breaking news
DGP anuraga sharma
-
రేపటి వరకూ నిమజ్జనాలు..
హైదరాబాద్: లక్షలాది మంది ఉత్సాహంగా పాల్గొంటున్న గణనాథుడి నిమజ్జనోత్సవం రేపటి వరకు కొనసాగే అవకాశం ఉందని డీజీపీ అనురాగ్ శర్మ తెలిపారు. జంట నగరాల్లో ప్రధానమైన గణేష్ విగ్రహాలు మొత్తం 11,074 ఏర్పాటు చేయగా, ఈ రాత్రి 5 వేల వరకు విగ్రహాలు నిమజ్జనం కావచ్చని, రేపు కూడా విగ్రహాల నిమజ్జనం జరుగుతూనే ఉంటుందని తెలిపారు. గురువారం ఉదయం నుంచి భారీగా వర్షం పడుతున్నప్పటికీ అనేక మండపాల నుంచి గణేష్ విగ్రహాల నిమజ్జనోత్సవం ప్రారంభం అయిందని అన్నారు. డీజీపీ, తన కార్యాలయంలోని సెంట్రల్ కమాండ్ అండ్ కంట్రోల్ సిస్టమ్ నుంచి నగరంలో గణేష్ నిమజ్జనం జరుగుతున్న ప్రాంతాలను ఉన్నతాధికారులతో కలిసి పర్యవేక్షించారు. అనంతరం రాష్ట్ర హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి, పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డి, శాంతి భద్రతల అదనపు డీజీపీ అంజనీ కుమార్‌లతో కలిసి విగ్రహాల ఊరేగింపు ప్రాంతాలను హెలికాప్టర్లో ఏరియల్ సర్వే చేశారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ.. ట్యాంక్‌బండ్ తో పాటుగా దగ్గరలోని చెరువుల్లోనూ ప్రజలు అనందోత్సహాల మధ్య గణేష్ విగ్రహాలను నిమజ్జనం చేస్తున్నారని అన్నారు. ఖైరతాబాద్ గణేశుడుని మధ్యాహ్నం రెండున్నర గంటలకు ట్యాంక్ బండ్ లో నిమజ్జనం చేశారని, సాయంత్రం 6 గంటల వరకు వివిధ ప్రాంతాల నుండి వచ్చిన 1248 గణేష్ విగ్రహాలు నిమజ్జనం చేశారని, ఈ రోజు రాత్రి మొత్తం కూడా గణేష్ విగ్రహాలు నిమజ్జనం కోసం తరలి వస్తూనే ఉంటాయని చెప్పారు. రేపు మధ్యాహ్నం వరకు దాదాపుగా అన్ని విగ్రహాల నిమజ్జనం పూర్తికావచ్చని డీజీపీ అభిప్రాయపడ్డారు. ఇప్పటివరకూ ఎక్కడా ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరుగలేదని, పోలీసులు ప్రజలతో మంచి సంయవనం పాటిస్తూ గణేష్ విగ్రహాల ఊరేగింపు శాంతి భద్రతల మధ్య జరుగుతున్నదని అనురాగ్ శర్మ తెలిపారు. వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సుమారు 12 వేల సీసీ, వీడియో కెమెరాలతో సెంట్రల్ కమాండ్ అండ్ కంట్రోల్ సిస్టమ్ నుంచి ఊరేగింపు జరుగుతున్న అన్ని ప్రాంతాలను పోలీస్ సిబ్బంది పర్యవేక్షిస్తున్నారని పేర్కొన్నారు. నిమజ్జనోత్సవంలో అసాంఘీక శక్తులు కనబడితే చర్యలు తీసుకోవడంపై వెంటనే సమీపంలోని పోలీస్ సిబ్బందిని అప్రమత్తం చేస్తామన్నారు. సీనియర్ పోలీస్ అధికారులతో పాటుగా 25 వేల మంది పోలీస్ సిబ్బంది శాంతి భద్రతల విధుల్లో పాల్గొంటున్నారని వీరితో పాటుగా వివిధ విభాగాలకు చెందిన 13 కేంద్ర పోలీసు బలగాలు కూడా నిమజ్జనోత్సం సందర్భంగా శాంతి భద్రతల విధుల్లో పనిచేస్తున్నారని డీజీపీ అనురాగ్ శర్మ వెల్లడించారు. -
'అర్థరాత్రిలోపు బాలాపూర్ గణేష్ నిమజ్జనం'
హైదరాబాద్: వినాయక నిమజ్జనాలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయని డీజీపీ అనురాగ శర్మ పేర్కొన్నారు. గతానికి భిన్నంగా ఈసారి ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం అనుకున్న టైంలోనే పూర్తి చేశామని చెప్పారు. బాలాపూర్ గణేష్ శోభయాత్ర కొనసాగుతున్న నేపథ్యంలో అర్థరాత్రి లోపు బాలాపూర్ గణనాథుడిని నిమజ్జనం చేస్తామని డీజీపీ వెల్లడించారు. కాగా, వినాయక నిమజ్జనాలపై హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి ఏరియల్ సర్వే నిర్వహిస్తున్నారు. ఈ ఏరియల్ సర్వేలో నాయిని వెంట డీజీపీ అనురాగ్‌శర్మ, సీపీ మహేందర్‌రెడ్డి ఉన్నారు. ఇదిలా ఉండగా, ఖైరతాబాద్ వినాయకుని నిమజ్జన శోభాయాత్ర వైభవంగా జరిగింది. 6 గంటల్లో ఖైరతాబాద్ గణేషుడి నిమజ్జనం రికార్డు సమయంలో పూర్తి అయింది. బాలాపూర్ గణేష్ శోభాయత్ర ఇంకా కొనసాగుతోంది. చార్మినర్ మీదుగా బాలాపూర్ గణేషుడి శోభాయాత్ర ఎమ్జే మార్కెట్ వైపుగా కొనసాగుతోంది. అయితే ఈసారి బాలాపూర్ గణేష్ లడ్డూ రికార్డు ధర పలికింది. వేలం పాటలో బాలాపూర్ లడ్డూ రూ. 14.65 లక్షలు పలికింది. గతంలో కంటే రూ. 4.33 లక్షలు ఎక్కువ పలికింది. వేలం పాటలో బడంగ్‌పేట గణేష్ లడ్డూ రూ. 5.21 లక్షలు పలికింది. -
నాంపల్లి కోర్టులో మోడల్ చిల్డ్రన్స్ కోర్టు
హైదరాబాద్: నాంపల్లి కోర్టులో మోడల్ చిల్ట్రన్స్ కోర్టు ప్రారంభోత్సవం కార్యక్రమం జరిగింది. హైకోర్టు చీఫ జస్టిస్ రమేష్ రంగనాథన్ బుధవారం మోడల్ చిల్డ్రన్స్ కోర్టును ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో డీజీపీ అనురాగ్ శర్మ, మెట్రోపాలిటన్ సెషెన్స్ జడ్జి రజిని, ఐజీ సౌమ్యా మిశ్రా, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీజీపీ అనురాగ్ శర్మ మాట్లాడుతూ.. గోవా, ఢిల్లీ తరువాత ఇప్పుడు హైదరాబాద్‌లో ఏర్పాటైన కోర్టు దేశంలోనే మూడోదని పేర్కొన్నారు. రాబోయో రోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా అన్ని చోట్లా మోడల్ చిల్డ్రన్స్ కోర్టులు ఏర్పాటు చేస్తామన్నారు. కేసుల విచారణలో చిన్నారులు భయాందోళనలకు గురికాకుండా ఉండేందుకే మోడల్ చిల్డ్రన్స్ కోర్టును ఏర్పాటు చేసినట్టు తెలిపారు. స్నేహపూరితమైన వాతావరణంలో కేసుల విచారణ, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చిన్నారులకు కౌన్సెలింగ్ కూడా ఇస్తామని డీజీపీ వెల్లడించారు.