breaking news
doctors careless
-
వైద్యశాఖకు డిప్యూటేషన్ల జబ్బు
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: పెద్దపల్లి జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ పరిధిలో ఇష్టారాజ్యపు పాలన సాగుతోంది. గ్రామాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో రోగులకు సరిపడా వైద్యులు, నర్సులను ప్రభుత్వమే మంజూరు చేయకపోగా, ఉన్నవారిని కోరుకున్న చోటుకు పంపించే బృహత్తర కార్యక్రమం ఇక్కడ యథేచ్ఛగా సాగుతోంది. ఇక్కడ వైద్యాధికారికి క్యాంప్ క్లర్క్‌గా పనిచేసే ఓ కాంట్రాక్టు ఉద్యోగి డాక్టర్లు, స్టాఫ్‌నర్సుల తలరాతలు రాసే పరిస్థితి నెలకొంది. ఎప్పుడు ఏ డాక్టరు లేదా నర్సు, ఇతర స్టాఫ్‌లో ఎక్కడికి డిప్యూటేషన్ మీద వెళ్తారో తెలియని పరిస్థితి పెద్దపల్లి డీఎంహెచ్‌వో పరిధిలో నెలకొంది. ఇటీవలి కాలంలో డిప్యూటేషన్ల పేరిట స్టాఫ్‌నర్సులు, ఇతర స్టాఫ్ కోరుకున్న చోటుకు వెళ్లిపోతుండడంతో డాక్టర్లకు ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో డాక్టర్ల సంఘం ఏకంగా జిల్లా కలెక్టర్‌కే ఫిర్యాదు చేయడంతో తంతు వెలుగులోకి వచ్చింది. బేరాలు మాట్లాడుకొని స్టాఫ్‌నర్సులను కోరుకున్న చోటకు పంపేలా వైద్యాధికారి సీసీ కీలక పాత్ర పోషిస్తున్న తీరును వారు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. సీనియర్ అసిస్టెంట్ లేదా జూనియర్ అసిస్టెంట్ వంటి మినిస్టీరియల్ స్టాఫ్‌ను మాత్రమే వైద్యాధికారికి సీసీగా కొనసాగాలనే నిబంధనలను కూడా పక్కనబెట్టి కొత్త జిల్లాలు ఏర్పాటైన నాటినుంచి కమాన్‌పూర్‌లో హెల్త్ అసిస్టెంట్‌గా పనిచేసే కాంట్రాక్టు ఉద్యోగిని సీసీగా కొనసాగిస్తుండడం అనుమానాలకు తావిస్తోంది. కాగా వైద్యులు, ఉద్యోగుల ఫిర్యాదుల నేపథ్యంలో శుక్రవారం వైద్య, ఆరోగ్య శాఖ కమిషనర్ యోగితా రాణా పెద్దపల్లికి రానుండడం గమనార్హం. ఇదీ అడ్డగోలు డిప్యూటేషన్ల తీరు.. పెద్దపల్లి జిల్లాలో 15 పీహెచ్‌సీలు, 6 అర్బన్ హెల్త్ సెంటర్లతోపాటు సుల్తానాబాద్‌లోని 30 పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్ జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ నేతృత్వంలో కొనసాగుతాయి. జిల్లాలోని వైద్య అవసరాలను బట్టి స్టాఫ్‌నర్సులను, ఇతర సిబ్బందిని డిప్యూటేషన్ మీద మార్పులు, చేర్పులు చేసే అధికారం వైద్యాధికారికి ఉంటుంది. వైద్యాధికారి వద్ద పనిచేసే సీసీ సిఫారసులు పెరగడం, ఇతరత్రా కారణాలతో ఇటీవలి కాలంలో అవసరం ఉన్నా, లేకపోయినా ఇష్టారాజ్యంగా డిప్యూటేషన్లు జరిగినట్లు వైద్యులు వాపోతున్నారు. సుల్తానాబాద్ సివిల్ ఆసుపత్రిలో పని చేస్తున్న నలుగురు స్టాఫ్‌నర్సులను బేగంపేట్–2, రాఘవపూర్–1, రాగినేడు–1, ఎలిగేడు–1 పీహెచ్‌సీలకు పంపించారు. జూలపల్లి–1 స్టాఫ్‌నర్సును ఏకంగా కరీంనగర్ నర్సింగ్ కళాశాలకు డిప్యూటేషన్ మీద పంపించడం వెనుక బలమైన కారణాలు ఉన్నాయని సమాచారం. జిల్లాలో పనిచేస్తున్న ముగ్గురు స్టాఫ్‌నర్సులను కరీంనగర్ నర్సింగ్ కళాశాలకు పంపించడం వెనుక భారీగా చేతులు మారినట్లు ఆరోపణలున్నాయి. అలాగే జిల్లా వైద్యాధికారి కార్యాలయంలో పనిచేస్తున్న ముగ్గురు సూపర్వైజర్లను రామగుండం కార్పొరేషన్‌కు డిప్యూటేషన్‌కు లక్షల రూపాయల లావాదేవీలు నడిచినట్లు సమాచారం. వారి స్థానంలో వివిధ పీహెచ్‌సీల నుంచి సిబ్బందిని డిప్యూటేషన్‌పై జిల్లా వైద్యాధికారి కార్యాలయంలో విధులు నిర్వర్తిస్తున్నారు. కూనారం, బేగంపేట కొత్త పీహెచ్‌సీలు కాగా, ఇక్కడ ఏఎన్ఎంలతో సేవలు అందిస్తే సరిపోతుంది. కానీ స్టాఫ్‌నర్సులను అక్కడికి పంపించడం వల్ల సుల్తానాబాద్ వంటి చోట ఇబ్బంది ఎదురవుతోంది. ఎలిగేడు, రాగినేడుకు స్టాఫ్‌నర్సుల మంజూరు లేకపోయినా, అక్కడికి పంపించారు. టీబీ హాస్పిటల్లో పనిచేసే ఓ నర్సును కూడా కరీంనగర్ నర్సింగ్ కాలేజీకి పంపడం వెనుక కూడా అక్రమాలు చోటు చేసుకున్నట్లు సిబ్బంది ఆరోపిస్తున్నారు. డాక్టర్లకు సైతం డిప్యూటేషనే స్టాఫ్నర్సులనే కాకుండా డాక్టర్లను సైతం డిప్యూటేషన్ మీద జిల్లాలో ఇష్టమున్న చోటికి పంపిస్తుండడం జరుగుతోంది. బసంత్‌నగర్‌లో పనిచేసే ఇద్దరు డాక్టర్లను పెద్దపల్లికి, గర్రెపల్లి పీహెచ్సీ నుంచి బసంత్‌నగర్‌కు, గర్రెపల్లి లేడీ డాక్టర్లు ఇద్దరిని డిప్యూటేషన్‌పై బేగంపేట్‌కు, బేగంపేట్‌లో పనిచేస్తున్న ఓ డాక్టర్‌ను గర్రెపల్లికి డిప్యూటేషన్ వేశారు. అంతతో ఆగకుండా 104 సిబ్బందిని జిల్లా వైద్యాధికారి కార్యాలయానికి డిప్యూటేషన్ మీద రప్పించుకొని, అందులో పనిచేస్తున్న 4వ తరగతి సిబ్బందిని వివిధ పీహెచ్‌సీలు, యూపిహెచ్సి, వివిధ శాఖలకు పంపించినట్లు ఆరోపణ వెల్లువెత్తుతున్నాయి. నేడు పెద్దపల్లి జిల్లాకు కమిషనర్ రాక ఈ నెల 3న వైద్యారోగ్య శాఖ కమిషనర్ యోగితారాణా పెద్దపల్లి జిల్లాకు రానున్నారు. జిల్లాలోని వైద్య, ఆరోగ్య శాఖ పనితీరు, ప్రజలకు అందిస్తున్న సేవలకు సంబంధించి ఆమె ఫీల్డ్ విజిట్ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో జిల్లాలో చోటు చేసుకున్న డిప్యూటేషన్లు, అవినీతి అక్రమాలు, నిబంధనలకు విరుద్ధంగా నియామకాలు తదితర అంశాలను ఉద్యోగులు ఆమె దృష్టికి తీసుకు వెళ్లనున్నట్లు తెలిసింది. -
వైద్యం అందక గర్భిణి మృతి
బెజ్జూర్ (ఆదిలాబాద్): రెండ్రోజుల క్రితం వైద్యం అందక సులుగుపెల్లి గ్రామానికి చెందిన సరిత మృతి చెందిన ఘటన మరువక ముందే మరో నిండు గర్భిణి ప్రాణాలు గాల్లో కలిశాయి. బెజ్జూర్ మండలం ఎల్కపెల్లి గ్రామానికి చెందిన నిండు గర్భిణి ఫర్జాన బేగం(28) సకాలంలో వైద్యం అందక సోమవారం మృతి చెందింది. పురిటి నొప్పులతో బాధపడుతున్న పార్జన బేగంను కుటుంబీకులు ఆదివారం రాత్రి మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లారు. అక్కడి సిబ్బంది పరీక్షించారు. బ్లీడింగ్ అవుతోందని, సమయానికి డాక్టర్ అందుబాటులో లేడని సిర్పుర్(టి) ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లమని కుటుంబీకులకు చెప్పారు. దీంతో కుటుంబీకులు ప్రభుత్వ వాహనంలో సిర్పూర్ ఆసుపత్రిలో తీసకెళ్లారు. అక్కడి వైద్యులు రక్తం మడుగులో ఉన్న గర్భిణిని పరీక్షించి.. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లమని చెప్పారు. వెంటనే వారు మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా అక్కడి వైద్యులు సైతం తమతో కాదని కరీంనగర్ కు తీసుకెళ్లాలని చెప్పి చేతులు దులుపుకున్నారు. అంతలోనే ఆరోగ్య పరిస్థితి విషమించి ఫర్జాన బేగం మృతి చెందిది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సరైన వైద్యం అందితే ఫర్జాన బతికేదని కుటుంబీకులు ఆవేదన వ్యక్తం చేశారు.