breaking news
DGCA licence
-
కొత్త అగ్రి డ్రోన్ మోడల్‌కు డీజీసీఏ సర్టిఫికేషన్
న్యూఢిల్లీ: దేశీయంగా రూపొందించిన కొత్త అగ్రి–డ్రోన్ ’అగ్రిబాట్ ఏ6’కు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) నుంచి ’టైప్ సర్టిఫికెట్’ లభించినట్లు ఐవోటెక్వరల్డ్ ఏవిగేషన్ సంస్థ తెలిపింది. నిర్దేశిత సాంకేతిక, భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా నిర్దిష్ట ఉత్పత్తి ఉన్నట్లు ధృవీకరిస్తూ డీజీసీఏ ఈ సర్టిఫికెట్‌ను అధికారికంగా జారీ చేస్తుంది. క్రితం మోడల్‌తో పోలిస్తే కొత్తగా ఆవిష్కరించిన మోడల్ పరిమాణంలో 30 శాతం చిన్నదిగా ఉంటుందని సంస్థ సహ వ్యవస్థాపకుడు దీపక్ భరద్వాజ్ తెలిపారు. అధునాతన డిజైన్ అయినప్పటికీ కొత్త ఉత్పత్తి రేటును పెంచలేదని ఆయన వివరించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 3,000 పైచిలుకు డ్రోన్లను విక్రయించాలని నిర్దేశించుకున్నట్లు భరద్వాజ్ పేర్కొన్నారు. -
వ్యవసాయ డ్రోన్ పైలెట్ శిక్షణకు గ్రీన్‌సిగ్నల్
సాక్షి, అమరావతి: వ్యవసాయ, సంప్రదాయ డ్రోన్ పైలెట్ శిక్షణ ఇచ్చేందుకు ఏపీ ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయానికి డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) అనుమతి ఇచ్చింది. దేశంలోనే తొలిసారి వర్సిటీకి లైసెన్సు జారీచేస్తూ డీజీసీఏ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ జితేందర్ లౌరా ఉత్తర్వులు ఇచ్చారు. ఈ ఉత్తర్వుల ప్రకారం గుంటూరు లాంలోని వ్యవసాయ డ్రోన్ పరిశోధన కేంద్రమైన సెంటర్ ఫర్ అప్సర ద్వారా సంప్రదాయ, వ్యవసాయ డ్రోన్లపై రిమోట్ పైలెట్ ట్రైనింగ్ కోర్సు (ఆర్పీటీసీ)లో 12 రోజుల శిక్షణ ఇచ్చేందుకు 2032 వరకు అనుమతి లభించింది. దేశంలో సంప్రదాయ డ్రోన్లపై శిక్షణ ఇచ్చేందుకు ప్రైవేటు రంగంలో 34 డ్రోన్ పైలెట్ శిక్షణ కేంద్రాలకు డీజీసీఏ అనుమతి ఉంది. ఈ కేంద్రాల్లో ఐదుకిలోల బరువున్న సంప్రదాయ డ్రోన్లపై ఐదురోజుల పాటు కన్వెన్షనల్ రిమోట్ పైలెట్ కోర్సు (సీఆర్పీసీ) కింద శిక్షణ ఇస్తున్నారు. వ్యవసాయ అవసరాల కోసం వినియోగించే డ్రోన్లు 25 కిలోలకుపైగా బరువుంటాయి. వీటిపై శిక్షణ పొందాలంటే ప్రత్యేక పాఠ్యప్రణాళిక ఉండాలి. కనీసం 12 రోజులు పడుతుంది. డీజీసీఐ మార్గదర్శకాలకనుగుణంగా గుంటూరు లాంలో సెంటర్ ఫర్ అప్సర పేరిట ఏపీ ఎన్జీ రంగా వ్యవసాయ వర్సిటీ 2020లో వ్యవసాయ డ్రోన్ల పరిశోధన సంస్థకు శ్రీకారం చుట్టింది. వ్యవసాయ డ్రోన్ పైలెట్ శిక్షణ కోసం దేశంలోనే తొలిసారి 12 రోజుల శిక్షణకు ప్రత్యేకంగా పాఠ్యప్రణాళికను సైతం రూపొందించింది. 10 ప్రధాన పంటలైన వరి, పత్తి, మిరప, చెరకు, మొక్కజొన్న జొన్న, మినుము, కంది, శనగ, వేరుశనగ సాగులో డ్రోన్ల వినియోగంపై ప్రామాణికాలను రూపొందించింది. ప్రయోగాత్మకంగా గడిచిన ఖరీఫ్‌లో 30 వేల ఎకరాల్లో వ్యవసాయ డ్రోన్ల వినియోగం ద్వారా సత్ఫలితాలను సాధించారు. అంతేకాదు.. సెంటర్ ఫర్ అప్సర ద్వారా 75 మంది వ్యవసాయ డిప్లమో విద్యార్థులకు అంతర్గతంగా శిక్షణ ఇచ్చి వ్యవసాయ డ్రోన్ పైలెట్లుగా తీర్చిదిద్దారు. వ్యవసాయ అనుబంధ అవసరాలకు తగినట్టుగా అత్యాధునిక టెక్నాలజీతో ప్రత్యేకంగా 16 డ్రోన్లను రూపొందించి వివిధ పరిశోధనల్లో వినియోగిస్తున్నారు. వ్యవసాయ డ్రోన్ పైలెట్ శిక్షణ కోసం రూపొందించిన పాఠ్యప్రణాళికతో పాటు పైలెట్ శిక్షణకు అనుమతి కోరుతూ వర్సిటీ ప్రతిపాదనలు పంపింది. దీంతో ఈ నెల 3, 4 తేదీల్లో డీజీసీఏ డిప్యూటీ డైరెక్టర్ జితేందర్ లౌరా నేతృత్వంలోని బృందం లాంలోని సెంటర్ ఫర్ అప్సరను సందర్శించింది. అక్కడ మౌలిక సదుపాయాలతోపాటు పైలెట్ చీఫ్ ట్రైనర్ డాక్టర్ ఎ.సాంబయ్య నేతృత్వంలో శిక్షణ ఇస్తున్న అధ్యాపక బృందం నైపుణ్యతను పరీక్షించి సంతృప్తి వ్యక్తం చేసింది. సెంటర్ ఫర్ అప్సరకు లైసెన్సు జారీచేస్తూ సోమవారం ఉత్తర్వులు విడుదల చేసింది. దేశవ్యాప్తంగా మూడు వర్సిటీలకు మాత్రమే డ్రోన్ పైలెట్‌కు శిక్షణ ఇచ్చేందుకు అనుమతి ఉంది. అయితే వ్యవసాయ డ్రోన్ పైలెట్‌గా శిక్షణ ఇచ్చే తొలి అవకాశం ఎన్జీరంగా వర్సిటీకే దక్కింది. సంప్రదాయ డ్రోన్లపై ఐదురోజుల శిక్షణ పొందినవారికి కొనసాగింపుగా వ్యవసాయ డ్రోన్లపై మరో ఏడురోజులు శిక్షణ ఇచ్చి సర్టిఫికెట్లు జారీచేసే అవకాశం కల్పించింది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఆర్బీకేలోను డ్రోన్ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కార్యాచరణ సిద్ధం చేసింది. ఇందుకోసం ఎంపిక చేసిన రైతులకు ఉచితంగా డ్రోన్ పైలెట్‌గా శిక్షణ ఇచ్చేందుకు మార్గం సుగమమైంది. ఇక డ్రోన్ విప్లవం వ్యవసాయ, సంప్రదాయ డ్రోన్లపై శిక్షణ ఇచ్చేందుకు డీజీసీఏ అనుమతినివ్వడం.. రాష్ట్రంలో డ్రోన్ విప్లవానికి నాంది పలికింది. ఇదొక చరిత్రాత్మక పురోగతిగా భావించవచ్చు. దేశంలోనే తొలి వ్యవసాయ డ్రోన్ పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేయడమే కాదు.. తొలి శిక్షణ కేంద్రం కూడా మనదే కావడం గర్వంగా ఉంది. 2032 వరకు అనుమతి ఇవ్వడంతో డ్రోన్ రంగంలో వేలాదిమంది గ్రామీణ నిరుద్యోగ యువతకు ఉపాధి లభించనుంది. – డాక్టర్ ఆదాల విష్ణువర్ధన్‌రెడ్డి, వీసీ, ఏపీ ఎన్జీరంగా వ్యవసాయ వర్సిటీ రాష్ట్రానికి దక్కిన గౌరవం వ్యవసాయ డ్రోన్ పైలెట్‌గా శిక్షణ ఇచ్చేందుకు ఏపీ ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయానికి అనుమతి ఇవ్వడం రాష్ట్రానికి దక్కిన గౌరవంగా భావిస్తున్నా. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ప్రతి ఆర్బీకేలో డ్రోన్ ఏర్పాటు చేసేదిశగా అడుగులు వేస్తున్నాం. ఇందుకోసం ఎంపికచేసిన రైతులకు శిక్షణ ఇచ్చేందుకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. – కాకాణి గోవర్ధన్‌రెడ్డి, వ్యవసాయశాఖ మంత్రి -
గాల్లో తేలినట్టుందే! రాకేశ్ ఝున్‌ఝున్‌వాలాకు గుడ్‌న్యూస్
సాక్షి, ముంబై: ప్రముఖ పెట్టుబడిదారుడు, స్టాక్‌మార్కెట్ గురు రాకేశ్ ఝున్‌ఝున్‌వాలాకు చెందిన ఆకాశ ఎయిర్‌కు డీజీసీఏ నుంచి గ్రీన్ సిగ్నల్ లభించింది. లైసెన్స్ పొందిన ఆకాశ ఎయిర్ త్వరలోనే వాణిజ్య కార్యకలాపాలను ప్రారంభించనుంది. దీంతో ఆకాశ ఎయిర్ ఎనిమిదో దేశీయ విమానయాన సంస్థగా అవతరించింది. అలాగే జెట్ ఎయిర్వేస్ కొత్త యాజమాన్యం తిరిగి సేవలను ప్రారంభించేందుకు అనుమతి పొందిన తరవాత ఫైయింగ్ లైసెన్స్ పొందిన రెండో ప్రయాణీకుల విమానయాన సంస్థగా నిలిచింది. ఈ మేరకు సంస్థ గురువారం ట్వీట్ చేసింది. ముఖ్యమైన మైలు రాయిని సాధించాం అంటూ ఎయిర్ ఆపరేటర్ సర్టిఫికేట్ (ఏఓసీ) రావడంపై సంతో షాన్ని ప్రకటించింది. విమాన కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయంటూ ట్వీట్ చేసింది. ఝున్‌ఝున్‌వాలా ‘ఆకాశ ఎయిర్’ పేరుతో దేశీయంగా విమానయాన రంగంలోకి ప్రవేశించిన సంగతి తెలిసిందే. అమెరికాకు చెందిన బోయింగ్ సంస్థ నుంచి 18 ‘బోయింగ్ 737 మ్యాక్స్’ ఎయిర్ క్రాఫ్ట్ లను ఆకాశ ఎయిర్ కొనుగోలు చేసింది. మొత్తం 72 ‘బోయింగ్ 737 మ్యాక్స్’ విమానాల ద్వారా సేవలను అందించనుంది. We are pleased to announce the receipt of our Air Operator Certificate (AOC). This is a significant milestone, enabling us to open our flights for sale and leading to the start of commercial operations. — Akasa Air (@AkasaAir) July 7, 2022 -
ఇక షిర్డీకి విమాన రాకపోకలు
సాక్షి,న్యూఢిల్లీః షిర్డీ సాయిబాబాను దర్శించుకునే భక్తులు ఇక నేరుగా విమానాల్లో షిర్డీ చేరుకోవచ్చు. షిర్డీ విమానాశ్రయానికి పౌరవిమానయాన డైరెక్టరేట్ జనరల్ (డీజీసీఏ) గురువారం లైసెన్స్ జారీ చేయడంతో త్వరలో విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి. షిర్డీ ఎయిర్‌పోర్ట్‌లో ఏ-320, బోయింగ్ 737 ఎయిర్‌క్రాఫ్ట్‌ల రాకపోకలకు వీలు కల్పించేలా అత్యంత పొడవైన రన్‌వేను నిర్మించారు. విమానాశ్రయంలో అన్ని ప్రమాణాలు, వసతులను పరిశీలించిన అనంతరం షిర్డీ ఎయిర్పోర్ట్ ప్రయాణీకుల వినియోగానికి అవసరమైన ఏరోడ్రోమ్ లైసెన్స్‌ను జారీ చేశామని డీజీసీఏ సీనియర్ అధికారి వెల్లడించారు.