breaking news
detective novel
-
మాను సంపంగి... మా అబ్బాయి
తెలుగు డిటెక్టివ్ సాహిత్యంలో మధుబాబు కొన్ని దశాబ్దాలు పాఠకులను ఉర్రూతలూగించిన రచయిత. ఆయన సృష్టించిన ‘షాడో’ ఒక సంచలనం. మధుబాబు అసలు పేరు వల్లూరు మధుసూదనరావు. తన కుమారుడు ఉదయ్ పెంపకం గురించి ఆయన పంచుకున్న అనుభవాలు... ‘‘చాలాకాలం క్రితం మేము ఇల్లు నిర్మించుకుంటున్న సమయంలో నా శ్రీమతి ఆదిలక్ష్మి తనకు సంపంగి చెట్టు కావాలని అడిగింది. నూజివీడులో వున్న నర్సరీ నుంచి తీసుకువచ్చాను. మంచి సంపంగి కాదది, మాను సంపంగి. చాలా ఎత్తుకు ఎదుగుతుంది. చిన్న చిన్న ఆకులు కాస్తా వెడల్పు అవుతాయి. నర్సరీ వాడు నన్ను ఏమార్చాడు. ఆ మొక్క నాటినప్పటి నుంచి మొదలయ్యాయి మా కష్టాలు. పెరిగి పెద్దదవుతున్న క్రమంలో ప్రతిరోజూ బండెడు బండెడు ఆకులు రాల్చేది. వాటిని ఎత్తి అవతల పడేయటానికి చాలా ఇబ్బంది పడాల్సి వచ్చేది.పన్నెండు అడుగుల ఎత్తుకు ఎదిగింది చెట్టు. ఒక్క పువ్వు కూడా పూయలేదు. మాతో చాకిరీ చేయించుకోవటానికే అది మా ఇంటికి వచ్చిందని అనుకుంటున్న సమయంలో ఒకరోజు సడన్‌గా ప్రత్యక్షం అయ్యాయి మొగ్గలు. రెండే రెండు రోజుల్లో వికసించాయి. మా ఇల్లేకాదు, చుట్టుపక్కల ఉన్న ఇళ్ళు కూడా గుబాళించిపోయాయి సువాసనతో. మా అబ్బాయికి ఆ మాను సంపెంగకి తేడా ఏమీలేదని నాకు అనిపిస్తోంది ఇప్పుడు తరచి చూసుకుంటుంటే.పసిబిడ్డడిగా ఉన్నప్పుడు పగలంతా నిద్రపోయి, రాత్రిళ్ళు లేచి కూర్చునేవాడు. నా శ్రీమతిని నిద్రపోనిచ్చేవాడు కాదు. నన్ను నా రాతలు రాసుకోనిచ్చేవాడు కాదు. బెడ్ మీద నేను కనిపించకపోతే పాము మాదిరి పాకుతూ నా రైటింగ్ రూములోకి వచ్చి నా టేబుల్ కింద దూరేవాడు. భుజం మీద వేసుకుని వేమన శతకం, దాశరథీ శతకంలో నాకు వచ్చిన పద్యాలన్నిటినీ చెబుతూ రెండు గంటలు తిప్పితే తప్ప ఊరుకునేవాడు కాదు. స్కూల్‌కి టైమ్‌కి వెళ్ళేవాడు కాదు. అక్కడ టీచర్లను చెండుకు తినేవాడు. చూసి చూసి ఆ స్కూల్ ప్రిన్సిపాల్ మేడమ్ నాకు కబురుపెట్టింది. డిజాస్టర్ ఏదో జరిగిందనే అనుమానంతో నేను నా ఉద్యోగానికి ఒకరోజు సెలవు పెట్టి నా శ్రీమతిని తోడు తీసుకుని వెళ్ళాను. ప్రిన్సిపాల్ మేడమ్ చేసిన కంప్లైంట్ వినేసరికి నాకు మతిపోయింది. టీచర్లు చెపుతున్న పాఠాన్ని ఒకసారి విని అప్పటికప్పుడు అప్పగించేస్తున్నాడట. ఏదైనా వర్క్ ఇస్తే క్షణాల మీద పూర్తిచేసి, మిగిలిన పిల్లల్ని డిస్టర్బ్ చేస్తున్నాడట. ‘ఈ తలనొప్పిని మేము భరించలేము, మీ అబ్బాయిని డబల్ ప్రమోషన్ చేస్తున్నాము’ అన్నది ఆమె. అంటే సంవత్సరం మధ్యలో పై తరగతికి కాకుండా ఆపై తరగతికి పంపటం.అలా అలా తన చుట్టూ వున్న వారిని, మమ్మల్ని టెన్షన్ మీద టెన్షన్ పెడుతూ టెన్త్, ఇంటర్ పూర్తిచేసి ఇంజనీరింగ్‌లో జాయిన్ అయ్యాడు. రెండో సంవత్సరంలో బండి కావాలన్నాడు. ఒక సంవత్సరం తాత్సారం చేసి థర్డ్ ఇయర్లో కొనిపెట్టాను. మూడోరోజున తన ఫ్రెండ్‌ని ఎక్కించుకుని ఎనభై స్పీడ్‌లో తీసుకుపోయి కొట్లాడుకుంటున్న కుక్కల మధ్యలోకి పోయి బోర్లాపడ్డాడు. కుక్కలు పారిపోయాయిట. కానీ వీడికీ వీడి దోస్తుకీ మోకాళ్ళు మోచేతులూ చెక్కుకుపోయాయి.ఆ దెబ్బకి బండిని వదిలేస్తాడని ఆశించిన నాకు ఇంకో షాకు. నాలుగు రోజులు గడవకముందే, తగిలిన దెబ్బలు ఆరకముందే అదే దోస్తుతో అదే బండిమీద అదే స్పీడుతో నేషనల్ హైవే మీద కాలేజీకి పోయివచ్చాడు. దిన దిన గండం నూరేళ్ళ ఆయుష్షు మాదిరి తయారైంది పరిస్థితి. మా అదృష్టం బాగున్నది కాబోలు– ఫర్దర్ టెన్షన్లు లేకుండా ఇంజనీరింగ్ పూర్తి అయింది. మాకు తెలియకుండానే మేము పెంచిన మాను సంపెంగ మొగ్గలు వేసి పూలు పూసినట్టు ఒక్కసారిగా మార్పు వచ్చింది వాడిలో.బిట్స్ పిలానీలో పోస్ట్‌గ్రాడ్యుయేషన్ చేశాడు. పెద్ద ప్యాకేజీతో బెంగళూర్‌లో ఉద్యోగం తెచ్చుకున్నాడు. వేదం నేర్చుకున్నాడు. వయొలిన్ వాయించటం అభ్యాసం చేశాడు. రెండుసార్లు సోమయాగం చేసి సోమయాజిగా అనిపించుకున్న పెద్దమనిషి కూతుర్ని– ఆయుర్వేద వైద్యవిద్యలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తున్న అమ్మాయిని భార్యగా పొందాడు. మొక్కల్ని పెంచాలన్నా, పిల్లలని పెంచాలన్నా ఓపిక అవసరమని మాకు అర్థం అయింది. మంచిని మెచ్చుకోవాలి. ఇబ్బందుల్ని సరిదిద్ది సరైన దారికి మరలించాలి. నా సతీమణి ఆదిలక్ష్మి ఇప్పుడు ఈ లోకంలో లేదు. ఉండివుంటే తను పెంచిన మానుసంపంగి పువ్వుల్ని చూసి ఎంత మురిసిపోయిందో, అంతకు లక్షరెట్లు తన బిడ్డ అభ్యున్నతిని చూసి మురుసుకునేది. తన పెంపకమే ఇది. తన కష్టం. తన కడుపు పంట. మొక్కల్ని పెంచాలన్నా, పిల్లలని పెంచాలన్నా ఓపిక అవసరమని మాకు అర్ధం అయింది. మంచిని మెచ్చుకోవాలి. ఇబ్బందుల్ని సరిదిద్ది సరైన దారికి మరలించాలి. షాడో మధుబాబు, రచయిత -
వాళ్లు అలా చేసేవారా?!
రహస్యం ప్రముఖుల జీవితాలను పుస్తకాల్లో చదివేసి మనకు వారి గురించి అన్నీ తెలుసనుకుంటాం. కానీ ఎంత పదిమందికీ తెలిసిన వ్యక్తికయినా కొన్ని రహస్యాలు ఉంటాయి. ఎవరికీ తెలియని అలవాట్లు ఉంటాయి. చరిత్రలో నిలిచిపోయిన కొందరు ప్రముఖుల అలవాట్లు ఎంత వింతగా ఉన్నాయో చూడండి... డిటెక్టివ్ నవలలతో పాఠకులను ఉర్రూత లూగించిన రచయిత్రి అగాథా క్రిస్టీకి అటూ ఇటూ తిరుగుతూ రాయడం అలవాటు. టేబుల్ మీద కూర్చుని రాస్తే ఆలోచనలు వచ్చేవి కావట! సిగ్మండ్ ఫ్రాయిడ్ తన బ్రష్‌కి తాను పేస్ట్ పెట్టుకునేవారు కాదట. ఆయన భార్యే ఆ పని చేసేదట. ఆ సమయం కూడా వృథా చేయకూడదన్న ఉద్దేశంతో మొదలైన ఈ పద్ధతి తర్వాత అలవాటుగా మారిపోయిందట! జర్మన్ రచయిత ఫ్రాంజ్ కాఫ్కా ఏదైనా రచన మొదలు పెట్టేముందు, తర్వాత కిటికీ వద్ద నగ్నంగా నిలబడి వ్యాయామం చేసేవారట. అలా చేస్తే శరీరంతో పాటు మనసు కూడా ఉత్తేజితమవుతుందని అనేవారట. రచన ముగిసిన తరువాత అయితే పది నిమిషాలు ఎక్కువసేపు చేసేవారట! ప్రముఖ సంగీతకారుడు బీతోవెన్కి కాఫీ తాగకపోతే క్షణం కూడా బుర్ర పని చేసేది కాదట. ఆయన రోజుకు యాభై కప్పులకు పైగా కాఫీ తాగేవారట! ఏదైనా రచన చేయాలంటే ముందుగా స్టీఫెన్ కింగ్ ఓ చీజ్ కేక్ ముక్క తినాల్సిందే. అప్పుడే ఆయన పెన్ను కదిలేదట! చార్లెస్ డికెన్‌స ఎప్పుడూ ఉత్తర దిక్కుకు అభిముఖంగా పడుకుని నిద్రించేవారట. అలా చేస్తే సృజనాత్మకత పెరుగుతుందని ఆయన నమ్మేవారట! తెల్లకోటు వేసుకుని, తన పొట్ట నేలకి ఆనేలా పడుకుని రాసుకునేవారట జేమ్స్ జాయిస్. అంతేకాదు... నీలిరంగు పెన్సిల్‌తోనే రాసేవారట! స్పానిష్ చిత్రకారుడు సాల్వెడార్ డాలీకి నిద్ర వస్తే... ఓ మెటల్ గిన్నెను నేలమీద పెట్టి కుర్చీలో వెనక్కి వాలేవాడు. చేతిలో ఓ స్పూన్ పట్టుకుని, దాన్ని గిన్నె దిశగా ఉంచి నిద్రకు ఉపక్రమించేవాడు. బాగా మత్తు వచ్చాక చెంచా జారి గిన్నె మీద పడినప్పుడు ఆ శబ్దానికి లేచి కూచునేవాడు. ఎందుకిదంతా అని ఎవరైనా అడిగితే... నాకు కాస్తంత నిద్ర సరిపోతుంది, అందుకే ఈ ఏర్పాటు అనేవాడట!


