breaking news
DN reddy
-
అర్హత కంటే నైపుణ్యం ముఖ్యం
ఏఎన్‌యూ: ఉపాధి అవకాశాలు పొందడానికి, సంపూర్ణ జ్ఞానాన్ని సంపాదించడానికి విద్యార్హతల కన్నా నైపుణ్యం లక్షణాలు ముఖ్యమని డీఆర్డీఓ, ఆర్ఏసీ చైర్మన్ ఆచార్య డీఎన్ రెడ్డి అన్నారు. ఇంజినీరింగ్ విద్యార్థుల్లో నైపుణ్యాన్ని ప్రదర్శించేందుకు యూనివర్సిటీ ఇంజినీరింగ్ కళాశాల ఆధ్వర్యంలో యూనివర్సిటీలో నిర్వహించిన అనుశోధన (నేషనల్ లెవల్ స్టూడెంట్ టెక్నికల్ సింపోజియం)ను గురువారం ఆయన ప్రారంభించారు. ప్రారంభోత్సవ సభలో డీన్ రెడ్డి మాట్లాడుతూ భారతదేశంలో అర్హత కలిగిన వారు అధికంగా ఉన్నారు కానీ నైపుణ్యం ఉన్న వారు చాలా తక్కువ సంఖ్యలో ఉన్నారన్నారు. భారతదేశంలో నైపుణ ్యవంతులు 20 శాతం లోపు ఉంటే సింగపూర్, మలేషియాల్లో 80 శాతం ఉన్నారని తెలిపారు. విద్యార్థులు పుస్తకాలతోపాటు సమాజాన్ని కూడా అధ్యయనం చేయాలన్నారు. అందుబాటులో ఉన్న శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకొని అభివృద్ది చెందాలని సూచించారు. వీసీ ఆచార్య కె.వియ్యన్నారావు మాట్లాడుతూ విద్యార్థుల్లో దాగి ఉన్న నైపుణ్యాన్ని పెంపొందించేందుకు అనుశోధన వంటి కార్యక్రమాలు దోహదం చేస్తాయన్నారు. ఆచార్య కేఆర్ఎస్ సాంబశివరావు, రిజిస్ట్రార్ ఆచార్య పి.రాజశేఖర్, ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ పి.సిద్దయ్య, డీన్ ఇ. శ్రీనివాసరెడ్డి, ఇస్రో శాస్త్రవేత్త జగన్నాధదాస్, అనుశోధన కన్వీనర్ ఆచార్య పీవీ రమణారావు ప్రసంగించారు. అనంతరం అనుశోధన సీడీని ఆచార్య డీఎన్ రెడ్డి ఆవిష్కరించారు. వివిధ ఇంజినీరింగ్ కళాశాలలకు చెందిన వెయ్యిమందికి పైగా విద్యార్థులు కార్యక్రమంలో పాల్గొని టెక్నికల్, పోస్టర్ ప్రెజెంటేషన్, ప్రాజెక్ట్ ఎక్స్పో అంశాల్లో ప్రదర్శనలు చేశారు. ఉత్తమ ప్రదర్శనలకు సాయంత్రం జరిగిన ముగింపు సభలో బహుమతులు అందజేశారు. -
వర్సిటీల్లో మానవ వనరుల కొరత
హైదరాబాద్, న్యూస్‌లైన్: ఇతర దేశాల్లో ఉన్న తెలుగువారికి దూరవిద్యను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు డా. బీఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం ఆన్లైన్ కేంద్రాలను ఏర్పాటు చేస్తే ఉపయోగకరంగా ఉంటాయని డీఆర్డీఓ ఆర్ఏసీ చైర్మన్, యూజీసీ సభ్యుడు ప్రొఫెసర్ డీఎన్ రెడ్డి సూచించారు. సోమవారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం 31వ వ్యవస్థాపక దినోత్సవంసందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉపన్యాసం ఇస్తూ, దేశంలోని ప్రముఖ విశ్వవిద్యాలయాల్లో సైతం మానవ వనరుల కొరత తీవ్రంగా ఉందని చెప్పారు. ఫలితంగా విశ్వవిద్యాలయాల్లో నైపుణ్యమైన శిక్షణ తగ్గుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. మన దేశంలో పరిశోధనలకు కొదవ లేదని, ఏ దేశంతో పోల్చినా పీహెచ్డీ పూర్తి చేసినవారు ఇక్కడే ఎక్కువగా ఉన్నారని చెప్పారు. అయితే వారిలో సాంకేతిక, పారిశ్రామిక నైపుణ్యాలు చాలా తక్కువగా ఉంటున్నాయని అభిప్రాయపడ్డారు. అంబేద్కర్ వర్సిటీ ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రవేశాలనూ ఆన్లైన్లో నిర్వహించడం సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడమేనని అన్నారు. అంతకుముందు వర్సిటీలో నిర్మించతలపెట్టిన పరీక్షల విభాగం, సీఎస్టీడీ భవన నిర్మాణాలకు ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి అజయ్‌మిశ్రా భూమిపూజ చేశారు. వైస్ చాన్సలర్ డాక్టర్ పి.ప్రకాశ్, అకాడమిక్ డెరైక్టర్ ప్రొఫెసర్ ఎన్.వెంకటనారాయణ, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎ.సుధాకర్ పాల్గొన్నారు.