breaking news
Differences of opinion
-
ప్రత్తిపాడు టీడీపీలో కుమ్ములాట
సాక్షి ప్రతినిధి, కాకినాడ : తూర్పు గోదావరి జిల్లా ప్రత్తిపాడు టీడీపీలో విభేదాలు తీవ్ర రూపం దాల్చాయి. తాడోపేడో తేల్చుకోవడానికి సిద్ధమవుతున్నాయి. ‘నువ్వెంత అంటే నువ్వెంత’ అనే స్థాయికి వెళ్లిపోయాయి. పార్టీలోకి వచ్చి తమను అణగదొక్కుతున్నారని ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావుపై టీడీపీలో తొలినుంచీ ఉంటూ వస్తున్నవారు భగ్గుమంటున్నారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యే తమపై పెత్తనం చెలాయించడమేంటని పర్వత చిట్టిబాబు వర్గీయులు తిరుగుబాటుకు దిగారు. వారందరూ ఇప్పుడు రోడ్డెక్కారు. ఎమ్మెల్యే తీరును బాహాటంగానే దుయ్యబడుతున్నారు. జోక్యం చేసుకుంటున్న అధికారులను సైతం నిలదీస్తున్నారు. ఇదెక్కడికి వెళ్తుందో తెలియదు గాని ప్రత్తిపాడు టీడీపీలో మాత్రం ప్రస్తుతం కలహాల కాపురం నడుస్తోంది. ప్రత్తిపాడు నియోజకవర్గంలో టీడీపీకి పర్వత చిట్టిబాబు వర్గమే నాయకత్వం వహిస్తూ వస్తోంది. కానీ, ఎన్నికల అనంతరం ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు పార్టీ ఫిరాయించి టీడీపీలోకి వచ్చారు. దీంతో టీడీపీలో కుమ్మలాట మొదలయింది. పార్టీలోకి రావడమే తరువాయి పాత కాపులైన పర్వత చిట్టిబాబు వర్గీయులను అణగదొక్కడమే పనిగా ఎమ్మెల్యే వరుపుల పెట్టుకున్నారు. ఇప్పటికే పలుమార్లు పర్వత చిట్టిబాబు వర్గీయులు బయటపడ్డారు. ఎమ్మెల్యేపై ఫిర్యాదుకు సైతం దిగారు. పరిస్థితిలో మార్పు రాలేదు. పర్వత వర్గీయులకు అడుగడుగునా అవమానాలు ఎదురవుతున్నాయి. తాజాగా ఫ్లెక్సీల గొడవ... టీడీపీ అట్టహాసంగా చేపడతున్న పింఛన్ల పంపిణీలో తాజాగా అసమ్మతి బుసకొట్టింది. ఈ నెల 9న రౌతులపూడిలోను, 10న శంఖవరంలో జరిగిన కొత్త పింఛన్లు పంపిణీ కార్యక్రమం కోసం ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ లోపాలు టీడీపీలో మరింత అగ్గి రాజేశాయి. కొత్త పింఛన్లు పంఫిణీ కార్యక్రమానికి ఏర్పాటు చేసిన ఫ్లెక్సీపై తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు దివంగత మహానేత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు, దివంగత మాజీ ఎమ్మెల్యే పర్వత చిట్టిబాబు ఫొటోలను వేశారు. కానీ, అది ఎమ్మెల్యే వర్గీయులకు రుచించలేదు. వెనకుండి ఎన్టీఆర్, చిట్టిబాబు ఫొటోలపై స్టిక్కర్లను అంటించేలా చేయించారని దివంగత ఎమ్మెల్యే పర్వత చిట్టిబాబు వర్గానికి చెందిన పలువురు తెలుగు తమ్ముళ్లు తిరగబడ్డారు. ఇదంతా ఎమ్మెల్యే పనేనని, ఆయన చెబితేనే అధికారులు తొలగించారని తీవ్ర ఆవేదనకు గురయ్యారు. ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా తమ్ముళ్ల ఆందోళన ఎమ్మెల్యే తీరుతో విభేదిస్తున్న పర్వత చిట్టిబాబు వర్గీయుల తమ నాయకులకు జరిగిన అన్యాయాన్ని నిలదీసేందుకు బుధవారం రోడ్డెక్కారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయం వద్దకు వెళ్లి ఆందోళన చేశారు. జరిగిన అవమానికి బాధ్యులెవరని ఎంపీడీఓ ఎం.శ్రీనును నిలదీశారు. దీనికి సమాధానం చెప్పడానికి ఎంపీడీఓ మీనమేషాలు లెక్కిస్తున్నారంటూ అక్కడే కార్యాలయం ఎదుట ఆర్అండ్బీ రహదారిలో రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ముప్పైఏళ్లుగా పార్టీ జెండాను భుజాన పెట్టుకుని పార్టీకోసం తన ప్రాణాలను పణంగా పెట్టిన చిట్టిబాబును, పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ ఫొటోలపై మాసికను అంటించిడం తమను ఎంతగానో బాధించిందని, ఈ విషయంలో ఎవరి ఒత్తిడి వల్ల ఇలా చేశారో ఎంపీడీఓ చెప్పాలని వారంతా పట్టుబట్టారు. గత రెండేళ్లుగా ప్రభుత్వం అందిస్తున్న వివిధ సంక్షేమ పథకాల పంపిణీలో సమాన ప్రాధాన్యత ఇవ్వకుండా తీవ్ర వ్యత్యాసం చూపుతున్నారని, అయినా భరిస్తున్నామని, కాని తమ నాయకుల ఫొటోలపై మాసికలు వేయటం ఉద్దేశ్యపూర్వకంగా ఎమ్మెల్యే, ఆయన అనుచరుల అండతోపూ ఎంపీడీఓ ఈ చర్యలకు పూనుకున్నారని మండిపడ్డారు. దీంతో విషయం తెలుసుకున్న టీడీపీ నాయకుడు పర్వత చిట్టిబాబు సోదరుడు పర్వత రాజుబాబు, టీడీపీ నాయకులు బద్ది రామారావు తదితరులు వచ్చి ఆందోళనకారులతో చర్చలు జరిపారు. ఈ మేరకు ఎంపీడీఓ ఆందోళనకారుల వద్దకు వచ్చి బేనర్ ఏర్పాటులో ఏమైనా పొరపాట్లు జరిగితే సిబ్బంది లోపంతో జరిగింది తప్ప ఎలాంటి రాజకీయ ఒత్తిడిలు లేవని చెప్పుకొచ్చారు. -
ఎడమొహం.. పెడమొహం
సాక్షి, ముంబై: 15 ఏళ్ల అనంతరం అధికారం దక్కించుకున్న బీజేపీ, శివసేన కూటమి ఎడమొహం పెడమొహంగానే ఇంకా కొనసాగుతున్నాయి. రాష్ట్రంలో కాషాయ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి గత తొమ్మిది నెలలుగా గడిచినా ఇరుపార్టీల మధ్య ఉన్న అభిప్రాయ భేదాలు మాత్రం తొలగిపోలేదు. రైతుల రుణాలు మాఫీ చేసి తీరాల్సిందే అని శివసేన పట్టుబట్టుతోంది. అయితే బీజేపీ మాత్రం తొలుత మెతక వైఖరి అవలంబించినప్పటికీ తర్వాత రుణమాఫీ సాధ్యం కాదని తేల్చి చెప్పింది. ఇక గోందియా, జిల్లా పరిషత్ ఎన్నికలైతే రాష్ట్ర వ్యాప్తంగా కలకలం ృసష్టించాయి. అక్కడ కాంగ్రెస్, ఎన్సీపీ మధ్య పొత్తు వికటించడంతో కొత్త రాజకీయ సమీకరణాలు చోటుచేసుకుంటున్నాయని వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన మొదటి వారంలోనే స్పష్టమైంది. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పుట్టిన బీజేపీ, గోందియాలో అదే పార్టీతో జతకట్టింది. ఇది రాజకీయ వర్గాలను తీవ్ర విస్మయానికి గురిచేసింది. రగిలిపోయిన శివసేన.. గోందియాలో బీజేపీ, కాంగ్రెస్ జతకట్టడంపై రగిలిపోయిన శివసేన, ప్రతిపక్షాలకు వంతపాడింది. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరని, పుట్టుకతో శత్రువులైనా మిత్రులుగా మారిపోతారని నిప్పులు చెరిగింది. అసెంబ్లీలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు గులాబ్రావ్ పాటిల్, అర్జున్ ఖేత్కర్ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేందుకు శతవిధాల ప్రయత్నించారు. రైతుల రుణాల మాఫీ చేయడమే అసెంబ్లీలో ప్రధానం అంశం కావడంతో బీజేపీ ఏకాకిగా మారిపోయింది. అయిన్పప్పటికీ ప్రతిపక్షాల సవాళ్లకు దీటుగా సమాధానమిస్తూ సభ కార్యకలాపాలు ముందుకు సాగించింది. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన తొలి రెండు రోజులు ప్రతిపక్ష కాంగ్రెస్, ఎన్సీపీ సభ్యులు అసెంబ్లీ భవనం ఎదుట ఆందోళన చేపట్టారు. రైతు రుణాలు మాఫీ చేయాలని నినాదాలు చేశారు. దీంతో అసెంబ్లీలో ఇదే అంశంపై మొదటి వారమంతా చర్చ జరిగింది. రోజు అసెంబ్లీ బయట జరుగుతున్న వివాదం యావత్ రాష్ట్ర ప్రజల దృష్టి రుణ మాఫీపై పడింది. మరోపక్క అధికారంలో ఉంటూనే పరోక్షంగా ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్న శివసేన వైఖరి వల్ల బీజేపీ ఉక్కిరిబిక్కిరవుతోంది. దూరం పెరిగింది అప్పుడే.. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఇరుపార్టీల మధ్య మొదలైన ముసలం ఇప్పుడిప్పుడే సమసిపోయేలా కనిపించడం లేదు. సీట్ల సర్దుబాటు విషయంలో మొదలైన భేదాలు, చివరికి 20 ఏళ్ల స్నేహాన్ని దూరం చేశాయి. విడివిడిగా పోటీ చేసి మోదీ మేనియాతో 120 సీట్లకు పైగా సాధించిన బీజేపీ రాష్ట్రంలో అతిపెద్ద పార్టీగా అవతరించింది. తొలుత ఎన్సీపీ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు గవర్నర్ ముందు బలనిరూపణ చేసుకున్నా.. తర్వాత పాత కాపు శివసేనను ప్రభుత్వంలోకి ఆహ్వానించింది. చాలా రోజుల పాటు సుదీర్ఘంగా జరిగిన చర్చల అనంతరం కూటమి ప్రభుత్వం పాలన ప్రారంభించింది. అయితే అధికారం లేని పదవులతో ఏం చేసుకోవాలంటూ కొద్ది రోజుల్లోనే కథ మళ్లీ మొదటికొచ్చింది. ఇరు పార్టీల పెద్దల భేటీ అనంతరం గొడవలు కాస్త సద్దుమనిగాయి. కానీ వైరం మాత్రం రోజురోజుకీ ముదిరి పాకాన పడుతోంది.