ఎంపీటీసీ మాజీ సభ్యుడి దారుణ హత్య
► పొలంలో కత్తులతో పొడిచి చంపిన దుండగులు
►గిద్దలూరు మండలం గడికోట శివారులో ఘటన..
గిద్దలూరు రూరల్ :ఎంపీటీసీ మాజీ సభ్యుడు దారుణ హత్యకు గురయ్యూడు. ఆయన పొలంలో ఉండగా దుండగులు కత్తులతో అతి కిరాతకంగా నరికి చంపారు. ఈ సంఘటన మండలంలోని గడికోట గ్రామ శివారు పొలంలో సోమవారం వేకువ జామున జరిగింది. అందిన వివరాల ప్రకారం.. గడికోటకు చెందిన ఎంపీటీసీ మాజీ సభ్యుడు ధనపాటి రమణ (38) గ్రామ శివారులో ఉన్న తన వరి పంటకు కాపలా కోసం ఇంటి నుంచి ఆదివారం రాత్రి 9 గంటలకు బయల్దేరి వెళ్లాడు. పంట పొలం వద్ద నిద్రిస్తున్న రమణపై దుండగులు కత్తులతో దాడి చేసి అతి కిరాతకంగా పొడిచారు. అనంతరం గొంతు వద్ద రెండు చోట్ల నరికారు. ఊపిరి పోరుున అనంతరం రమణ మృతదేహాన్ని వరి పైరులో పడేసి వెళ్లిపోయారు.
భర్తను వెతుక్కుంటూ వెళ్లిన భార్య
పొలానికి రాత్రి వెళ్లిన భర్త ఉదయమైనా ఇంటికి రాకపోవడంతో భార్య సుజాత వెతుక్కుంటూ పొలానికి వెళ్లింది. అక్కడ భర్త రక్తపు మడుగులో నిర్జీవంగా కనిపించడంతో కన్నీటిపర్యంతమైంది. తన భర్తను చంపారంటూ కేకలు వేసి స్థానికులకు సమాచారం అందించింది. రమణ గతంలో కలప వ్యాపారం చేశాడు. గ్రామంలో ఎవరితోనూ వివాదం లేదు. ఘర్షణలకు దూరంగా ఉంటాడు. రమణను హత్య చేయాల్సినంత అవసరం ఎవరికి ఉందా.. అని గ్రామస్తులు, పోలీసులు చర్చించుకుంటున్నారు. రమణకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
సంఘటన స్థలాన్ని పరిశీలించిన డీఎస్పీ
విషయం తెలుసుకున్న మార్కాపురం డీఎస్పీ ఆర్.శ్రీహరిబాబు సంఘటన స్థలానికి చేరుకుని రమణ హత్యకు కారణాలు తెలుసుకునే ప్రయత్నం చేశారు. బంధువుల నుంచి వివరాలు సేకరించారు. సంఘటన స్థలం చుట్టుపక్కల క్షుణ్ణంగా పరిశీలించారు. అక్కడ ఎటువంటి ఆధారాలూ లభించలేదు. ఆదివారం అర్ధరాత్రి 12 గంటలకు కరెంట్ పోయిన త ర్వాతే చంపి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పంట పొలాల చుట్టూ ఉన్న రైతుల వివరాలు సేకరించారు. హత్యకు కారణాలు పాతకక్షలా? కలప వ్యాపారంలో లావాదేవిలా? వివాహేతర సంబంధాలా? అన్న కోణాల్లో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. డీఎస్పీతో పాటు సీఐ వి.శ్రీరామ్, ఎస్సై కె.మల్లికార్జున, కానిస్టేబుళ్లు ఉన్నారు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని పట్టణంలోని ఏరియా వైద్యశాలకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.