‘గాంధీ’ వైద్యుల ప్రాంతీయ విభేదాలు
* కమలనాథన్ కమిటీ దిష్టిబొమ్మ దహనం చేసిన టీజీజీడీఏ
హైదరాబాద్: సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో విధులు నిర్వహిస్తున్న వైద్యుల మధ్య ప్రాంతీయ విభేదాలు భగ్గుమన్నాయి. సీమాంధ్ర వైద్యుడు తమపై దాడికి యత్నించాడంటూ తెలంగాణ వైద్యులు నిరసన వ్యక్తం చేశారు. సీమాంధ్రులకు అనుకూలంగా సిఫారసు చేసిందని ఆరోపిస్తూ కమలనాథన్ కమిటీ దిష్టిబొమ్మను దహనం చేశారు. గాంధీ మెడికల్ కళాశాల, ఆస్పత్రుల్లో సుమారు 300 మంది వైద్యులు విధులు నిర్వహిస్తుండగా, వీరిలో 60 శాతం మంది సీమాంధ్రులు. సీమాంధ్ర డాక్టర్లకు హెచ్చరిక అంటూ టీజీజీడీఏ గాంధీ యూనిట్ ఆస్పత్రి, కళాశాల ప్రాంగణాల్లో సోమవారం వాల్‌పోస్టర్లు ఏర్పాటు చేశారు.
ఈ విషయంపై సీమాంధ్ర ప్రాంతానికి చెందిన అనస్తీషియా వైద్యుడు భీమేశ్ మంగళవారం టీజీజీడీఏ గాంధీ శాఖ కార్యదర్శి సిద్ధిపేట రమేష్‌ను కలిశారు. తప్పుడు సమాచారం ఇచ్చిన వారిపై చర్యలు తీసుకోవాలి కానీ సీమాంధ్ర వైద్యులకు హెచ్చరిక అంటూ పోస్టర్లు వేయడం తగదని అన్నారు. దీంతో ఇరువురి మధ్య వాగ్వాదం జరిగి, ఉద్రిక్తత చోటుచేసుకుంది. జరిగిన ఘటనకు నిరసనగా టీజీజీడీఏ వైద్యుల సంఘం ప్రతినిధులు ఆస్పత్రి ఎదుట ఆందోళన చేపట్టారు. భీమేశ్‌పై తక్షణమే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ ఆస్పత్రి సూపరింటెండెంట్‌కు లిఖితపూర్వక ఫిర్యాదు చేశారు. తెలంగాణ డీఎంఈని కలసి వినతిపత్రం అందించినట్లు వారు తెలిపారు.
కమలాంధ్ర కమిటీ: టీజీజీడీఏ
కమలనాథన్ కమిటీని కమలాంధ్ర కమిటీగా టీజీజీడీఏ ప్రతినిధులు అభివర్ణించారు. జరిగిన ఘటనకు నిరసనగా ఆస్పత్రి ఎదుట ఆందోళన నిర్వహించి, కమలనాథన్ కమిటీ దిష్టిబొమ్మను దహనం చేశారు. అనంతరం పలువురు మాట్లాడుతూ కమలనాథన్ కమిటీ కుట్రపూరితంగా వ్యవహరిస్తోందన్నారు. సీమాంధ్ర ఉద్యోగులను తెలంగాణ నుంచి పంపేయాలన్నారు.
నాపై దాడికి యత్నించారు: రమేష్
గాంధీ ఆస్పత్రిలో కొంతమంది సీమాంధ్ర వైద్యులు మంగళవారం ఉదయం తనపై దాడి చేసేందుకు యత్నించారని సిద్ధిపేట రమేష్ ఆరోపించారు. సీమాంధ్ర వైద్యుడు భీమేశ్‌పై తగిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
భుజంపై చెయ్యివేసి మాట్లాడా: భీమేశ్
తాను ఎవరిపైనా దాడికి యత్నించలేదని డాక్టర్ భీమేశ్ అన్నారు. సిద్ధిపేట రమేష్ తన మిత్రుడని, ఆ చనువుతో అతని భుజంపై చేయివేసి వాల్‌పోస్టర్ల గురించి మాట్లాడానని అన్నారు.