లైంగిక వేధింపులకు జీవితఖైదు
చెన్నై: తమిళనాడు లోని మహిళా కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. బాలిక(15)ను లైంగికంగా వేధించిన కేసులో ధన్హీర్ (30) అనే యువకుడికి జీవితఖైదు విధిస్తూ కోర్టు తీర్పు చెప్పింది. దీంతో పాటుగా బాలికపై బెదిరింపులకు పాల్పడినందుకు గాను ఏడు సంవత్సరాల కఠినకారాగారశిక్షను విధించింది. ఈ రెండు శిక్షలను ఏకకాలంలో అమలు చేయాలని జిల్లా మహిళా కోర్ట్ న్యాయమూర్తి ఎన్ తిరువక్కనరసు సోమవారం ఆదేశించారు.
వివరాల్లోకి వెళితే..ఇంటి సమీపంలో నిలబడి ఉన్న బాలిక పట్ల ధన్హీర్ అనుచితంగా ప్రవర్తించాడు. ఆ చర్యలను బాధితురాలు ప్రతిఘటించడంతో.. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తానంటూ బెదిరించాడు. దీంతో అమ్మాయి తల్లిదండ్రులు గోబిచెట్టిపాల్యం (గోబి) లో ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ధన్హీర్ పై కేసు నమోదు చేసిన మహిళా విభాగం పోలీసులు గత జులైలో అతగాడిని అరెస్ట్ చేశారు. ప్రాసిక్యూషన్ వాదనలను సమర్థించిన కోర్టు ఈ తీర్పును వెలువరించింది.