కారు.. టాప్‌ గేరు! | Maruti Suzuki, Hyundai, Kia post record sales in April 2026 | Sakshi
Sakshi News home page

కారు.. టాప్‌ గేరు!

May 2 2026 5:49 AM | Updated on May 2 2026 5:49 AM

Maruti Suzuki, Hyundai, Kia post record sales in April 2026

ఆటో రంగం శుభారంభం

కొత్త ఏడాది ఘనంగా బోణీ 

మారుతీ, హ్యుందాయ్, కియా రికార్డు అమ్మకాలు 

ఏప్రిల్‌లో 4.5 లక్షల ప్యాసింజర్‌ వాహనాల సేల్స్‌

ముంబై: దేశీయ కార్ల తయారీ సంస్థలు కొత్త ఆర్థిక సంవత్సరాన్ని ఘనంగా ప్రారంభించాయి. మారుతీ సుజుకీ, హ్యుందాయ్, కియా వంటి సంస్థల రికార్డు స్థాయి విక్రయాల కారణంగా,  ఏప్రిల్‌లో దేశీయ మార్కెట్లో 4.5 లక్షల ప్యాసింజర్‌ వాహనాలు అమ్ముడయ్యాయి. గతేడాది(2025) ఇదే నెల అమ్ముడైన 3.54 లక్షల ప్యాసింజర్‌ వాహనాలతో పోలిస్తే ఇవి 27% అధికంగా ఉన్నాయి. జీఎస్‌టీ 2.0 అమలుతో నెలకొన్న సానుకూల పరిస్థితులు, ఆర్‌బీఐ రెపో రేట్ల తగ్గింపు, ఆదాయ పన్ను రాయితీ అంశాలతో వాహన పరిశ్రమకు ప్రయోజనం చేకూరిందని మారుతీ సుజుకీ ఇండియా సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ పార్థో బెనర్జీ తెలిపారు. 

→ మారుతీ సుజుకీ దేశీయ అమ్మకాల్లో సరికొత్త రికార్డు సృష్టించింది. గతేడాది డిసెంబర్‌ నాటి 1,82,165 యూనిట్ల గరిష్ట స్థాయి అధిగమిస్తూ.. ఈ ఏప్రిల్‌లో 1,91,122 వాహనాలను విక్రయించింది. గత ఏప్రిల్‌తో (1,42,053 యూనిట్లు) పోలిస్తే వృద్ధి 34.54 శాతంగా నమోదైంది. ప్రస్తుతం మారుతీ వద్ద 1.65 లక్షల బుకింగ్స్‌ పెండింగ్‌లో ఉన్నాయి.  

→ మహీంద్రా అండ్‌ మహీంద్రా(ఎం అండ్‌ ఎం) ఏప్రిల్‌లో దేశీయంగా 56,331 యూనిట్లను విక్రయించింది. గతేడాది ఇదే నెలలో అమ్మిన 52,330 వాహనాలతో పోలిస్తే ఇవి 8% అధికంగా ఉన్నాయి. కొత్త ఆర్థిక సంవత్సరం (2026–27) ‘సానుకూల దృక్పథం’తో ప్రారంభమైందని సంస్థ ఆటోమోటివ్‌ విభాగం సీఈఓ నళినీకాంత్‌ గొల్లగుంట తెలిపారు. 

→ టాటా మోటార్స్‌ ప్యాసింజర్‌ వెహికల్స్‌(టీఎంపీవీ) అమ్మకాలు వార్షిక ప్రాతిపదికన 30.5% పెరిగి 45,199 నుంచి 59,000 యూనిట్లకు చేరాయి. 

→ ప్రభుత్వ పాలసీ మద్దతుతో హ్యుందాయ్‌ మోటార్‌ ఇండియా సరికొత్త రికార్డు సృష్టించింది. ఏప్రిల్‌ 2026లో 17% వార్షిక వృద్ధితో దేశీయంగా 51,902 యూనిట్ల 
విక్రయాలు జరిపింది. సంస్థ ప్రారంభమైనప్పటి నుంచి ఏప్రిల్‌ నెలలో నమోదైన అత్యధిక అమ్మకాలు ఇవే.  

→ కియా ఇండియా ఏప్రిల్‌లో 16% వృద్ధితో అదరగొట్టింది. గతేడాది ఏప్రిల్‌లో 23,623 యూనిట్లు అమ్ముడవగా.. ఈసారి 27,286 వాహనాలతో సంస్థ చరిత్రలోనే అత్యధిక ఏప్రిల్‌ విక్రయాలను నమోదు చేసింది.

→ టయోటా కిర్లోస్కర్‌ మోటార్‌ 21 శాతం వృద్ధితో సత్తా చాటింది. గతేడాది ఏప్రిల్‌లో 24,833 యూనిట్లు అమ్ముడవగా, ఈసారి ఆ సంఖ్య 30,159కి చేరింది. 

→ జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్‌ ఇండియా ఈ ఏప్రిల్‌లో 3 శాతం వృద్ధితో 6,018 వాహనాలను డీలర్లకు పంపింది. 

→ రెనో ఇండియా అమ్మకాల్లో ఏకంగా రెండింతల వృద్ధిని నమోదు చేసింది. గతేడాది 2,602 యూనిట్లు అమ్ముడవగా, ఈసారి ఆ సంఖ్య 5,413కి చేరింది. 

→ నిస్సాన్‌ మోటార్‌ ఇండియా దేశీయ విక్రయాలు 3,203 యూనిట్లుగా నమోదయ్యాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement