breaking news
dependent
-
ఆశ్రిత లక్షణం
తమకు జీవితాన్ని ప్రసాదించి, తాము చేసే పనికి ఎంతోకొంత సొమ్మును పారితోషికంగా ఇచ్చి రక్షించే యజమానిని ఆశ్రితులు సైతం రక్షించడం పరమ విధి. అసలు ఆశ్రితులు అంటే ఎవరు? బాధల్లో ఉన్నప్పుడు గానీ, మనకు ఏదైనా అవసరం వచ్చినప్పుడు ‘‘నేనున్నాను’’ అని చెంత నిలిచి ఆదరించేవాడు మిత్రుడు, ఆ రకంగా విపత్తులో మేలు పొందినవాడు ఆశ్రితుడు. పెద్ద అర్థంలో తీసుకుంటే, జగతిలోని జీవులందరూ ఆశ్రితులే..!! అందరినీ రక్షించేది ఆ పరంధాముడే..!!ఈ విశాల విశ్వంలో ఏదో ఒక అవసరాన్ని తీర్చుకునేందుకు మనం మరొకరి మీద ఆధారపడక తప్పదు. ఆ విధంగా ఆపత్కాలంలో మనను ఆదుకున్నవాళ్ళను వదిలి వేయకుండా, వీలున్నంతగా సహాయం చేయగలగడమే ఉత్తమ ఆశ్రిత లక్షణం. ఇక, ప్రస్తుత ప్రపంచంలో విభిన్న రకాలవ్యాపకాల్లో, ఉద్యోగాల్లో తమ విధులు నిర్వహించే ఉద్యోగులందరూ ఆశ్రితుల కోవలోకే వస్తారు. తమ సంస్థ ఒక్కొక్కసారి అభివృద్ధిలో ఉన్నతస్థానంలో నిలువవచ్చు, మరొకసారి ఊహించని ఇబ్బందుల్లో కూరుకుపోవచ్చు. అయితే, సంస్థ ఉత్థానంలో ఏ విధంగా ఉద్యోగులు ఆనందించి, తమ వ్యక్తిగత ప్రగతికి బాటలు వేసుకున్నారో, ఆ సంస్థ కష్టాల్లో, నష్టాల్లో కూరుకుపోతున్నప్పుడు, సంస్థను వీడకుండా, తమ వంతు సహకారాన్ని అందించాలి. తాము సంస్థకు వెన్నెముకగా ఉన్నామని, ఏ ఇబ్బందినైనా దాటడంలో తాము అహరహం కృషి చేస్తామని యాజమాన్యానికి భరోసా యివ్వాలి. ఎక్కడ తమకు ఎక్కువ జీతం, సదుపాయాలు ఉంటాయో, అక్కడికి తక్షణమే మారిపోయే ప్రస్తుత తరానికి చెందిన యువతీ యువకులు ఈ మాటలు వింటే నవ్విపోతారు. వారి దృష్టిలో ఈ విధంగా నడుచుకోవడం దాదాపుగా అసాధ్యం. కానీ, ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న సమయంలో తోడుగా నిలిచి, ఉత్తేజాన్ని అందించే ఈ ఉత్తమ లక్షణం సంస్థకు భవితను చూపడంలో అత్యంత అవసరం. ఏ సంస్థ మనుగడకైనా నమ్మకస్తులైన ఉద్యోగులు చాలా అవసరం. వారి అంకితభావం, సంస్థ తమ సొంతం అన్న బలీయమైన అనుబంధం వల్లనే ఆ సంస్థ లేక వ్యవస్థ నాలుగు కాలాలపాటు పచ్చగా నిలబడుతుంది. శతాబ్దాలుగా వ్యాపార వ్యవహారాలను అచ్చెరువొందేలా నిర్వహిస్తూ, చెదరని నమ్మకానికి నమూనాగా నిలిచిన అగ్రగామి సంస్థల రహస్యం ఆ సంస్థను ఆశ్రయించి ఉండడమే గాక, సర్వకాల సర్వావస్థల్లో తమ సహకారాన్ని అందించే ఉద్యోగులే..!!ఇక, రామాయణ కథలోనూ అత్యంత విశ్వసనీయులైన ఆశ్రితులు మనకు తారసపడతారు. ముందుగా చెప్పుకోవలసింది సుగ్రీవుడు. అన్నయైన వాలిపట్ల భయంతో కొండల్లో తలదాచుకున్న సుగ్రీవుడు, శ్రీరాముని శరణు వేడి, రఘువీరుని పరాక్రమంతో వాలి నిహతుడు కాగా, తాను కిష్కింధకు రాజయ్యాడు. సీతాన్వేషణ ఘట్టంలో నలుచెరగులకు వానరులను పంపి, శ్రీరామునికి ప్రీతిని కలిగించాడు. అదే విధంగా చెప్పుకోవలసిన మరొక అద్భుత పాత్ర విభీషణునిది. అన్న ధర్మవిహితమైన తన మాటలను పెడచెవిని పెట్టడంతో రాముని శరణు వేడాడు. రావణుని తమ్ముడైన విభీషణునికి శరణాగతిని ప్రసాదించి, ఆశ్రయమిచ్చాడు. రాముని నీడలో ఆశ్రితుడైన విభీషణుడు రామునికి యుద్ధ సమయంలో లంకలోని రాక్షసుల బలాబలాలను, బలహీనతలను తెలియజేసి, దుష్ట సంహారానికి బాటలు వేశాడు. ఆఖరికి అయోధ్య త్వరగా చేరాలన్న రాముని ఆతృతను గమనించి, శ్రీరాముని తన పుష్పక విమానంలో సాగనంపి, తన శుభ లక్షణాలను లోకాలన్నిటికీ ఘనంగా తెలియజేశాడు. అధునాతన యుగంలోనూ ఆశ్రితులు ఈ విధంగా తమకు ఆశ్రయమిచ్చిన వారికి సహకరిస్తే, సంస్థలు ఇతోధికంగా వృద్ధి చెందుతాయని, దేశ పురోగతికి బంగరు బాటలు ఏర్పడతాయని చెప్పడంలో ఎటువంటి సందేహమూ లేదు.పచ్చటి కోరికభారతీయ పురాతన కాలానికి చెందిన ఒక కథను ఈ సందర్భంలో పరికించడం సమంజసం. కాశీదేశంలో ఒక వేటగాడు విషపూరితమైన బాణాన్ని లేడిపై ప్రయోగించగా అది పచ్చటి ఫలవృక్షానికి తాకింది. దాని ప్రభావం వల్ల ఆ చెట్టు కొద్ది కాలానికి పూర్తిగా ఎండిపోయింది. ఆ చెట్టు తొర్రలో కొంతకాలంగా ఒక చిలుక నివసిస్తూ ఉండేది. ఎండిపోయినా, ఆ చెట్టును వీడిపోకుండా చిలుక ఆ చెట్టు తొర్రలోనే నివాసం ఉండసాగింది. ఒకానొక సందర్భంలో దేవరాజైన ఇంద్రుడు ఆ చిలుకతో సంభాషిస్తూ, ‘‘ఓ చిలుకా.. ఈ చెట్టు పూర్తిగా ఎండిపోయింది. ఈ చెట్టు తొర్రలో ఉండడంవల్ల నీకు ఎటువంటి ప్రయోజనం లేదు, పచ్చగా ఉన్న మరొక చెట్టును ఆశ్రయించి, నీవు ఆనందంగా గడుపు’’ అని సలహా యిచ్చాడు. ఇంద్రుని మాటలకు ప్రత్యుత్తరమిస్తూ, ఆ చిలుక ‘‘చెట్టు పండినపుడు ఉండడం, ఎండినపుడు విడిచిపోవటం కృతఘ్నత కదా.. ఈ చెట్టు ఎండిపోయినా, నేను ఇక్కడే ఉంటాను..’’ అంది. దేవేంద్రుడు ఆ చిలుక మాటలకు ఎంతగానో సంతోషించాడు. చిలుకను ఏదైనా వరం కోరుకోమన్నాడు. అప్పుడు ఆ చిలుక ‘‘స్వామీ..! ఈ చెట్టుకు పూర్వ వైభవాన్ని అనుగ్రహించు’’ అని కోరింది. ఆ చిలుక కోరిన విధంగానే దేవేంద్రుడు ఆ చెట్టు మళ్ళీ పచ్చగా ఉండేలా కటాక్షించాడు. ఆ విధంగా ఆశ్రితురాలైన ఆ చిలుక వల్ల ఆ చెట్టుకు మేలు జరిగి, పునర్వైభవాన్ని పొందింది. ఆశ్రితుల లక్షణం ఇంత చక్కగా ఉంటే, యజమాని లేక సంస్థకు ఎంతో మేలు జరుగుతుందని ఈ కథ మనకు తెలియజేస్తుంది.– తత్వ ప్రవచన సుధాకరవెంకట్ గరికపాటి -
కారుణ్య నియామకం సంపూర్ణ హక్కు కాదు
న్యూఢిల్లీ: ప్రభుత్వ ఉద్యోగి విధుల్లో ఉండగా మరణిస్తే అతని/ఆమె డిపెండెంట్‌కు కారుణ్య నియామకం సంపూర్ణ హక్కు కాదని సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది. ఇటువంటి సందర్భాల్లో మరణించిన వ్యక్తి కుటుంబం ఆర్థిక స్థితిగతులు, అతడు/ఆమెపై ఆ కుటుంబంలోని వారు ఏ మేరకు ఆధారపడ్డారు, వారు వృత్తి, వ్యాపారాల్లో కొనసాగుతున్నారా వంటి అనేక అంశాలను పరిగణనలోకి తీసుకున్నాకే కారుణ్యనియామకాన్ని చేపట్టాల్సి ఉంటుందని జస్టిస్ హేమంత్ గుప్తా, జస్టిస్ రామసుబ్రమణియన్ల సుప్రీంకోర్టు ధర్మాసనం గురువారం స్పష్టం చేసింది. సర్వీస్ నిబంధనల్లో కారుణ్య నియామకం కూడా ఒక్కటై, ఉద్యోగి మరణించిన సందర్భాల్లో ఆటోమేటిక్‌గా, ఎలాంటి పరిశీలనలు జరపకుండా కారుణ్య నియామకం చేపడితే అది సంపూర్ణ చట్టబద్ధ హక్కు అవుతుందని సుప్రీంకోర్టు తెలిపింది. ‘కానీ, ప్రస్తుతం కారుణ్య నియామకం అలా కాదు. అది వివిధ పరామితులకు లోబడి ఉంటుంది. చనిపోయిన ఉద్యోగి కుటుంబం ఆర్థిక పరిస్థితులు, ఆ కుటుంబం ఏమేరకు ఆ మృత ఉద్యోగిపై ఆధారపడి ఉంది, వారు సాగిస్తున్న వివిధ వృతులు, ఉద్యోగాలు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది’ అని సుప్రీంకోర్టు పేర్కొంది. ఈ మేరకు భీమేశ్ అనే వ్యక్తికి కారుణ్య కారణాలతో ఉద్యోగం ఇవ్వాలంటూ కర్ణాటక హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను పక్కన బెడుతూ సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పు వెలువరించింది. భీమేశ్ సోదరి కర్ణాటక ప్రభుత్వ పాఠశాలలో అసిస్టెంట్ టీచర్‌గా పనిచేస్తూ 2010లో చనిపోయారు. అవివాహిత అయిన ఆమెకు తల్లి, ఇద్దరు సోదరులు, ఇద్దరు సోదరీమణులు ఉన్నారు. సోదరి ఆదాయంపై తమ కుటుంబం ఆధారపడి ఉన్నందున తనకు కారుణ్య కారణాలతో ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వాలంటూ భీమేశ్ వాదించగా అధికారులు తిరస్కరించారు. దీంతో, ఆయన అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్‌కు వెళ్లగా తీర్పు అనుకూలంగా వచ్చింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్ వేయగా, ట్రిబ్యునల్ తీర్పునే కర్ణాటక హైకోర్టు కూడా సమర్థించింది. దీంతో, ఆ రాష్ట్ర విద్యాశాఖ తాజాగా సుప్రీంకోర్టు తలుపుతట్టింది. -
డీమర్స్ కోసం యూఎస్ కాంగ్రెస్‌లో బిల్లు
వాషింగ్టన్: దేశంలో చాన్నాళ్లుగా నాన్ ఇమిగ్రంట్ వీసాపై ఉన్నవారితో పాటు డిపెండెంట్స్‌గా అమెరికా వచ్చిన పిల్లలకు(డాక్యుమెంటెడ్ డ్రీమర్స్) శాశ్వత నివాస సదుపాయం కల్పించే దిశగా ముందడుగు పడింది. డెమొక్రటిక్, రిపబ్లికన్ పార్టీల సభ్యులు సంబంధిత బిల్లును కాంగ్రెస్‌లో ప్రవేశపెట్టారు. ఈ నిర్ణయంతో పలువురు భారతీయ పిల్లలు, యువతకు ప్రయోజనం కలగనుంది. ప్రస్తుతమున్న నిబంధనల ప్రకారం నాన్ ఇమిగ్రంట్ వీసాదారుల పిల్లలు, 21 ఏళ్ల వయస్సు దాటితే, స్వదేశానికి వెళ్లాల్సి ఉంటుంది. అమెరికాలో ఈ డాక్యుమెంటెడ్ డ్రీమర్స్ సంఖ్య దాదాపు 2 లక్షలు ఉంటుంది. వారిలో భారతీయులు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నారు. -
జీవిత భాగస్వామికి ఎక్స్2 వీసాకు ఓకే
న్యూఢిల్లీ: విదేశీ పౌరుల్ని వివాహం చేసుకునే భారతీయులకు కేంద్రం శుభవార్త తెలిపింది. భారతీయుల్ని పెళ్లి చేసుకున్న విదేశీయులు తమ పర్యాటక వీసాలను ఎక్స్2(డిపెండెంట్) వీసాలుగా మార్చుకునేలా నిబంధనల్ని సవరించనున్నట్లు వెల్లడించింది. ఇటీవల ఓ భారతీయుడు ఫిలిప్పైన్స్ మహిళను అక్కడే వివాహం చేసుకున్నారు. అనంతరం ఆమె పర్యాటక వీసాపై భారత్‌కు వచ్చారు. ఆ తర్వాత పర్యాటక వీసాను ఎక్స్2 వీసాగా మార్చాలని వధువు దరఖాస్తు చేసుకోగా నిబంధనలు అంగీకరికపోవడంతో అధికారులు దాన్ని తిరస్కరించారు. ఫిలిప్పైన్స్కు వెళ్లి ఎక్స్2 వీసా కోసం మరోసారి దరఖాస్తు చేసుకోవాలని ఆమెకు సూచించారు. దీంతో ఆమె భర్త ఈ విషయమై హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు ఫిర్యాదు చేశారు. రాజ్‌నాథ్ ఆదేశాలతో వెంటనే స్పందించిన హోంశాఖ.. పర్యాటక వీసాను ఎక్స్2 వీసాగా మార్చేందుకు అడ్డుగా ఉన్న నిబంధనల్ని సవరించనున్నట్లు తెలిపింది. అలాగే భారతీయులు విదేశాల్లో పెళ్లి చేసుకుంటే వారి జీవిత భాగస్వామికి ఎక్స్2 వీసా ఇచ్చేందుకు ఇప్పటివరకూ అడ్డంకిగా ఉన్న నిబంధనల్ని మార్చనున్నట్లు వెల్లడించింది. కాగా, ఈ వెసులుబాటు పాకిస్తాన్, అఫ్గానిస్తాన్, సూడాన్, ఇరాక్ దేశాలు, పాక్ సంతతి పౌరులు, ఏ దేశానికి చెందనివారికి వర్తించబోదని పేర్కొంది. -
వారసత్వ ఉద్యోగాలు పునరుద్ధరించాలి
జీఎం కార్యాలయం ఎదుట డిపెండెంట్ల ధర్నా కోల్‌బెల్ట్(వరంగల్) : సింగరేణిలో సర్వీసు నిబంధనలు లేకుండా వారసత్వ ఉద్యోగాలు పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ సింగరేణియన్ సన్స్ అసోసియేషన్(ఎస్ఎస్ఏ) ఆధ్వర్యంలో భూపాలపల్లి ఏరియా జీఎం కార్యాలయం ఎదుట శుక్రవారం ధర్నా నిర్వహించా రు. అనంతరం సింగరేణి అధికారులకు వినతి పత్రం అందజేశారు. ధర్నా కార్యక్రమానికి సంఘీభావం తెలిపిన టీడీపీ జిల్లా అధ్యక్షుడు గండ్ర సత్యనారాయణరావు మాట్లాడుతూ సింగరేణి గుర్తింపు సంఘం, సార్వత్రిక ఎన్నికల సమయంలో టీఆర్ఎస్ నాయకులు ఇచ్చిన హామీలను నెరవేర్చలేక పోయారని ఆరోపించారు. సింగరేణిలో లక్ష ఉద్యోగాలు కల్పిస్తామని, నూతన గనులు ఏర్పాటు చేస్తామని ప్రకటనలు చేసిన కేసీఆర్ కార్మికులను మోసం చేస్తున్నారని అన్నారు. వారసత్వ ఉద్యోగాల సాధనకు చేపట్టే ఉద్యమంలో తమ పార్టీ పాలుపంచుకుంటుందని ఆయన ప్రకటించారు. కార్యక్రమంలో ఎస్ఎస్ఏ నాయకులు మెండే కృష్ణకుమార్, సిద్ధిక్ షేక్, కిషోర్‌కుమార్, రాజ్‌కుమార్, వినోద్, రామారావు, శివ, ప్రకాశ్, నరేష్, శ్రీధర్, తిరుమలేష్ తదితరులు పాల్గొన్నారు. -
అవని హరిత వనం..మానవునికి హితం
నేడు 67 వనమహోత్సవం ’జిల్లాలో తగ్గుతున్న అడవుల విస్తీర్ణం మొక్కలే సకల జీవుల మనుగడకు మూలాధారం. మారుతున్న కాలంలో అడవుల విస్తీర్ణం తగ్గుతోంది. ఇది జీవకోటికి ముప్పుగా పరిణమిస్తుంది. అందుకే ఇప్పటికే వనం వైపు మనం సాగాలన్న సంకేతాలు జనంలోకి వెళుతున్నాయి. ఈ క్రమంలో అందరి శ్వాస, ధ్యాస హరిత హితం కావాలన్న జాగురుకతతో నేటి తరం ముందుకు సాగాల్సి ఉంది. అందుకే అటవీశాఖ నవ్యాంధ్రను హరితాంధ్రగా మార్చడానికి ప్రజలను చైతన్య పరిచి, మొక్కల పెంచాలన్న ఆశయంతో ముందుకు సాగుతోంది. నేడు వనమహోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం. పలమనేరు: పర్యావరణంతో మానవ మనుగడ ముడిపడి ఉంది. పర్యావరణ సమతుల్యత పరిరక్షణలో ప్రతి జీవరాశి తనవంతు పాత్రను పోషిస్తుంది. రకరకాల జీవరాసులు మనుగడతోనే మానవ మనుగడ సాధ్యమవుతుంది. వీటి సంఖ్య తగ్గే కొద్ది ఆ ప్రభావం మానవుడి మనుగడపై పడుతుంది. జీవవైవిధ్యాన్ని కాపాడుకోవాంటే అడవులు విస్తీర్ణం పెరగాల్సిన అవసరం ఉంది. అందుకే ప్రతి ఒక్కరు పచ్చదనాన్ని పెంపొందించుకోవడానికి నడుం బిగించాలి. ఇదే తలంపుతో రాష్ట్ర ప్రభుత్వం వనం–మనం పేరుతో ఏటా జూలై 29న వనమహోత్సవాన్ని జరుపుతోంది. ఇందులో భాగంగానే ప్రజల భాగస్వామ్యంతో నేడు రాష్ట్రంలో కోటి మొక్కలను నాటేందుకు ప్రభుత్వం సన్నద్ధమైంది. ఈ క్రమంలోనే జిల్లాలో సుమారు 15 లక్షల మొక్కలను నాటేలనే లక్ష్యాన్ని పెట్టుకుంది. అందుకే వనమహోత్సవాన్ని అటవీశాఖ ద్వారా నిర్వహిస్తోంది. తగ్గుతున్న అడవుల విస్తీర్ణం.... జిల్లాకు సంబంధించి భౌగోళిక అటవీ ప్రాంతం 15,151 చదరపు కిలోమీటర్లు. ఇందులో ఏడు ప్రాంతాల్లో మాత్రం అతి దట్టమైన అడవులు, 29 ప్రాంతాల్లో దట్టమైన అడవులున్నాయి. ఓపెన్ ఫారెస్ట్‌గా 1463 కి,మీ, మిగిలినవి చట్టడవులుగా వ్యాపించి ఉన్నాయి. మొత్తం విస్తీర్ణంలో అడవులు 15.83 శాతం విస్తరించి ఉన్నాయి. అయితే గత పదేళ్లలో అడవుల విస్తీర్ణంలో మూడు శాతం తగ్గడం ఆందోళన కలిగిస్తోంది. అడవుల బలహీనం.. వన్యప్రాణుల ఉనికి ముప్పు జిల్లాలోని శేషాచలం, కౌండిన్య అడవులు వన్యప్రాణులకు నిలయాలుగా ఉన్నాయి. ఈ అడవుల్లో వందలాది ఏనుగులు, వేలాది జింకలు, దుప్పులు, కణితలు, ఎలుగుబంట్లు, కొన్ని హైనాలు, చీటాలు ఉన్నాయి. వీటితో పాటు అడవి గొర్రెలు, కుందేళ్లు, బావురు పిల్లులు, ఉడుములు, నక్కలు, నెమళ్లు ఉన్నాయి. ఇవిగాక 40 రకాల క్షీరదాలు,160కి పైగా పలురకాల పక్షులు, అరుదైన కొంగలు, వంద రకాల సీతాకోక చిలుకలు, నక్షత్ర తాబేళ్లు, ఇతర కీటకాలతో పాటు మరికొన్ని జంతువులు ఉన్నాయి. అయితే అడవుల విస్తీర్ణం తగ్గి వన్యప్రాణుల సంఖ్య కూడా తగ్గుతోందని అటవీశాఖ ఘణాంకాలు చెబుతున్నాయి. ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి ’శివన్న, ఎఫ్ఆర్వో, పలమనేరు. వనం మనంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలి. మొక్కల పెంపకంపై తమశాఖ ప్రజల్లో అవగాహన కల్పిస్తూనే ఉంది. మొక్కలను పెంచితే కాలుష్యం తగ్గి మానవ మనుగడకు ఎంతో మేలు చేస్తుంది. అందుకే అడవులను రక్షించుకుందాం. కనీసం ఇంటికో మొక్కను పెంచినా చాలు. సమాజంలో మార్పు రావాలి. అప్పుడే పచ్చదనం వెల్లివిరుస్తుంది.