‘పాక్‌ను భారత్ ఆక్రమిస్తుందనుకున్నాం’
న్యూఢిల్లీ: బంగ్లాదేశ్ విభజన తరువాత నాటి భారత ప్రధాని ఇందిరాగాంధీ పశ్చిమ పాకిస్తాన్ పై దాడికి ఆదేశిస్తారని అమెరికా భావించింది. పాక్ ఆక్రమిత కశ్మీర్‌ను స్వాధీనం చేసుకోవడంలో భాగంగా ఈ దాడులు జరుగుతాయని అంచనా వేసినట్టు తాజాగా బహిర్గతమైన అమెరికా నిఘా సంస్థ సీఐఏ పత్రాలు చెబుతున్నాయి. ఒకవేళ భారత్... పశ్చిమ పాకిస్తాన్ సైనిక శక్తిని విధ్వంసం చేస్తే వ్యూహాత్మక చర్యలు తీసుకొనేందుకు అమెరికా సిద్ధమయినట్టు తెలిపాయి.
అప్పటి అమెరికా అధ్యక్షుడు నిక్సన్ జాతీయ భద్రతా సలహాదారు ఇందుకు సాధ్యాసాధ్యాలను పరిశీలించారు. ‘ఇందిర పాకిస్తాన్ ఆయుధ, వాయు దళాలను నాశనం చేయాలని ప్రయత్నిస్తున్నట్టు తెలిసింది’అని నాటి సీఐఏ డైరెక్టర్ రిచర్డ్ హోమ్స్ ఓ సమావేశంలో వెల్లడించారు. ఉద్రిక్తతలను తగ్గించడానికి చైనా, సోవియట్ రష్యా సహాయం తీసుకొనేందుకు సిద్ధపడ్డారు.