాల్లో అవి హాని చేసే ప్రమాదం కూడా ఉంది. ఇక మీ సోదరి విషయానికి వస్తే స్త్రీ జీవితంలోని ప్రతి దశలోనూ అంటే... రజస్వల కావడం, నెలసరి రావడం, గర్భధారణ, బిడ్డకు పాలివ్వడం, నెలసరి నిలిచిపోవడం... ఇలా ప్రతి దశలోనూ హార్మోన్ల ప్రభావం బలంగా ఉంటుంది. దీంతో ఫిట్స్ సమస్యకూడా ప్రభావితమయ్యే అవకాశం ఉంటుంది. అయితే ఇలాంటి వారిలో 90 శాతం కేసుల్లో సుదీర్ఘ చికిత్స, మందుల ద్వారా వ్యాధిని పూర్తిగా నయం చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు ఎలాంటి ఆందోళన చెందకుండా వెంటనే అనుభవజ్ఞులైన న్యూరోఫిజీషియన్కు చూపించి చికిత్సను కొనసాగించండి.
డాక్టర్ ఆనంద్ బాలసుబ్రమణ్యం
సీనియర్ న్యూరో సర్జన్,
యశోద హాస్పిటల్స్,
సికింద్రాబాద్