వనరుల దోపిడీ కోసమే జిల్లాల విభజన
టీడీపీ రాష్ట్ర కార్యదర్శి సీతక్క
వరంగల్ : అభివృద్ధి పేరుతో రాష్ట్రంలోని వనరులను దోచుకునేందుకే టీఆర్ఎస్ ప్రభుత్వం జిల్లాల విభజన చేపట్టిందని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీతక్క ఆరోపించారు. హన్మకొండ బాలసముద్రంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. గోదావరి జలాలను తన సొంత జిల్లాకు తరలించుకుపోయేందుకు తపాస్‌పల్లి రిజర్వాయర్ ఉన్న చేర్యాలను ఇతర జిల్లాలో చేర్చారని విమర్శించారు. చివరకు మల్లన్న దేవుడిని కూడా వదలడం లేదని మండిపడ్డారు. వనరుల కోసమే ములుగు నియోజకవర్గాన్ని భూపాలపల్లిలో చేర్చారని అన్నారు. కరీంనగర్ జిల్లాకు చెందిన నేతల వ్యాపారాలకు చట్టబద్ధత కల్పించేందుకే తెరపైకి హన్మకొండ జిల్లాను తెచ్చారని ఆమె ఆరోపించారు. ఎన్నికల సందర్భంగా మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను పట్టించుకోని సీఎం కేసీఆర్ జిల్లా విభజన పేరిట కొత్త నాటకం ప్రారంభించారని పార్టీ జిల్లా అధ్యక్షుడు గండ్ర సత్యనారాయణరావు అన్నారు. వరంగల్‌ను విడదీస్తే ^è రిత్రకు బీటలు పెట్టిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. కరీంనగర్‌కు చెందిన నాయకులు కెప్టెన్, ఈటల రాజేందర్‌కు కేసీఆర్ తన జాగీరులా రాసివ్వడాన్ని ప్రజలు ఒప్పుకోరని అన్నారు. హన్మకొండ జిల్లా ఏర్పాటు చేస్తే కలెక్టర్, ఎస్పీ, యూనివర్సిటీలను ఎలా విభజిస్తారని ప్రశ్నించారు. ఉద్యమాల జిల్లాలో మళ్లీ ఉద్యమం చేసి ఈ అక్రమ విభజనను అడ్డుకుంటామని హెచ్చరించారు. అధికారం కోసం మేనిఫెస్టోను అమలు చేయాలంటే రూ.20 లక్షల కోట్లు వ్యయం చేయాల్సి వస్తుందని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈగ మల్లేశం అన్నారు. అన్ని రంగాల్లో టీఆర్ఎస్ ప్రభుత్వంపై అసంతృప్తి రగులుతోందన్నారు. ఇక ప్రభుత్వాన్ని నిలదీసే సమయం ఆసన్నమైందని, జిల్లాల నాటకాలు కట్టిపెట్టి ఇచ్చిన హామీలను అమలు చేయాలని సూచించారు. సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి పుల్లూరు అశోక్‌కుమార్, బుర్రి తిరుపతి, బాబా ఖాదర్అలీ, మార్గం సారంగం, జయపాల్, శ్రీరాముల సురేష్, విజయ్, జాటోతు సంతోష్‌నాయక్, సాంబయ్య, ఈశ్వరాచారి పాల్గొన్నారు.