breaking news
devotional ecstasy
-
బౌద్ధ ధర్మ బోధనలు: తెలిసి చేసిన తప్పు!
ఒక ఆరామంలో చక్షుపాలుడు అనే భిక్షువు ఉండేవాడు. అతను వృద్ధుడు. పైగా అంధుడు. తెల్లవారు జామున బయటకు వచ్చి నడిచే సమయంలో అతని కాళ్ల కింద పడి కొన్ని కీటకాలు నలిగి చనిపోయాయి. భిక్షువు కాళ్ల కింద పడి కీటకాలు చనిపోవడం ఆ రోజుల్లో నేరంగా పరిగణించే వారు. కాబట్టి చక్షుపాలుణ్ణి తీసుకుని కొందరు భిక్షువులు బుద్ధుని దగ్గరకు వచ్చి– ‘భగవాన్! ఇతను ప్రతిరోజూ కీటకాల్ని చంపుతున్నాడు’ అని అభియోగం మోపారు. బుద్ధుడు విషయం తెలుసుకుని ‘‘భిక్షువులారా! ఇతనికి చూపు లేదు. కాబట్టి ఇతను చేసిన పని తెలిసి చేసింది కాదు. కాబట్టి నేరం కాదు. దానికి ఇతణ్ణి శిక్షించవలసిన పని గానీ నిందించవలసిన పని గానీ లేదు’’ అని చెప్పాడు. చక్షుపాలునితో ‘‘చక్షుపాలా! నీవు చేసింది నేరం కాకపోయినా జీవహింస జరిగింది. కాబట్టి అది తప్పు. నీవు మరింత జాగ్రత్త వహించు. ఆ తప్పు కూడా జరగకుండా చూసుకో’’ అన్నాడు. ఇంకా భిక్షువులు అక్కడే నిలబడి ఉన్నారు. అది గమనించిన బుద్ధుడు– ‘‘భిక్షులారా! మీకు ఒక కథ చెప్తాను వినండి– అంటూ ఇలా చెప్పాడు. పూర్వం ఒక పట్టణంలో ఒక నేత్ర వైద్యుడు ఉండేవాడు. అతడు మంచి వైద్యుడే గానీ, అనైతిక వాది. ఒక రోజు కట్టెలు కొట్టుకోవడానికి ఒక గ్రామీణ స్త్రీ అడవికి వెళ్ళింది. ఒక ఎండుపుల్ల ఆమె కంటికి తగిలింది. కన్ను ఎర్రబడింది. వాచింది. పట్టణంలోని వైద్యుని విషయం తెలిసి ఆయన దగ్గరకు వచ్చి– ‘‘అయ్యా! నేను పేదరాలిని! మీకు ధనం ఇచ్చుకోలేను. నా కన్ను బాగు చేయండి. అప్పటిదాకా మీ ఇంట్లో దాసి పని చేస్తాను’’ అని ప్రాధేయపడింది. వైద్యుడు ‘సరే’నన్నాడు. కన్ను పరీక్షించాడు. కంటికి ఎలాంటి నష్టం లేదని గ్రహించాడు. వైద్యం ప్రారంభించాడు. కంట్లో మందు వేశాడు. కొన్నాళ్లకి ఆమెకు చూపు మరింత తగ్గిపోయింది. కళ్లు కనిపించడం మానేశాయి. విషయం చెప్పింది. ‘‘చూపు వస్తుంది, భయపడకు’’ అన్నాడు. ‘‘అయ్యా! నాకు చూపు తెప్పించండి. నేను, నా బిడ్డా జీవితాంతం మీ ఇంట్లో దాసులుగా సేవ చేస్తాం’’ అని కాళ్లావేళ్ళా పడింది. వైద్యునికి కావలసింది అదే! కావాలనే ఆమెకు చూపు పోగొట్టాడు. ఇద్దరు సేవకులు దొరకడంతో ఆ ఒప్పందానికి ఒప్పుకున్నాడు. తిరిగి కంట్లో మందులు వేశాడు. ఆమెకి క్రమేపీ చూపు వచ్చింది. ఆమె వైద్యుని మోసం తెలుసుకుంది. కానీ బయట పడలేదు. నెమ్మదిగా గ్రామాధికారి వద్దకు వెళ్లి జరిగిన విషయమంతా చెప్పింది. ఆయన జరిగినదంతా తెలుసుకున్నాడు. ఆ తర్వాత వైద్యుడికి తగిన శిక్ష విధించాడు. ఈ కథలో వైద్యుడు కావాలనే, స్వార్థంతో ఆమె కళ్ళు పోగొట్టాడు. ఇది తెలియక చేసిన తప్పు కాదు. తెలిసి చేసిన మోసం. కాబట్టి వైద్యుడు చేసింది నేరం. అందుకు తగిన శిక్ష అనుభవించాడు. అని భిక్షువులకు చెప్పాడు బుద్ధుడు. అప్పుడు చక్షుపాలుడు చేసింది నేరం కాదని గ్రహించారు. భిక్షువులు ఇక ఆనాటి నుండి అన్ని పనుల్లో అతనికి సహాయపడుతూ, చిన్న చిన్న తప్పులు కూడా జరగకుండా చూశారు. – డా. బొర్రా గోవర్ధన్ -
ఆవులతో తొక్కించుకుంటే అదృష్టం మనదే!
పదుల సంఖ్యలో ఆవులు వీధుల్లో వేగంగా పరుగులు తీస్తున్నాయి. మామూలుగా అయితే మనమేం చేస్తాం? మనల్ని తొక్కేస్తాయని భావించి.. పక్కకు తప్పుకుంటాం.. కానీ మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో పక్కకు తప్పుకోరు.. తొక్కించుకుంటారు! గోవుల గిట్టల వల్ల గాయాలైనా.. భక్తిపారవశ్యంలో మునిగితేలుతారు. ఈ వినూత్న సంప్రదాయం ఏటా దీపావళి మరుసటి రోజున ఉజ్జయినిలో జరుగుతుంది. ఇలా చేయడం వల్ల తమ జీవితాల్లోని సమస్యలన్నీ తొలగిపోతాయని.. అదృష్టం కలసి వస్తుందని నమ్ముతారు. అందుకే ప్రమాదమని తెలిసినా.. చుట్టు పక్కల ప్రాంతాల నుంచి వందల సంఖ్యలో పురుషులు ఇక్కడికి తరలివస్తారు. ఈ సంప్రదాయం కొన్ని వందల ఏళ్ల నుంచి కొనసాగుతోందని.. ఇప్పటివరకూ ఒక్కరు కూడా చనిపోలేదని నిర్వాహకులు చెబుతున్నారు. ‘ఇది ప్రమాదమే.. అయితే.. ఆవు అమ్మలాంటిది. అమ్మ ఎవరినీ చంపదు. ప్రతి ఒక్కరి జీవితంలోనూ సమస్యలు ఉన్నాయి. ఈ గోవులు తమ పాదాలతో వాటిని అణచివేస్తాయి. భగవంతుడు మా బాధను, త్యాగాన్ని గమనించి.. అదృష్టం కలసివచ్చేలా మమ్మల్ని ఆశీర్వదిస్తాడు’ అని మనోజ్‌కుమార్ అనే స్థానికుడు తెలిపాడు.