breaking news
divyadarshanam
-
విజయనగరం భక్తులకు సత్యదేవుని ‘దివ్యదర్శనం ’
అన్నవరం: హిందూ నిరుపేద భక్తులను ప్రముఖ పుణ్యక్షేత్రాలకు ఉచితంగా తీసుకువెళ్లి ఆయా దేవతామూర్తుల దర్శనం చేయించి స్వగృహాలకు చేర్చే ‘దివ్యదర్శనం’ పథకం రెండు నెలలుగా రాష్ట్రప్రభుత్వం అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ పథకంలో ఐదో విడతగా విజయనగరం జిల్లాకు చెందిన 200 మంది భక్తులు మంగళవారం సాయంత్రం రత్నగిరిపై సత్యదేవుని దర్శించుకొని పూజలు చేశారు. నాలుగు బస్సులలో వీరు సాయంత్రం ఐదు గంటలకు సత్యదేవుని ఆలయం వద్దకు చేరుకున్నారు. అక్కడ పండితులు వారికి సాదరంగా స్వాగతం పలికి స్వామివారి దర్శనానికి తీసుకువెళ్లారు. స్వామి దర్శనం అనంతరం అనివేటి మండపంలో వేదపండితులు వారికి వేదాశీస్సులు, స్వామివారి ప్రసాదాలను అందజేశారు. అనంతరం వారు విజయవాడ వెళ్లారు. -
మల్లన్న సేవలో దివ్యదర్శనం భక్తులు
శ్రీశైలం: ఏపీ దేవాదాయశాఖ నిర్వహిస్తున్న ‘దివ్యదర్శనం’లో భాగంగా కర్నూలు కు చెందిన 100 మందితో కూడిన భక్త బృందం గురువారం శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామివార్లను దర్శించుకున్నారు. ప్రధానాలయ గోపురం వద్ద జేఈఓ హరినాథ్‌రెడ్డి వీరికి ఆహ్వానం పలికారు. స్వామిఅమ్మవార్లను దర్శించుకున్న భక్త బృందానికి అమ్మవారి ఆలయప్రాంగణంలో వేద పండితులు ఆశీర్వచనాలు పలుకగా, అధికారులు స్వామిఅమ్మవార్ల శేషవస్త్రాలు, స్వామివార్ల ప్రసాదాలు, దివ్యపరిమళ విభూతి, శ్రీచక్ర పూజాకుంకుమ, కైలాస కంకణాలు, శ్రీశైల స్థలపురాణం పుస్తకం అందజేశారు. ఈ సందర్భంగా జేఈఓ మాట్లాడుతూ పేద హిందూ భక్తులు ఆయా క్షేత్రాలను ఉచితంగా దర్శించుకునేందుకు వీలుగా రాష్ట్ర దేవాదాయశాఖ ఈ ధార్మికత యాత్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తుందన్నారు. కర్నూలు నుంచి బయలు దేరిన ఈ భక్తబృందం ఒంటిమిట్ట, తిరుపతి, జొన్నవాడ, విజయవాడ, పెద్దకాకాని తదితర క్షేత్రాలను దర్శించుకుని గురువారం శ్రీశైల మహాక్షేత్రానికి చేరుకోవడంతో దివ్యదర్శన యాత్ర ముగుస్తుందని పేర్కొన్నారు. ఈ యాత్ర 4,5 రోజుల పాటు దివ్యదర్శన యాత్ర దేవాదాయశాఖ ఏర్పాటు చేస్తుందన్నారు. యాత్ర బృందంలో 90శాతం ఎస్సీ,ఎస్టీ,బీసీలకు ప్రాధాన్యత కల్పించడం జరుగుతుందన్నారు.