breaking news
diwakar naidu
-
దివాకర్ నాయుడుకు యావజ్జీవం
ఆదోని: ఫ్యాక్షనిస్టు, తెలుగుదేశం నాయకుడు, మాజీ జెడ్పీటీసీ కప్పట్రాల వెంకటప్ప నాయుడు హత్య కేసులో 4వ నిందితుడిగా ఉన్న కప్పట్రాల సర్పంచ్ మాదాపురం దివాకర్ నాయుడుకు యావజ్జీవ శిక్ష, రూ.మూడు వేలు జరిమానా విదిస్తూ ఆదోని రెండో జిల్లా అదనపు సెషన్స్ కోర్టు న్యాయమూర్తి సుబ్రమణ్యం సోమవారం తీర్పు వెల్లడించారు. కోర్టులో జడ్జ్ తీర్పును వెల్లడిస్తుండగా బయట తీవ్ర ఉద్రిక్తత కనిపించింది. పత్తికొండ సీఐ గంట సుబ్బారావు ఆధ్వర్యంలో ఎస్ఐలు సిబ్బంది కోర్టు వద్ద భారీ బందోబస్తు నిర్వహించారు. దివాకర్ నాయుడు తల్లి రాములమ్మ, బంధువులు పెద్దఎత్తున కోర్టు వద్దకు తరలివచ్చారు. ఉదయం 11 గంటల సమయంలో జడ్జి తీర్పు వెల్లడించగానే బోనులో ఉన్న దివాకర్‌నాయుడు ముఖంలో ఆవేదన కనిపించింది. బయట ఉన్న తల్లి రాములమ్మ గుండెలు బాదుకుంటూ విలపించింది. తీర్పు పూర్తి కాగానే దివాకర్ నాయుడును భారీ బందోబస్తు మధ్య పోలీసులు స్థానిక సబ్ జైలుకు తరలించారు. ఈ తీర్పుతో వెంకటప్పనాయుడు హత్య కేసులో యావజ్జీవ శిక్ష పడిన వారి సంఖ్య 18కి చేరింది. ఘటన..కేసు: 2008 మే 17న దేవనకొండ మండలం మాచాపురం బస్సు స్టాపు వద్ద కప్పట్రాల వెంకటప్ప నాయుడుతో సహా మొత్తం 10 మంది దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ సంఘటనకు సంబంధించి దేవనకొండ పోలీసులు మొత్తం 48 మందిపై కేసు నమోదు చేశారు. ఇందులో కాంగ్రెస్ ముఖ్య నాయకులు చెరుకులపాడు నారాయణ రెడ్డి, చక్రపాణి రెడ్డి కూడా ఉన్నారు. దాదాపు ఆరేళ్లపాటు కోర్టులో విచారణ కొనసాగింది. విచారణ కొనసాగుతుండగానే నలుగురు నిందితులు మృతి చెందారు. కోర్టులో నేరం రుజువు కావడంతో మొత్తం నిందితులలో 17 మందికి గత నెల 10వ తేదీన యావజ్జీవ శిక్ష విధిస్తూ ఆదోని జిల్లా రెండో అదనపు సెషన్స్ కోర్టు అదనపు న్యాయమూర్తి సుబ్రమణ్యం తీర్పు చెప్పారు. తీర్పు రోజు దివాకర్ నాయుడు కోర్టుకు హాజరు కాలేదు. అజ్ఞాతంలోకి వెళ్లిన దివాకర్‌నాయుడుపై తీర్పును న్యాయమూర్తి వాయిదా వేశారు. కాంగ్రెస్ ప్రముఖులు చెరుకులపాడు నారాయణ రెడ్డి, చక్రపాణి రెడ్డితో సహా మొత్తం 26 మందిని కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. మగ దిక్కును కోల్పోయిన దివాకర్ కుటుంబం ఫ్యాక్షన్ భూతం దివాకర్ నాయుడు కుటుంబంలో మగ దిక్కు లేకుండా చేసింది. దివాకర్‌నాయుడు తండ్రి రంగప్పనాయుడు గతంలో ఫ్యాక్షన్‌లో ప్రాణం పోగొట్టుకున్నాడు. ఇప్పుడు కప్పట్రాళ్ల హత్య కేసులో శిక్ష పడిన మొత్తం 18 మందిలో ముగ్గురు దివాకర్ నాయుడు సోదరులే. వారు మద్దిలేటి నాయుడు, యోగేష్ నాయుడు, పురుషోత్తమ నాయుడు. వీరు ఇప్పటికే సెంట్రల్ జైలుకు వెళ్లగా సోమవారం తీర్పుతో దివాకర్ నాయుడు కూడా ఇంటికి దూరం అయ్యాడు. మద్దిలేటి నాయుడు, పురుషోత్తమ నాయుడుకు మాత్రం పెళ్లిళ్లు అయ్యాయి. ఎలా బతికేది?: భర్త రంగప్ప నాయుడు ఫ్యాక్షన్‌కు బలి కావడం, నలుగురు కొడుకులు జైలు పాలు కావడంతో తల్లి రాములమ్మ కన్నీళ్ల పర్యంతమైంది. ఇద్దరు కోడళ్లతో తాను ఎలా బతుకాలంటూ బోరున విలపించింది. తనను కలిసిన విలేకరులతో మాట్లాడారు. ఇప్పటికే ప్రత్యేర్థులు తమ పొలంలో ఉన్న వ్యవసాయ పంపింగ్ మోటారును ఎత్తుకు వెళ్లారని, ఇంటి వద్ద ఉన్న ట్రాక్టరును కాల్చి వేశారని, ఇక తమను బతకనిస్తారన్న నమ్మకం లేదని గుండెలవిసేలా రోదించారు. వెంకటప్పనాయుడు హత్య కేసుతో తన కొడుకులకు సంబంధం లేదని, రాజకీయాల వల్ల జైలుకెళ్లాల్సి వచ్చిందని పేర్కొన్నారు. న్యాయం కోసం తాను హైకోర్టుకు వెళుతానని తెలిపారు. -
'కప్పట్రాళ్ల' హత్యకేసులో ప్రధాన నిందితుడి అరెస్ట్
-
'మమ్మల్ని పరారీలో ఉండమంది రాజకీయ నేతలే'
కర్నూలు : కప్పట్రాళ్ల వెంకటప్ప నాయుడు హత్యకేసులో నిందితుడు దివాకర్ నాయుడును పోలీసులు బుధవారం మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ హత్య కేసులో డిసెంబర్ 10న 21మందికి శిక్ష విధిస్తూ ఆదోని కోర్టు తీర్పు వెల్లడించిన విషయం తెలిసిందే. తీర్పు సమయంలో దివాకర్ నాయుడు కోర్టుకు హాజరు కాలేదని, దాంతో అతనిపై నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ చేసినట్లు పోలీసులు తెలిపారు. మూడు బృందాలుగా ఏర్పడి దివాకర్ నాయుడిని కర్ణాటకలో అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు. కాగా రాజకీయ నేతలు తమని పావులుగా వాడుకున్నారని దివాకర్ నాయుడు ఆరోపించారు. 'మమ్మల్ని పరారీలో ఉండమని చెప్పింది రాజకీయ నేతలే అని, రాజకీయ నేతల కుట్రలకు మేం బలయ్యామని' ఆయన అన్నారు. 2008, మే 17న కప్పట్రాళ్ల వెంకటప్పనాయుడు వాహనాన్ని ప్రత్యర్థులు లారీతో ఢీ కొట్టి, అనంతరం ప్రత్యర్థులు బాంబులతో దాడి చేసి హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ దాడిలో కప్పట్రాళ్లతోపాటు ఆయన అనుచరులు 10 మంది మరణించారు. -
'కప్పట్రాళ్ల' హత్యకేసులో ప్రధాన నిందితుడి అరెస్ట్
కర్నూలు : కప్పట్రాళ్ల వెంకటప్పనాయుడు హత్య కేసులో ప్రధాన నిందితుడు దివాకర్ నాయుడును పోలీసులు అరెస్ట్ చేశారు. కర్ణాటక హుబ్లీ రైల్వే స్టేషన్లో అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా కప్పట్రాళ్ల వెంకటప్పనాయుడు హత్య కేసులో 21 మందికి జీవిత ఖైదు విధిస్తూ ఆదోని సెషన్స్ కోర్టు న్యాయమూర్తి ఇటీవల తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. ఈ హత్య కేసులో 48 మందిపై పోలీసులు కేసు నమోదు చేయగా... 21 మందికి జీవిత ఖైదు విధించారు. అయితే కోర్టు తీర్పు ముందే దివాకర్ నాయుడు పరారీలో ఉన్నాడు. అతడు తన భార్యతో రైల్వే స్టేషన్లో ఉండగా, ఫోన్ కాల్స్ ఆధారంగా పోలీసులు ఆచూకీ తెలుసుకున్నట్లు సమాచారం. కాగా 2008, మే 17నే కప్పట్రాళ్ల నుంచి వెంకటప్పనాయుడు ఆయన అనుచరులు వాహనంలో కోడుమూరుకు బయలుదేరారు. ఆయన్ని హత్య చేయాలని పథకం పన్ని న ప్రత్యర్థులు ముందుగానే మాచాపురం వద్ద మాటు వేశారు. అటుగా వస్తున్న కప్పట్రాళ్ల వెంకటప్పనాయుడు వాహనాన్ని లారీతో ఢీ కొట్టారు. అనంతరం ప్రత్యర్థులు బాంబులతో దాడి చేసి హత్య చేశారు. ఈ దాడిలో కప్పట్రాళ్లతోపాటు ఆయన అనుచరులు 10 మంది మరణించారు.