breaking news
DPR works
-
డబుల్ లేన్లుగా సింగిల్ రోడ్లు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో జాతీయ రహదారులకు అనుసంధానంగా ఉన్న పలు సింగిల్ లేన్ రోడ్లు.. డబుల్ లేన్లుగా మారనున్నాయి. ట్రాఫిక్ అత్యధికంగా ఉండే ఈ రోడ్లను గతంలోనే ఆర్ అండ్ బీ నుంచి నేషనల్ హైవేస్ పరిధికి మార్చారు. ఏపీ రహదారుల అభివృద్ధి సంస్థ వీటికి సమగ్ర ప్రాజెక్టు నివేదికలు(డీపీఆర్) రూపొందించింది. వెంటనే ఈ డీపీఆర్‌లను మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ ఆమోదించింది. రూ.2,797 కోట్లతో 440 కి.మీ. మేర అభివృద్ధి చేయనున్న ఈ రోడ్లకు త్వరలో టెండర్లు పిలవనున్నారు. ఈ రోడ్లను మూడేళ్లలో పూర్తి చేయాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. ► చెన్నై–బళ్లారిని కలిపే ఎన్‌హెచ్–716లో భాగమైన ఎన్‌హెచ్–67(ముద్దనూరు), ఎన్‌హెచ్–40(కడప)పై ట్రాఫిక్ పెరిగిపోయింది. చిత్తూరు, అనంతపురం, వైఎస్సార్ జిల్లాలకు వెళ్లేందుకు ఇది ప్రధాన రహదారి. దీనిపై రోజుకు 9 వేల ప్యాసింజర్ కార్ యూనిట్ (పీసీయూ)ల ట్రాఫిక్ ఉంటోంది. ఈ మార్గంలో 51 కి.మీ. మేర రోడ్లను అభివృద్ధి చేయనున్నారు. ► ఏజెన్సీ గ్రామాలకు రంపచోడవరం నుంచి కొయ్యూరు (ఎన్‌హెచ్–516 ఈ) రోడ్డు ముఖ్యమైనది. ఈ రహదారిలో ఎక్కువ భాగం ఘాట్ రోడ్ నిర్మాణం చేపట్టాల్సి ఉంది. దీనికి సంబంధించి 74 కి.మీ. మేర రోడ్డును అభివృద్ధి చేయనున్నారు. ► పోరుమామిళ్ల–సీఎస్ పురం, సీఎస్ పురం–సింగరాయకొండ రోడ్ల అభివృద్ధికి కేంద్రం డీపీఆర్‌లను ఆమోదించింది. ఇవి అందుబాటులోకి వస్తే ప్రకాశం, నెల్లూరు, వైఎస్సార్ జిల్లాలకు వెళ్లే ప్రయాణికులకు ట్రాఫిక్ ఇబ్బందులు తొలగిపోతాయి. అలాగే తెలంగాణ–ఏపీని కలిపే జీలుగుమిల్లి– జంగారెడ్డిగూడెం– దేవరపల్లి – రాజమండ్రి రోడ్డుతో పాటు కొవ్వూరు నుంచి అశ్వారావుపేట, ఖమ్మం వరకు రోడ్లను అభివృద్ధి చేయనున్నారు. -
విశాఖ మెట్రో డీపీఆర్ త్వరగా పూర్తిచేయండి
సాక్షి, అమరావతి: విశాఖపట్నం మెట్రో రైలు ప్రాజెక్టు డీపీఆర్ (సవివర నివేదిక)ను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అధికారులను ఆదేశించారు. విజయవాడలోని మెట్రో రైలు కార్యాలయంలో బుధవారం ఆయన పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి శ్యామలరావు, స్పెషల్ సెక్రటరీ రామమనోహరరావు, మెట్రో రైలు కార్పొరేషన్ ఎండీ రామకృష్ణారెడ్డి తదితరులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రాజెక్టు చేపట్టడానికి అవసరమైన నిధులు, వాటి సమీకరణ మార్గాలను కూడా డీపీఆర్‌లో పొందుపర్చాలని అధికారులకు స్పష్టం చేశారు. అత్యుత్తమ ప్రమాణాలతో విశాఖ మెట్రో రైల్ ఉండేలా ప్రణాళికను రూపొందించాలన్నారు. కోవిడ్ కారణంగా డీపీఆర్ రూపకల్పనలో ఆలస్యమైందని, త్వరలోనే దీనికి తుదిరూపు ఇవ్వనున్నట్లు అధికారులు తెలిపారు. విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్టు వరకు ఏ మార్గాల్లో మెట్రో రైలు ఏర్పాటుకు అవకాశాలున్నాయనే దానిపై చర్చించారు. 75 కిలోమీటర్ల మేర నిరి్మంచే కారిడార్లలో ప్రజలకు సౌకర్యవంతంగా స్టేషన్లు, నిర్వహణ సౌలభ్యం తదితర విషయాల్లో తుది అంచనాలకు వచ్చే ముందు అవసరమనుకుంటే మరోసారి క్షేత్ర స్థాయిలో పర్యటించి అధ్యయనం చేయాలని మంత్రి అధికారులకు సూచించారు. -
మూసీ మురిసేలా..
- భారీ స్కైవే నిర్మాణం - 42 కి.మీ.లు... ఆరు లేన్లు - అంచనా వ్యయం రూ.8000 కోట్లు - వడివడిగా డీపీఆర్ - పూర్తయ్యాక టెండర్లు సాక్షి, సిటీబ్యూరో: చారిత్రక మూసీ మురిసేలా... గ్రేటర్ హైదరాబాద్ మెరిసేలా... భారీ స్కైవే (ఆకాశ మార్గం) రానుంది. ఓఆర్ఆర్ తూర్పు నుంచి పడమరకు దాదాపు 42 కి.మీ.ల మేర మూసీ వెంబడి భారీ స్కైవే నిర్మాణానికి త్వరలో టెండర్లు పిలవనున్నారు. దీనికి సంబంధించిన డీపీఆర్ పనులు జరుగుతున్నాయి. ఈ నెలాఖరులోగా ఇది పూర్తికాగానే వివిధ ప్రాంతాల్లో ఇంటర్ చేంజెస్‌తో భారీ స్కైవేను నిర్మించనున్నారు. దీని అంచనా వ్యయం రూ.8 వేల కోట్లు. వరంగల్ హైవేలోని కొర్రెముల నుంచి నార్సింగి వరకు మూసీ వెంబడి, దీని ఒడ్డున ఉన్న ప్రాంతాల మీదుగా స్కైవే సాగుతుంది. దీనిపైకిచేరుకోవడానికి, కిందకు దిగడానికి 20 జంక్షన్లలో ఇంటర్‌చేంజెస్ నిర్మిస్తారు. దాదాపు రెండు కిలోమీటర్లకు ఒకటి చొప్పున ఇవిఏర్పాటు చేస్తారు. ఆరులేన్ల ఈ స్కైవే అందుబాటులోకి వస్తే దాదాపు 40 లక్షల మంది జనాభాకు ప్రయోజనం కలుగుతుంది. సాఫీగా సాగేందుకు... పాతబస్తీ నుంచి ఇన్నర్ రింగ్ రోడ్డు వరకు ఉన్న వివిధ ప్రాంతాల నుంచి నగర ఉత్తర, తూర్పు, పడమర ప్రాంతాలకు చేరుకోవడం సులభమవుతుంది. వివిధ మార్గాల్లో ప్రయాణ దూరం తగ్గుతుంది. ట్రాఫిక్ జంఝాటాలు లేకుండా సాఫీ ప్రయాణానికి మార్గం సుగమమవుతుంది. ఎల్బీనగర్-చాదర్‌ఘాట్, లక్డీకాపూల్-మెహదీపట్నం, ఉప్పల్- రామంతాపూర్ తదితర మార్గాలు వీటిలో ఉన్నాయి. ప్రజలకు సాఫీ ప్రయాణంతో పాటు నగరం కూడా వివిధ రకాలుగా అభివృద్ధి చెందగలదనే అంచనాలు ఉన్నాయి. త్వరలో అందుబాటులోకి రానున్న మెట్రో రైలును మరికొంత దూరం విస్తరించినా ఇబ్బందులు కలుగకుండా డీపీఆర్‌ను రూపొందిస్తున్నట్లు తెలిసింది. స్కైవేకు ఇరువైపులా భూములకు భారీ డిమాండ్ పెరుగుతుందని భావిస్తున్నారు. దాదాపు 25వేల ఎకరాల్లో అభివృద్ధి జరుగుతుందని అధికారుల అంచనా. దీని నిర్మాణానికి భూసేకరణ తక్కువగానే ఉండటంతో అటువైపు మొగ్గు చూపుతున్నారు. బీఓటీ పద్ధతి, లేదా డిఫర్డ్ సెమీ యాన్యుటీ విధానంలో కానీ టెండర్లను ఆహ్వానించనున్నట్లు తెలుస్తోంది. భారీ ఆదాయంపై దృష్టి ఈ స్కైవే అందుబాటులోకి వచ్చాక జీహెచ్ ఎంసీకి వివిధ రూపాల్లో భారీ ఆదాయం రాగలదనే అంచనాలు ఉన్నాయి. స్కైవే వెంబడి అభివృద్ధి చెందే ప్రాంతాల్లో భారీ నిర్మాణాలకువీలుందని... వీటికి సంబంధించిన అనుమతుల ఫీజులు, తదితరమైన వాటి ద్వారా దాదాపు రూ.30 వేల కోట్లు జీహెచ్ఎంసీ ఖజానాకు చేరగలవని ప్రాథమికంగా అంచనా వేశారు. అంతేకాదు.. భవిష్యత్తులో ఈ ప్రాంతాల నుంచే ఏటా దాదాపు రూ.600 కోట్ల వంతున ఆస్తిపన్ను రూపేణా వస్తాయనే భారీ అంచనాల్లో అధికారులు ఉన్నారు. మూసీ వెంబడి ఉన్న నిర్మాణాలు / వంతెనలు 1. ఓఆర్ఆర్ ఈస్ట్ (బాచారం వద్ద) 2. బాచారం-కొర్రెముల బ్రిడ్జి 3. {పతాపసింగారం-గౌరెల్లి కాజ్వే 4. నాగోల్ బ్రిడ్జి (ఇన్నర్ రింగ్ రోడ్డు వెంబడి) 5. మూసారం బాగ్ కాజ్వే 6. గోల్నాక బ్రిడ్జి 7. చాదర్‌ఘాట్ హై లెవెల్ కాజ్వే 8. చాదర్‌ఘాట్ బ్రిడ్జి 9. ఎంజీబీఎస్ (బయటకు వెళ్లే దారి) 10. ఎంజీబీఎస్ (ప్రవేశ ద్వారం) 11. సాలార్జంగ్ బ్రిడ్జి 12. నయాపూల్ బ్రిడ్జి(పాత, కొత్త) 13. ముస్లింజంగ్ బ్రిడ్జి (పాత,కొత్త) 14. పురానాపూల్ బ్రిడ్జి (పాత,కొత్త) 15. అత్తాపూర్ బ్రిడ్జి (ఇన్నర్ రింగ్ రోడ్డు వెంబడి) 16. బాపూ ఘాట్ బ్రిడ్జి 17. టిప్పుఖాన్ బ్రిడ్జి 18. ఇబ్రహీంబాగ్ కాజ్ వే 19. మంచిరేవుల కాజ్వే 20. ఓఆర్ఆర్ వెస్ట్ (నార్సింగి వద్ద)