breaking news
Diseases period
-
వ్యాధుల కాలం.. పశువులు పైలం
గొంతువాపు వ్యాధి వర్షాకాలంలో పశువులకు ప్రధానంగా వచ్చేది గొంతువాపు వ్యాధి. దీనిని గురకవ్యాధి అంటారు. నీరసంగా ఉండే పశువులకు ఈ వ్యాధి త్వరగా సోకుతుంది. పశువు ఆయాస పడుతూ శ్వాస పీలుస్తుంది. గుర్రు గుర్రుమని శబ్దం వస్తుం ది. జ్వర తీవ్రత 104 నుంచి 106 డిగ్రీల వరకు ఉంటుంది. కంటి నుంచి నీరు, నోటి నుంచి చొంగ పడుతుంది. గొంతు పై భాగాన మెడ కింద వాపు వస్తుంది. ఈ వ్యాధి వచ్చిన పశువు 24 గంటల్లో మరణించే అవకాశాలు ఉంటాయి. చికిత్స.. వ్యాధి లక్షణాలు కనిపించిన పశువును వెంటనే మంద నుంచి వేరు చేయాలి. వెంటనే డాక్టర్ సలహా తీసుకోవాలి. వ్యాధి సోకిన పశువుకు వ్యాధి తీవ్రతను బట్టి సల్ఫాడిమిడిన్, ఇంటాసెఫ్‌టాజు, ఎక్సెప్ట్ వంటి ఇంజక్షన్లు ఇవ్వాలి. వ్యాధి ముదిరితే ఏమీ చేయని పరిస్థితి ఉంటుంది. అలాగే ఆరోగ్యంగా ఉన్న పశువుకు బూస్టర్ డోస్ తప్పక వేయించాలి. జబ్బవాపు.. ఈ వ్యాధి క్లాస్ట్రిడియం చొవై అనే బ్యాక్టిరియా ద్వారా పశువులకు సోకుతుంది. ఆరు మాసాల నుంచి రెండేళ్ల లోపు వయసున్న పశువులకు ఎక్కువ సోకుతుంది. ఈ వయసులో పశువుకు రోగ నిరోధక శక్తి చాలా తక్కువగా ఉంటుంది. భుజం, తొడ ప్రాంతాల్లోని కండరాలను ఆశించి, మాంసం కుళ్లిపోయేలా చేస్తుంది. వాపుతో పశువులు కుంటుతాయి. వెనక కాలు కాని ముందు కాలు గాని పైకి లేపి ఉంచి కుంటడం చేస్తాయి. వాపు దగ్గర కరకరమని శబ్దం వస్తుంది. చికిత్స.. వ్యాధి ప్రారంభంలోనే పెన్సిలిన్, ఆక్సివంటి యాంటిబయాటిక్స్ వాడాలి. వాటితో పాటు డెక్ట్రోజ్ నార్మల్ సెలైన్ వాడాలి. వ్యాధిగ్రస్థ పశువుల్ని వేరుచేయాలి, చనిపోయిన పశువును ఉన్నట్లయితే గొయ్యిలో పాతిపెట్టాలి. వ్యాధి రాకుండా వర్షాకాలం ముందే జబ్బవాపు వ్యాధి టీకాలు వేయించాలి. గాలికుంటు వ్యాధి.. గాలికుంటు వ్యాధి సోకిన పశువు చాల బలహీనంగా ఉంటుంది. పాలు ఇచ్చే గేదేలు చాలా నీరసంగా ఉంటాయి. పాల ఉత్పత్తి చాలా తగ్గిపోతుంది. ఎడ్లు వ్యవసాయం పనులు చేయడానికి సాహసించవు. సంకరజాతి పశువులతో పాటు షెడ్లలో పెంచుకొనే పశువులకు ఈ వ్యాధి వ్యాపిస్తుంది. ఎక్కువగా మార్చి, ఏప్రిల్, సెప్టెంబర్, అక్టోబర్ నెలలో ఈ వ్యాధి పశువులకు వచ్చే ప్రమాదం ఉంది. ఈ వ్యాధి సోకిన పశువుకు నోటి గిట్టల మధ్య బొబ్బలు ఏర్పడతాయి. 3, 4 వారాల్లో బొబ్బలు పగిలి పుండ్లుగా మారుతాయి. చర్మం గరుకుగా మారుతుంది. నోటి చిగుళ్లపై పొక్కులు ఏర్పడటం చేత పశువులు మేత, తీసుకోక నీరసించి పోతాయి. నోటి నుంచి సొంగ కారుతుంది. చికిత్స వ్యాధి సోకిన పశువును మంద నుంచి వేరు చేయాలి. నోటిలోని పుండ్లకు బోరిక్ పౌడర్, గ్లిసరిన్ కలిపి పూయాలి. అంతే కాకుండా ముందు జాగ్రత్తగా స్థానిక పశువైద్యాధికారులు జాతీయ గాలికుంటు వ్యాధి నివా రణ పథకం కింద టీకాలు కూడా ఉచితంగా వేస్తున్నారు. గొర్రెల్లో కాలి పుండ్లు.. వర్షాకాలంలో గొర్రెలు బురదలో తిరగడం వల్ల కాలి పుండ్ల వ్యాధి సోకుతుంది. బురదలో తిరిగినప్పుడు గిట్టల మధ్య చర్మం మెత్తబడి, వాచి చిట్లిపోతుంది. చీము పట్టి నొప్పితో ముందు కాళ్లపై గెంటుతుంటాయి. వ్యాధి మరింత జటిలం అయితే గిట్టలూడి పోతాయి. ఈ వ్యాధి సోకిన పశువులకు 10 శాతం మైలతుత్తం, పది శాతం జింక్‌సల్ఫేట్, లేదా ఐదు శాతం ఫార్మలిన్లో ఏదైనా ఒక ఆయింట్మెంట్ పూయాలి. యాంటిబయాటిక్ ఇంజక్షన్లు వరుసగా 3-5 రోజులు వేయించాలి. అంతే కాకుండా గొర్రెలను బురద నేలల్లో ఎక్కువగా తిరగనీయొద్దు. గట్టి నేలల్లో మేపే విధంగా చూడాలి. -
జిల్లాకు ప్రభుత్వ వైద్యకళాశాల
ఖమ్మం వైరారోడ్: జిల్లాలో ప్రభుత్వ వైద్యకళాశాల ఏర్పాటు చేయనున్నట్లు ఉప ముఖ్యమంత్రి డాక్టర్ టి.రాజయ్య ప్రకటించారు. జిల్లా పర్యటనలో భాగంగా స్థానిక మామిళ్లగూడెంలో రూ.20 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన ఆయుర్వేదిక్ పది పడకల ఆస్పత్రిని ఆయన శనివారం ప్రారంభించారు. ఆయుర్వేదిక్ వైద్యశాల మీటింగ్ హాల్, డెంగీ, మలేరియా, చికున్‌గున్యా నివారణకు ఉచిత హోమియో మందులు పంపిణీ చేశారు. సీజనల్ వ్యాధుల నివారణకు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలన్నారు. దోమలు వ్యాప్తి చెందకుండా పరిశుభ్రతపై అధికారులు దృష్టి పెట్టాలని సూచించారు. ఏజెన్సీ ప్రాంతంలో వ్యాధులు ఎక్కువగా ప్రబలే అవకాశం ఉందని, అక్కడి గిరిజనుల్లో వ్యాధులపై అవగాహన కల్పించేందుకు వైద్యులు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. తెలంగాణలో జిల్లాకో వైద్యకళాశాలను ఏర్పాటు చేయాలనే యోచనలో ప్రభుత్వం ఉందన్నారు. తొలిదశలో కరీంనగర్‌తో పాటు జిల్లాలో వైద్యకళాశాల ఏర్పాటు చేస్తామన్నారు. ఈనెల 19న జరిగే సోషల్ ఎకనామిక్ సర్వేకు ప్రతి ఒక్కరూ అందుబాటులో ఉండాలన్నారు. నిజమైన లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు అందించేందుకే సర్వేలు చేపడుతున్నట్లు తెలిపారు. పీహెచ్‌సీల బలోపేతానికి కేంద్రం నుంచి నిధులు తెప్పించేందుకు శాయశక్తులా కృషి చేస్తానని చెప్పారు. అంటువ్యాధుల నివారణకు గ్రామస్థాయిలో సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డు మెంబర్లు, అంగన్వాడీ కార్యకర్తలు, ఐకేపీ, మహిళా సంఘాల ద్వారా ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించారు. డాక్టర్ల సమస్యలేంటో తనకు తెలుసునని, సీనియారిటీ ఉన్నా వేతనం మాత్రం ఆశించిన స్థాయిలో ఉండటం లేదన్నారు. ప్రభుత్వం మాత్రం ఈ సమస్యను తప్పకుండా పరిష్కరిస్తుందని హామీ ఇచ్చారు. డాక్టర్లు రోగుల పట్ల బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. వైద్యవృత్తినే దైవంగా భావిస్తూ సేవా దృక్పథంతో ముందుకు పోవాలని కోరారు. ఆస్పత్రులను పరిశుభ్రంగా ఉంచేందుకు కిందిస్థాయి సిబ్బందిని అప్రమత్తంగా ఉంచాలని ఆదేశించారు. మలేరియా, చికెన్‌గున్యా, డెంగీ, డయేరియా తదితర వ్యాధుల నివారణకు ముందస్తుగా మందులు పంపిణీ చేస్తున్న ఆయుర్వేదిక్ వైద్యులు, మున్సిపల్ నగర పాలక సంస్థ కమిషనర్‌ను అభినందించారు. ఆయుష్ డిపార్ట్మెంట్ను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఎన్ఆర్హెచ్ఎం, కేంద్రం నుంచి రావాల్సిన ఇతర నిధులను తెప్పించి వైద్యసేవల బలోపేతానికి తన వంతు కృషి చేస్తానన్నారు. అంగన్వాడీ సెంటర్లకు డెంగీ, చికెన్‌గున్యా, మలేరియా వ్యాధి నివారణ మెడికల్ కిట్లను అందజేశారు. ఎంబీబీఎస్ రెండో సంవత్సరం చదువుతున్నప్పుడు 1982లో తాను ఖమ్మం ఆస్పత్రికి వచ్చానని, నేడు డిప్యూటీ సీఎం హోదాలో ఇక్కడకు రావడం సంతోషంగా ఉందన్నారు. డాక్టర్లు మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించి రోగులకు సేవలందించాలని కోరారు. వైద్యవృత్తినే దైవంగా భావిస్తూ సేవాదృక్పథంతో ముందుకు సాగాలని తెలిపారు. ఆసుపత్రిని పరిశుభ్రంగా ఉంచేందుకు సిబ్బందిని అప్రమత్తంగా ఉంచాలన్నారు. సిబ్బంది కొరత, ఇతర సమస్యలు ఉంటే కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకోవాలన్నారు. పీహెచ్‌సీలను బలోపేతం చేసి అక్కడ ఆరోగ్యశ్రీ సేవలను తెప్పించేందుకు కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ కె.ఇలంబరితి, డీఎంహెచ్‌వో భానుప్రకాష్, ఆస్పత్రి సూపరింటెండెంట్ లక్ష్మణరావు, డీసీహెచ్ఎస్ ఆనందవాణి, మాజీ ఎమ్మెల్యే చంద్రావతి, టీఆర్ఎస్ ఖమ్మం నియోజకవర్గ ఇన్చార్జి ఆర్జేసీ కృష్ణ, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, ఆర్డీడీ విజయ్‌కుమార్, ఆయుష్ ఏడీ రాజేందర్‌రెడ్డి, ఆయుర్వేదిక్ వైద్యశాల సీనియర్ డాక్టర్ లక్ష్మీ నరసింహరావు పాల్గొన్నారు.