Domestic car manufacturing
-
కారు.. టాప్ గేరు!
ముంబై: దేశీయ కార్ల తయారీ సంస్థలు కొత్త ఆర్థిక సంవత్సరాన్ని ఘనంగా ప్రారంభించాయి. మారుతీ సుజుకీ, హ్యుందాయ్, కియా వంటి సంస్థల రికార్డు స్థాయి విక్రయాల కారణంగా, ఏప్రిల్‌లో దేశీయ మార్కెట్లో 4.5 లక్షల ప్యాసింజర్ వాహనాలు అమ్ముడయ్యాయి. గతేడాది(2025) ఇదే నెల అమ్ముడైన 3.54 లక్షల ప్యాసింజర్ వాహనాలతో పోలిస్తే ఇవి 27% అధికంగా ఉన్నాయి. జీఎస్టీ 2.0 అమలుతో నెలకొన్న సానుకూల పరిస్థితులు, ఆర్బీఐ రెపో రేట్ల తగ్గింపు, ఆదాయ పన్ను రాయితీ అంశాలతో వాహన పరిశ్రమకు ప్రయోజనం చేకూరిందని మారుతీ సుజుకీ ఇండియా సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పార్థో బెనర్జీ తెలిపారు. → మారుతీ సుజుకీ దేశీయ అమ్మకాల్లో సరికొత్త రికార్డు సృష్టించింది. గతేడాది డిసెంబర్ నాటి 1,82,165 యూనిట్ల గరిష్ట స్థాయి అధిగమిస్తూ.. ఈ ఏప్రిల్‌లో 1,91,122 వాహనాలను విక్రయించింది. గత ఏప్రిల్‌తో (1,42,053 యూనిట్లు) పోలిస్తే వృద్ధి 34.54 శాతంగా నమోదైంది. ప్రస్తుతం మారుతీ వద్ద 1.65 లక్షల బుకింగ్స్ పెండింగ్‌లో ఉన్నాయి. → మహీంద్రా అండ్ మహీంద్రా(ఎం అండ్ ఎం) ఏప్రిల్‌లో దేశీయంగా 56,331 యూనిట్లను విక్రయించింది. గతేడాది ఇదే నెలలో అమ్మిన 52,330 వాహనాలతో పోలిస్తే ఇవి 8% అధికంగా ఉన్నాయి. కొత్త ఆర్థిక సంవత్సరం (2026–27) ‘సానుకూల దృక్పథం’తో ప్రారంభమైందని సంస్థ ఆటోమోటివ్ విభాగం సీఈఓ నళినీకాంత్ గొల్లగుంట తెలిపారు. → టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్(టీఎంపీవీ) అమ్మకాలు వార్షిక ప్రాతిపదికన 30.5% పెరిగి 45,199 నుంచి 59,000 యూనిట్లకు చేరాయి. → ప్రభుత్వ పాలసీ మద్దతుతో హ్యుందాయ్ మోటార్ ఇండియా సరికొత్త రికార్డు సృష్టించింది. ఏప్రిల్ 2026లో 17% వార్షిక వృద్ధితో దేశీయంగా 51,902 యూనిట్ల విక్రయాలు జరిపింది. సంస్థ ప్రారంభమైనప్పటి నుంచి ఏప్రిల్ నెలలో నమోదైన అత్యధిక అమ్మకాలు ఇవే. → కియా ఇండియా ఏప్రిల్‌లో 16% వృద్ధితో అదరగొట్టింది. గతేడాది ఏప్రిల్‌లో 23,623 యూనిట్లు అమ్ముడవగా.. ఈసారి 27,286 వాహనాలతో సంస్థ చరిత్రలోనే అత్యధిక ఏప్రిల్ విక్రయాలను నమోదు చేసింది.→ టయోటా కిర్లోస్కర్ మోటార్ 21 శాతం వృద్ధితో సత్తా చాటింది. గతేడాది ఏప్రిల్‌లో 24,833 యూనిట్లు అమ్ముడవగా, ఈసారి ఆ సంఖ్య 30,159కి చేరింది. → జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా ఈ ఏప్రిల్‌లో 3 శాతం వృద్ధితో 6,018 వాహనాలను డీలర్లకు పంపింది. → రెనో ఇండియా అమ్మకాల్లో ఏకంగా రెండింతల వృద్ధిని నమోదు చేసింది. గతేడాది 2,602 యూనిట్లు అమ్ముడవగా, ఈసారి ఆ సంఖ్య 5,413కి చేరింది. → నిస్సాన్ మోటార్ ఇండియా దేశీయ విక్రయాలు 3,203 యూనిట్లుగా నమోదయ్యాయి. -
మెప్పించిన మారుతీ..
►క్యూ1లో రూ.762 కోట్ల నికర లాభం; 21% అప్ ►ఆదాయం రూ.11,074 కోట్లు;11 శాతం వృద్ధి ►అమ్మకాల్లో 12.6% పెరుగుదల.. ►త్వరలో మిడ్‌సైజ్ సెడాన్ సియాజ్, ఎల్సీవీ, కాంపాక్ట్ ఎస్యూవీ... న్యూఢిల్లీ: దేశీ కార్ల తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ ఇండియా ఆకర్షణీయమైన ఫలితాలను నమోదు చేసింది. ఈ ఏడాది తొలి త్రైమాసికం(2014-15)లో రూ.762 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో రూ.632 కోట్లతో పోలిస్తే లాభం 21% ఎగబాకింది. అమ్మకాలు పుంజుకోవడం, వ్యయ నియంత్రణ, ఫారెక్స్ రాబడులు ఇందుకు ప్రధానంగా దోహదం చేశాయి. కాగా, కంపెనీ మొత్తం ఆదాయం 11% వృద్ధితో రూ.9,995 కోట్ల నుంచి రూ.11,074 కోట్లకు పెరిగింది. అమ్మకాల జోరు... ‘సన్నగిల్లిన వినియోగదారుల విశ్వాసం, అధిక ద్రవ్యోల్బణం ఇతరత్రా పలు ప్రతికూలాంశాలతో గతేడాది ఆర్థిక వ్యవస్థ దెబ్బతింది. అయితే, ఈ ఏడాది సార్వత్రిక ఎన్నికల తర్వాత సుస్థిర ప్రభుత్వం కొలువుదీరడంతో వినియోగదారుల్లో విశ్వాసం మళ్లీ పుంజుకుటోంది. తొలిసారి కారు కొనుగోలు చేసేవాళ్లు పెరిగారు. దీంతో కంపెనీ టాప్ సెల్లింగ్ మోడల్ అయిన ఆల్టో అమ్మకాలు క్యూ1లో 30 వేల మార్కును అధిగమించాయి’ అని మారుతీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్(సీఎఫ్ఓ) అజయ్ సేథ్ పేర్కొన్నారు. కాగా, ఏప్రిల్-జూన్ క్వార్టర్లో కంపెనీ మొత్తం 2,99,894 వాహనాలను విక్రయించింది. క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 12.6 శాతం వృద్ధి నమోదైంది. దేశీయంగా 2,70,643 వాహనాలు(10.3% వృద్ధి) అమ్ముడవగా... 29,251 వాహనాలను(38.7% వృద్ధి) ఎగుమతి చేసింది. క్యూ1లో మాతృసంస్థ సుజుకీ మోటార్ కార్పొరేషన్‌కు రూ.689 కోట్లను రాయల్టీ రూపంలో చెల్లించినట్లు ఆయన వెల్లడించారు. కాగా, ప్రస్తుత 2014-15 ఏడాదిలో రూ.4,000 కోట్ల పెట్టుబడులను వెచ్చించనున్నట్లు అజయ్ సేథ్ చెప్పారు. ఫలితాల నేపథ్యంలో కంపెనీ షేరు గురువారం బీఎస్ఈలో ధర 1.07 శాతం నష్టంతో రూ.2,525 వద్ద స్థిరపడింది. కొత్త కార్ల క్యూ...: దేశీ మార్కెట్లో తమ వాటాను మరింత పటిష్టం చేసుకునేందుకు మారుతీ కొత్త కార్ల విడుదలకు సమాయత్తమవుతోంది. వచ్చే 12 నెలల్లో మిడ్‌సైజ్ సెడాన్ సియాజ్, ఎల్సీవీ(లైట్ కమర్షియల్ వెహికల్), కాంపాక్ట్ ఎస్యూవీ(స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్)తో తదితర వాహనాలను ప్రవేశపెట్టనున్నట్లు మారుతీ వైస్ ప్రెసిడెంట్ రాహుల్ భారతి వెల్లడించారు. ఇప్పుడున్న మోడళ్లను మరింత మెరుగుపరచనున్నట్లు కూడా ఆయన పేర్కొన్నారు.


