breaking news
Dilip trophy
-
నాలుగో రోజూ ఆట రద్దు
కొచ్చి: సౌత్, నార్త్ జోన్ల మధ్య జరుగుతున్న దులీప్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌ను వర్షం వెంటాడుతూనే ఉంది. నాలుగో రోజు ఆట కూడా రద్దయ్యింది. భారీ వర్షం కారణంగా మైదానం చిత్తడిగా మారడంతో ఆదివారం ఒక్క బంతి కూడా సాధ్యపడలేదు. ఉదయం మైదానాన్ని పరిశీలించిన అంపైర్లు సంజయ్ హజారే, సురేశ్ శాస్త్రిలు ఆటను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. వాతావరణ పరిస్థితులు అనుకూలిస్తే రిజర్వ్ డే (మంగళవారం)ను ఉపయోగించుకోవాలని భావిస్తున్నారు. దీంతో 15 నిమిషాలు ముందుగా మ్యాచ్ ప్రారంభంకానుంది. తొలి, మూడో రోజు ఆట కూడా రద్దు కావడంతో మొత్తం 350 ఓవర్ల మ్యాచ్ నష్టపోయింది. మరోవైపు వరుసగా ఆట రద్దు కావడంపై కేంద్ర మంత్రి శశి థరూర్.. కేరళ క్రికెట్ సంఘం (కేసీఏ)పై ధ్వజమెత్తారు. ‘రాష్ట్ర ప్రతిష్టకు కేసీఏ మచ్చ తెస్తోంది. రెండు మేజర్ మ్యాచ్‌లు వర్షం వల్ల రద్దయ్యాయి. డ్రైనేజి సిస్టమ్ కోసం ఖర్చు చేసిన రూ. 8 కోట్లు ఎవరికి లబ్ధి చేకూర్చాయి. జేఎన్ఐ స్టేడియం, డ్రైనేజీ అధునీకరణ కోసం కోట్లు ఖర్చు చేశామని వార్షిక నివేదికలో పొందుపర్చారు. పెవిలియన్ పనులు చేసినప్పుడు అందులో డ్రైనేజీ ముఖ్యం కాదా? ఈ విషయాన్ని అభిమానులు అడిగేందుకు సిద్ధంగా ఉన్నారు’ అని థరూర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. -
దులీప్ ట్రోఫీ ఫైనల్లో సౌత్‌జోన్
చెన్నై: బౌలింగ్‌లో విశేషంగా రాణించిన సౌత్‌జోన్... దులీప్ ట్రోఫీ ఫైనల్లోకి దూసుకెళ్లింది. హైదరాబాద్ బౌలర్ ప్రజ్ఞాన్ ఓజా (6/48) కీలక వికెట్లు తీయడంతో ఆదివారం ముగిసిన సెమీఫైనల్లో సౌత్ జట్టు ఇన్నింగ్స్ 38 పరుగుల తేడాతో సెంట్రల్ జోన్‌పై విజయం సాధించింది. ఇన్నింగ్స్ ఓటమిని తప్పించుకోవాలంటే 258 పరుగులు చేయాల్సిన దశలో చివరి రోజు బ్యాటింగ్‌కు దిగిన సెంట్రల్ జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 57.2 ఓవర్లలో 220 పరుగులకు ఆలౌటైంది. ముఖ్యంగా ఓజా నాలుగు ఓవర్ల వ్యవధిలో రాబిన్ బిస్త్ (20), శలభ్ శ్రీవాస్తవ (2), నమన్ ఓజా (0)లను అవుట్ చేయడంతో సౌత్ విజయం ఖరారైంది. అంతకుముందు 467/9 ఓవర్‌నైట్ స్కోరుతో ఆఖరి రోజు ఆట కొనసాగించిన సౌత్ జట్టు కేవలం ఒక్క ఓవర్ మాత్రమే ఆడి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది.