breaking news
dindi projects
-
రెండేళ్లలోగా పూర్తి చేయాలి
సాక్షి, హైదరాబాద్: శ్రీశైలం ఎడమ గట్టు కాల్వ (ఎస్ఎల్బీసీ), డిండి ప్రాజెక్టుల పనులను సత్వరంగా పునరుద్ధరించి, రెండేళ్లలోగా పూర్తి చేయాలని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. గత ప్రభుత్వం ఎస్ఎల్బీసీ ప్రాజెక్టును పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని, కానీ తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్య ప్రాజెక్టుగా తీసుకుందని స్పష్టం చేశారు. యుద్ధప్రాతిపదికన పనులు జరగాలని, ప్రభుత్వం అన్ని రకాలుగా సహకరిస్తుందని తెలిపారు. నల్లగొండ జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితో కలసి గురువారం సచివాలయంలో ఆయన ఎస్ఎల్బీసీ, డిండి ప్రాజెక్టులపై సమీక్ష నిర్వహించారు. ఎస్ఎల్బీసీ ప్రాజెక్టుకు సంబంధించి 44 కిలోమీటర్ల సొరంగ మార్గం పనుల్లో 9 కిలోమీటర్ల మేర తవ్వకం జరగాల్సి ఉందని, రెండు వైపులా నుంచి సొరంగం తవ్వకాల పనులు నిర్వహించాలని ఉత్తమ్ ఆదేశించారు. రెండేళ్లలో ఈ పనులు పూర్తి చేస్తామని నిర్మాణ సంస్థలు అంటున్నాయని, ఆ మేరకు గడువు పెట్టుకుని పనులు చేయాలని సూచించారు. సమస్యలను పరిష్కరించడం, పనులను వేగిరం చేయడానికి అధికారులతో కమిటీ వేయాలని ఆయన నీటిపారుదలశాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జాను కోరారు. అలాగే 95% పూర్తయిన డిండి ప్రాజెక్టుతో పాటు పెండ్లి పాకాల జలాశయం పనులను వెంటనే పూర్తి చేయాలన్నారు. భూసేకరణకు రూ.90 కోట్లు కేటాయిస్తామని చెప్పారు. కొత్త ఆయకట్టుకు నీరిచ్చే పనులను సత్వరం పూర్తి చేయాలన్నారు. సమీక్షలో ఎమ్మెల్యేలు రాజగోపాల్ రెడ్డి, బాలు నాయక్, జైవీర్ రెడ్డి, బి.లక్ష్మారెడ్డి, వేముల వీరేశం, ఈఎన్సీ(జనరల్) జి.అనిల్‌కుమార్ పాల్గొన్నారు. ‘జలాశయాలపై ఫ్లోటింగ్ సోలార్ విద్యుత్ ప్లాంట్లు’ సాక్షి, హైదరాబాద్: పెరుగుతున్న విద్యుత్ అవసరాలను తీర్చేందుకు రాష్ట్రంలోని జలాశయాలపై ఫ్లోటింగ్ సోలార్ విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, విద్యుత్ శాఖ మంత్రి భట్టి విక్రమార్క మల్లు తెలిపారు. ఈ మేరకు 1000 మెగావాట్ల ఫ్లోటింగ్ సోలార్ విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డితో కలిసి గురువారం రాత్రి ఆయన సచివాలయంలో సింగరేణి సంస్థ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్ల వల్ల మత్స్య సంపదకు ఎలాంటి నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని భట్టివిక్రమార్క సూచించారు. ఈ ప్రాజెక్టుల నిర్మాణానికి నీటిపారుదల శాఖ ద్వారా సంపూర్ణ సహకారం అందిస్తామని ఆ శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి తెలిపారు. సింగరేణి సంస్థ ఇన్చార్జి సీఎండీ బలరామ్ తదితరులు పాల్గొన్నారు. -
తెలంగాణ సర్కారుకు సుప్రీం నోటీసులు
ఢిల్లీ: తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన పాలమూరు-డిండి ప్రాజెక్టులపై ఏపీ రైతులు శుక్రవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తమ ప్రయోజనాలు భంగం కలిగించే విధంగా ప్రాజెక్టులు ఉన్నాయంటూ వారు పిటిషన్లో దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం తెలంగాణ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. అదేవిధంగా నాలుగు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలను ఆదేశించింది. తదుపరి విచారణను జులై 20కి వాయిదా వేశారు. తుది వాదనలు ఆరోజే వింటామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.